సాక్షి, అమరావతి: ప్రతి అక్కా, చెల్లెమ్మకు మంచి చేయాలనే లక్ష్యంతో తొలి నుంచి మన ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా గర్భం దాల్చిన నాటి నుంచి చెల్లెమ్మలకు అండగా ఉండేలా అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో శుక్రవారం ఆయన ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలలో భాగంగా అధునాతన సౌకర్యాలతో కూడిన 500 ఎయిర్ కండిషన్డ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద మంత్రి ఆళ్ల నానితో కలిసి తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభిస్తున్న సీఎం జగన్
అంతకు ముందు సభా ప్రాంగణం వద్ద తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాన్ని పరిశీలించారు. వాహనంలోని సౌకర్యాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం వేదికపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. 500 కొత్త ఎయిర్ కండీషన్డ్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను రాష్ట్రంలోని నలుమూలలకూ పంపుతున్నామని చెప్పారు. గతంలో తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు అరకొరగా ఉండేవని, ఉన్న కొన్నింటిలో వసతులు సరిగా లేని దుస్థితి అని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి పూర్తిగా మెరుగైన పరిస్థితుల్లోకి తీసుకువస్తున్నామని చెప్పారు. 104, 108 వాహనాలు, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు నాడు–నేడు కార్యక్రమంతో మొత్తం ఆస్పత్రుల రూపురేఖలు మార్చేస్తున్నామన్నారు.
ఇంకా మంచి జరగాలి
‘గర్భవతి అయిన చెల్లెమ్మ 108కు ఫోన్ చేసిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళుతున్నాం. ఆస్పత్రిలో నాణ్యమైన సేవలు అందించి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ), జీఎంపీ (గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందిస్తున్నాం. ప్రసావానంతరం బాలింతలు ఇబ్బంది పడకుండా ఇంటికి వెళ్లేప్పుడు సిజేరియన్ కాన్పుకు రూ.3 వేలు, సహజ ప్రసవానికి రూ.5 వేలు చొప్పున డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఇస్తున్నాం.
విశ్రాంతి సమయంలో తోడుగా ఉండేందుకు ఈ సాయం చేయడంతో పాటు, తల్లిబిడ్డ ఎయిర్ కండిషన్డ్ వాహనంలో వారి ఇంటి వద్దకు క్షేమంగా చేరుస్తున్నాం. వీటన్నింటితో అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను’ అని సీఎం అన్నారు.
కనువిందు చేస్తూ ముందుకు..
శుక్రవారం ఉదయాన్నే 500 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు బెంజి సర్కిల్ నుంచి ఎంజీ రోడ్డులో బారులు తీరాయి. సీఎం వైఎస్ జగన్ జెండా ఊపగానే వాహనాలు ఒక్కసారిగా పరుగులు తీశాయి. సభా ప్రాంగణం దాటుకుంటూ వెళుతున్న ప్రతి వాహనానికి సీఎం రెండు చేతులూ జోడించి నమస్కరించారు. డ్రైవర్లు ప్రతి నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. వాహన శ్రేణి పూర్తిగా కదలి వెళ్లేంత వరకు సీఎం అభివాదం చేస్తూ నిల్చున్నారు.
వాహన శ్రేణి ముందుకు సాగుతున్న దృశ్యాన్ని ప్రజలు, కాలేజీ విద్యార్థులు సెల్‌ఫోన్‌లో బంధించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని), మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శంకర్‌నారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment