సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఆర్‌సీసీ (అంచనా మదింపు కమిటీ), కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదించిన మేరకు 2017–18 ధరల ప్రకారం నిధులను రాబట్టి.. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం ఖర్చుతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా భరించి.. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని 2014లోనే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం కూడా ప్రస్తావించారు. విభజన చట్టం, కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.4,013.65 కోట్లను కేంద్రం రీయింబర్స్‌మెంట్ చేయడం, దీనికి సంబంధించిన తాజా పరిణామాలపై శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 1 2014 నాటికి పోలవరం ప్రాజెక్టు నీటి పారుదల విభాగం వ్యయం 20,398.16 కోట్లుగా నిర్ధారించి ఆమోదించాలని కేంద్ర జలశక్తిశాఖ, పీపీఏకు కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేయాడాన్ని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను రీయింబర్స్ చేయడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చల వివరాలను వివరించారు.
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్ చేయడం ద్వారా ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి సహకరించాలని చేసిన విజ్ఞప్తిపై ఆమె సానుకూలంగా స్పందించారని చెప్పారు. పోలవరానికి రూ.2,234.288 కోట్లు రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన అంశాన్ని ఆమె గుర్తు చేశారని వివరించారు. ఏప్రిల్ 1, 2014 నాటికి పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం సవరించిన వ్యయం రూ.20,398.61 కోట్లుగా పేర్కొన్నారన్నారు. కాగా పీపీఏ, సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ), 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా నిర్ధారించి, ఆమోదించిన అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించామని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌సీసీ 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా నిర్దారించి, ఆమోదించిన అంశాన్ని గుర్తు చేసినట్లు తెలిపారు. ఆర్‌సీసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆమోదం తెలిపి.. కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిన అంశాన్ని నిర్మలా సీతారామన్‌కు వివరించామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఆ ప్రతిపాదనల మేరకు నిధులను విడుదల చేసి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాల్సిందిగా కోరామని వివరించారు.
భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకే రూ.29 వేల కోట్లు అవసరం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు సహాయ పునరావాసం కల్పించడానికే రూ.29 వేల కోట్లు వ్యయం అవుతుందని పీపీఏ, సీడబ్ల్యూసీ, ఆర్‌సీసీ, కేంద్ర జల్ శక్తి శాఖ అంచనా వేసి.. ఆమోదించాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ ఈ ప్యాకేజీకి రూ.20,398.61 కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పడం సమంజసం కాదన్నారు. ఆ నిధులతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే అప్పటి ప్రభుత్వం మౌనంగా ఎందుకుందో?
2016 సెప్టెంబర్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో జరిపిన అంతర్గత చర్చల్లో.. పోలవరం ప్రాజెక్టుకు ఏప్రిల్ 1, 2014 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం పేర్కొన్న అంశాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఏప్రిల్, 1, 2014 నాటి ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే మంజూరు చేస్తామంటూ 2017 మార్చిలో కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిందని ఎత్తిచూపారు. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు వర్తింపజేస్తామనడం సమంజసం కాదన్నారు.
పోలవరానికి నిధులు రాబట్టండి
Published Sun, Oct 25 2020 4:01 AM | Last Updated on Sun, Oct 25 2020 10:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment