తిరుమలలో పరకామణి భవనాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం దేవదేవుడిని మరోమారు దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి.. దర్శనానంతరం తిరుమలలోనే బసచేసిన సీఎం రెండవ రోజు శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం వద్ద ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఇస్తికఫాల్ (లడ్డు, చందనం) స్వాగతం పలికారు.
ఆలయంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్.. ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈఓ తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.
అత్యాధునిక పరకామణి భవనం ప్రారంభం
స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం మాఢవీధుల్లో కాలినడకన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మీదుగా పరకామణి భవనం వద్దకు బయలు దేరారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో చేతులు ఊపుతూ కనిపించిన భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రూ.23 కోట్లు వెచ్చించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలాజీ నగర్ ప్రాంతంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సొంత నిధులతో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు.
‘ముక్తిస్థావరం’ పుస్తకావిష్కరణ: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి క్షేత్ర విశిష్టత, భక్త కన్నప్ప చరిత్ర, స్వర్ణముఖి నది విశిష్టత, పాతాళ వినాయకుని వైభవం, రాహుకేతు శాంతి, గర్భగుడి రహస్యాలు, ఆలయ శిల్పం, వాస్తు, స్వామి అమ్మవార్ల పురాతన ఆభరణాల చరిత్ర, ఆలయ గోడలపై చిత్రలేఖనం, పురాతన శాసనాలు, అనుబంధ ఆలయాల సమాచారం.. తదితర వివరాలతో ముద్రించిన ‘ముక్తి స్థావరం’ పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, కొట్టు సత్యనారాయణ, రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment