ప్రాజెక్టులన్నీ చకచకా | CM YS Jagan Inaugurated Sangam Barrage and Nellore Barrages | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులన్నీ చకచకా

Published Wed, Sep 7 2022 3:44 AM | Last Updated on Wed, Sep 7 2022 6:20 PM

CM YS Jagan Inaugurated Sangam Barrage and Nellore Barrages - Sakshi

నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

దేవుడి దయ వల్ల వరుసగా నాలుగో ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. రైతన్నల మొహంలో చిరునవ్వు కనిపిస్తోంది. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. అంతటా ఒక మంచి వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీని జాతికి అంకితం చేస్తున్నాం.

ఈ రోజు ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే కాదు.. దేవుడి దయతో ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు 26 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో తీసుకున్నాం. ప్రతి ప్రాజెక్టును కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తామని హామీ ఇస్తున్నాను. మీ అందరి చల్లని దీవెనలతో దేవుడు మరింతగా మంచి చేసే అవకాశం ఇవ్వాలని.. తద్వారా రైతన్నలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.     
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సంగం, నెల్లూరు బ్యారేజీలు మాత్రమే కాకుండా, దేవుడి దయతో ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల నాన్నగారు ప్రదర్శించిన చిత్తశుద్ధిని అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ.. 26 ప్రాజెక్టులనూ నిర్మిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను జాతికి అంకితం చేశారు.

సంగం, నెల్లూరు బ్యారేజీల వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, సంగం బ్యారేజీ వద్ద దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగం బ్యారేజీ వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మనందరి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.320 కోట్లు ఖర్చు చేసి.. సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశామని చెప్పారు.

ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగు నీటిని స్థిరీకరించామని.. తద్వారా ఆత్మకూరు, నెల్లూరు రూరల్‌.. సర్వేపల్లి, కోవూరు, కావలి నియోజకవర్గాలకు మంచి చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామన్నారు. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.85 లక్షల ఎకరాలకు వరప్రదాయిని అయిన సంగం బ్యారేజీని ప్రాధాన్యతా ప్రాజెక్టుగా చేపట్టి, నిర్మాణంలో వేగం పెంచి పూర్తి చేశామని చెప్పారు.

‘మనం అధికారంలోకి వచ్చాక 9 నెలలు తిరక్క ముందే కోవిడ్‌ సమస్య వచ్చింది. మరోవైపు పెన్నా నదిలో వరుసగా రెండేళ్ల పాటు వరదలు వచ్చాయి. అయినా అన్ని ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ఈ ప్రాజెక్టు పనుల మీద దృష్టి పెట్టి పూర్తి చేశాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
చిత్రంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరుల 

దివంగత సీఎం వైఎస్సార్‌ వల్లే మోక్షం
► దాదాపు 140 ఏళ్ల క్రితం బ్రిటీష్‌ వారి హయాంలో సంగం వద్ద కట్టిన ఆనకట్ట కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. అయినా గత పాలకులెవరూ దీనిని పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టు చేపట్టి, నెల్లూరు జిల్లాకు మంచి చేయాలని ఆలోచించలేదు. 
► దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఈ జిల్లాకు మోక్షం వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేందుకు అడుగులు ముందుకు పడ్డాయి. 2006లో సంగం బ్యారేజ్‌ పనులు, ఆ తర్వాత నెల్లూరు బ్యారేజీ పనులు ప్రారంభమయ్యాయి.
► 2009లో నాన్నగారు మన మధ్య నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత ఈ రెండు ప్రాజెక్టులను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు ఆ పెద్దాయనకు కొడుకుగా, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయగలిగానని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

టీడీపీ హయాంలో ముహూర్తాలు తప్ప పనుల్లేవు
► 2014లో రాష్ట్రం విడిపోయాక టీడీపీ ప్రభుత్వ హయాంలో.. సంగం బ్యారేజీ కోసం కేవలం రూ.30.85 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. 2017 నాటికి పూర్తి చేస్తామని ఒకసారి.. 2018 నాటికి పూర్తి చేస్తామని మరోసారి.. 2019 నాటికి పూర్తి చేస్తామని ఇంకోసారి చెప్పారు. ఇలా ముహూర్తాల మీద ముహూర్తాలు మార్చుకుంటూ పోయారే తప్ప.. ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏరోజూ ఆలోచన చేయలేదు.
► వారు చేసిందల్లా ప్రాజెక్టుల్లో రేట్లు పెంచేయడం, ఎస్కలేషన్‌ ఇచ్చేయడం.. ఆ తర్వాత కమీషన్లు దండుకోవడమే. చంద్రబాబు హయాం అంతటా ఇదే తీరున అడుగులు పడటం చూశాం. 

గౌతమ్‌ జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు..
► మనందరి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు కోవిడ్‌ సమస్యలు, మరోవైపు వరదల వంటి ప్రతికూల పరిస్థితులు. అయినా మూడేళ్లనే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసి సంగం ప్రాజెక్టును పూర్తి చేశాం. నాకు మిత్రుడు, మంచివాడు, ఆత్మీయుడు అయిన మేకపాటి గౌతంరెడ్డి నిజానికి ఈరోజు ఇక్కడ మనందరి మధ్య ఈ ప్రాజెక్టును ప్రారంభించే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సింది. 
► గౌతమ్‌ హఠాన్మరణంతో మనందరికీ దూరమయ్యాడు. ఆ రోజు గౌతమ్‌ సంస్మరణ సభలో చెప్పిన మాటను ఈ రోజు నిలుపుకున్నాం. అతని జ్ఞాపకార్థం సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ అని పేరు పెడుతున్నాం. తద్వారా గౌతమ్‌ చిరస్థాయిగా ఎప్పుడూ మన మనస్సులోనే ఉంటాడు. ఈ బ్యారేజ్‌ వల్ల ఇప్పుడు పెన్నా డెల్టా కనిగిరి కాలువ కింది 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద మరో 63 వేల ఎకరాలు, కావలి కాలువ కింద మరో 75 వేల ఎకరాలు వెరసి.. 3.85 లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 
బ్యారేజీల ప్రారంభోత్సవ సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం 

నెల్లూరు బ్యారేజీకి వైఎస్సార్‌ శ్రీకారం
► 150 సంవత్సరాల క్రితం నిర్మించిన నెల్లూరు ఆనకట్ట శిథిలావస్థకు చేరితే, పట్టించుకునే నాథుడు లేక దాదాపు లక్ష ఎకరాలకు నీరందించలేని స్థితికి చేరింది. అప్పట్లో ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి చొరవ చూపడం వల్ల మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు ముందుకు పడ్డాయి. 
► ఆనాడు ప్రాజెక్టు వ్యయం రూ.147 కోట్లుగా అంచనా వేస్తే.. రూ.86 కోట్లు ఖర్చు చేసి, ప్రియతమ నేత  ప్రాజెక్టును పరుగులు తీయించగలిగారు. నాన్నగారు చనిపోయాక ఈ ప్రాజెక్టు మళ్లీ నిర్లక్ష్యానికి గురైంది. మనందరి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టునూ పూర్తి చేసి.. జాతికి అంకితం చేస్తున్నాం. 

రూ.85 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా
► సోదరుడు, ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి.. కొన్ని సమస్యలు చెప్పారు. జాతీయ రహదారి నుంచి సంగం బ్యారేజ్‌కు నేరుగా రహదారి నిర్మాణానికి రూ.15 కోట్లు అవుతుందన్నారు. అది మంజూరు చేస్తున్నాను. 
► ఆత్మకూరు నియోజకవర్గంలో 12 ఇరిగేషన్‌ పనులకు సంబంధించి రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నా. నియోజకవర్గంలో 25 ఊళ్లకు రహదారి నిర్మాణానికి రూ.14 కోట్లు, ఆత్మకూరు మున్సిపాల్టీకి స్పెషల్‌ గ్రాంట్‌ కింద రూ.12 కోట్లు, సంగం ప్రాజెక్టు నుంచి సంగం పంచాయతీకి నీటి సదుపాయం కోసం రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నాం. మొత్తమ్మీద దాదాపు రూ.85 కోట్ల విలువైన ఈ పనులన్నింటికీ అనుమతులు మంజూరు చేస్తున్నాను. 
► ఈ కార్యక్రమంలో దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులరెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మానుగుంట మహీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్‌రావు, కమ్యూనిటీ డెవెలప్‌మెంట్‌ చైర్మన్‌  నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, నెల్లూరు మేయర్‌ స్రవంతి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. 
 

వరుణుడి ఆశీర్వాదం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించి, నెల్లూరు బ్యారేజీ జాతికి అంకితం చేసేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటి వరకూ ఎండ వేడిమితో ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా మేఘావృతమై చిరుజల్లులు మొదలయ్యాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జోరున వర్షం ప్రారంభమెంది. సీఎం పర్యటన ముగిసే వరకు నెల్లూరులో వర్షం కురుస్తూనే ఉంది. బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ ప్రారంభించి, సీఎం తిరుగు ప్రయాణం కాగానే అక్కడా వర్షం ఆరంభమైంది. సంగంలో సైతం బహిరంగ సభ తర్వాత వాన జల్లులు పడ్డాయి. ఇదంతా కళ్లారా చూసిన వారు.. ముఖ్యమంత్రికి దేవుడి చల్లని దీవెనలు ఉన్నాయని, వరుణ దేవుడూ ఆశీర్వదించారని చర్చించుకున్నారు.

ఇదో అద్భుత సన్నివేశం
సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను సీఎం జగన్‌ ఒకేసారి ప్రారంభించడం అద్భుతమైన సన్నివేశం. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఈ రెండిటికీ శంకుస్థాపన చేశారు. తండ్రి సంకల్పించిన ఈ రెండు ప్రాజెక్టులను తనయుడు సాకారం చేయడం చరిత్రలో అరుదుగా జరిగే విషయం. స్వాతంత్య్రానంతరం వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని వినియోగించుకోవడానికి ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. వైఎస్సార్‌ వచ్చాకే జలయజ్ఞం పేరుతో ఆ దిశగా అడుగులు పడ్డాయి. ఆ మహానేత మనందరి మధ్య నుంచి వెళ్లిపోయాక ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. 
– జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement