ఏపీ: కోవిడ్‌ చికిత్సకు మరింత ఇద్దాం.. | CM YS Jagan High Level Review On Corona Control Measures | Sakshi
Sakshi News home page

ఏపీ: కోవిడ్‌ చికిత్సకు మరింత ఇద్దాం..

Published Fri, Apr 30 2021 8:53 AM | Last Updated on Fri, Apr 30 2021 3:57 PM

CM YS Jagan High Level Review On Corona Control Measures - Sakshi

ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

‘కోవిడ్‌ చికిత్సకు ఇప్పుడు ఇస్తున్న రేట్లు పెంచండి. ప్రభుత్వ జాబితా (ఎంప్యానెల్‌)లో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రులలో కోవిడ్‌ చికిత్సకు వెంటనే రేట్లు పెంచండి. అవే రేట్లను కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల (ఎంప్యానెల్‌)కు కూడా వర్తింపచేయండి. ఏ ఆస్పత్రి (ప్రభుత్వ ఎంప్యానెల్‌)లో కూడా కోవిడ్‌ చికిత్సకు నిరాకరించకుండా చూడండి. కోవిడ్‌ ఆస్పత్రులలో పని చేస్తున్న ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వోలకు ప్రోత్సాహకంగా అదనంగా నాలుగు నెలల పాటు గౌరవ భృతి ఇవ్వాలి’
– సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచాలని సీఎం వైఎస్‌ జగన్‌ వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. ఎక్కడా బెడ్ల కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌ సెంటర్ల (సీసీసీ)లో తప్పనిసరిగా 3 వేల బెడ్లు ఉండాలని, ఆక్సిజన్‌ బెడ్లు 1,000, నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు 2,000 తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. కోవిడ్‌ చికిత్సకు ఇస్తున్న రేట్లను పెంచాలని, అవసరమైన అన్ని చోట్ల సిబ్బందిని తక్షణం నియమించాలని సూచించారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు ఆస్పత్రుల వద్ద ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏ ఆస్పత్రిలోనూ (ప్రభుత్వ ఎంప్యానెల్‌) కోవిడ్‌ చికిత్సకు నిరాకరించకుండా చూడాలని, కోవిడ్‌ ఆస్పత్రులలో పని చేస్తున్న ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓల జీతాలు పెంచాలని, రోగులకు వైద్య సేవల్లో ఎక్కడా ఇబ్బంది రాకూడదని సీఎం స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ, నివారణ, చికిత్సలపై సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

422 కోవిడ్‌ ఆస్పత్రులు..
రాష్ట్రంలో ప్రస్తుతం 422 కోవిడ్‌ ఆస్పత్రుల్లో(ప్రభుత్వ, ప్రైవేటు) 35,644 బెడ్లు ఉండగా 21,590 నిండినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు. దాదాపు 79 వేల మంది హోం ఐసొలేషన్‌లో, మరో 6,348 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నారని, 14,862 మంది ఆక్సిజన్‌ బెడ్లపై చికిత్స పొందుతున్నారని, గత 24 గంటల్లో 14 వేల కేసులు కొత్తగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ పాల్గొన్నారు.

వెంటనే సిబ్బంది నియామకం..
రాష్ట్రంలోని అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో అవసరమైన వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని వెంటనే నియమించండి. సిబ్బంది లేకపోవడం వల్ల ఏ ఆస్పత్రిలో కూడా వైద్య సేవలకు అంతరాయం కలగొద్దు.

ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా..
కోవిడ్‌ చికిత్సలో కీలకమైన ఆక్సిజన్‌ తగినంత ఉండేలా అవసరమైన చోట్ల  42 పీఎస్‌ఏ (ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్ప్సన్‌) ప్లాంట్లు ఏర్పాటు చేయండి. ఆక్సిజన్‌ ట్యాంకర్లు కొనుగోలు చేసి టీచింగ్‌ ఆస్పత్రులతో పాటు ఇతర ఆస్పత్రుల వద్ద అందుబాటులో ఉంచండి. టీచింగ్‌ ఆస్పత్రుల వద్ద 10 కేఎల్‌ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్‌ సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఉండాలి. వీలైనంత త్వరగా ఇవన్నీ ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టండి.

చదవండి: ఏపీ: 24 గంటల్లోనే కోవిడ్‌ టెస్టుల ఫలితాలు 
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement