ఇదిగో ‘నేస్తం’.. నేనున్నా | CM YS Jagan Mohan Reddy Released YSR Nethanna Nestham Funds | Sakshi
Sakshi News home page

ఇదిగో ‘నేస్తం’.. నేనున్నా

Published Wed, Aug 11 2021 2:27 AM | Last Updated on Wed, Aug 11 2021 7:04 AM

CM YS Jagan Mohan Reddy Released YSR Nethanna Nestham Funds - Sakshi

వైఎస్సార్‌ నేతన్న నేస్తం చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో పలువురు లబ్ధిదారులు, మంత్రులు, అధికారులు

సాక్షి, అమరావతి: చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఆప్కో ద్వారా రూ.1,600 కోట్ల మేర ప్రయోజనం చేకూరుస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన మాస్కులు, చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో సేకరించిన వస్త్రాలు, పిల్లల యూనిఫామ్స్‌ కోసం కానివ్వండి.. ఇలా దాదాపుగా రూ.1,600 కోట్లను నేతన్నలకు మంచి చేసేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. 1,06,400 మంది నేతన్నలకు పెన్షన్లు పెంచి ఇస్తున్న సొమ్ము కాకుండా, నేతన్నలకు ఇచ్చిన ఇళ్లపట్టాలు, ఇంటి నిర్మాణాలు, చేయూత, ఆసరా, అమ్మఒడి, విద్యాదీవెన.. వసతి దీవెన ఇవన్నీ లెక్కలో వేసుకోకుండా.. కేవలం నేతన్న నేస్తం, ఆప్కోల ద్వారా వారికి జరుగుతున్న మేలు దాదాపుగా రూ.1,600 కోట్లు ఉంటుందని వెల్లడించారు. గత సర్కారు ఐదేళ్లలో చేనేతల కోసం కేవలం రూ.259 కోట్లు మాత్రమే వ్యయం చేసిందన్నారు.

కరోనా విపత్తు వేళప్రభుత్వానికున్న ఇబ్బందులు కన్నా చేనేతల కష్టమే ఎక్కువని భావించానని, మూడేళ్ల పాలన పూర్తి కాకముందే వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ నేతన్న నేస్తం అమలు చేస్తున్నామని చెప్పారు. మూడో విడత నేతన్న నేస్తంతో కలిపి చేనేతలకు ఇప్పటివరకు రూ.600 కోట్లు సాయం అందించామని, ఐదేళ్లలో ఒక్క ఈ పథకం ద్వారానే రూ.1,000 కోట్లు అందచేయనున్నట్లు వివరించారు.  చేనేతలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలను తన పాదయాత్రలో స్వయంగా చూశానని, అధికారంలోకి రాగానే వారి బాగోగుల కోసం ఆలోచిస్తూ ప్రతి అడుగులోనూ మంచి చేయడానికి ఆరాటపడుతున్నానని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
వివిధ జిల్లాలకు చెందిన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ఇలాంటి కార్యక్రమాన్ని దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయడం లేదని, మీ బిడ్డ ప్రభుత్వమే అమలు చేస్తోందని గర్వంగా చెబుతున్నానన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నెల రోజుల్లోగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేసి నేతన్న నేస్తం అందిస్తామని ప్రకటించారు. ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ వరుసగా మూడో ఏడాది సాయం కింద 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని చేనేత కార్మికులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగం వివరాలు ఇవీ..

నేనెప్పటికీ మరిచిపోలేను..
ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. దాదాపు 80 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది. ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున రూ.192 కోట్లకుపైగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. చేనేతల అవస్ధలు నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చూశా. ప్రతి జిల్లాలోనూ తమ సమస్యలు నాకు చెప్పుకున్నారు. వారి గోడును నేనెప్పటికీ మరిచిపోలేను. నా పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల్లో ఏదైతే చెప్పామో... అవన్నీ కూడా ఎన్నికలు పూర్తి కాగానే అమలు చేయడం ప్రారంభించాం.

మూడేళ్ల పాలన పూర్తి కాకముందే...
అందులో ఒక మంచి కార్యక్రమం.. నేతన్న నేస్తం. ఈ రోజు వరుసగా మూడో సంవత్సరం పథకాన్ని అమలు చేస్తున్నాం. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన, ఆ మగ్గం మీద బతుకుతున్న చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని చేస్తున్నాం. మూడేళ్ల పాలన పూర్తి కాకముందే.. 2 సంవత్సరాల 2 నెలల్లో వరుసగా మూడో విడత నేతన్న నేస్తం డబ్బులు విడుదల చేస్తున్నాం. ఈ సొమ్ము మన నేతన్నలు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడాలని కోరుకుంటున్నా.

మీ ఇబ్బందులే ఎక్కువని...
కరోనా సమయంలో ఎన్ని ఆర్థిక కష్టాలున్నా.. ప్రభుత్వానికి ఉన్న సమస్యల కన్నా చేనేతలు బతకడానికి పడుతున్న ఇబ్బందులే ఎక్కువని భావించాం. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో వరుసగా మూడో ఏడాది 80 వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఏటా దాదాపుగా రూ.200 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.1,000 కోట్లు కేవలం నేతన్న నేస్తం ద్వారానే ఇస్తున్నాం. నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తున్నాం.
 
వివక్షకు తావులేకుండా ఐదేళ్లలో రూ.1.20 లక్షలు
ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయడంలేదు. మన రాష్ట్రంలో మీ బిడ్డగా దీన్ని అమలు చేస్తున్నా. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా రూ.24 వేలు చొప్పున మూడు దఫాలుగా నేతన్న నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.72 వేలు ఈ ఒక్క పథకం ద్వారానే ఇచ్చాం. సొంత మగ్గం ఉండి, ఆ మగ్గమే ఆధారంగా బతుకున్న వారికి ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఈ ఒక్క స్కీం ద్వారానే అవినీతి, వివక్షకు తావులేకుండా, బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోకుండా.. అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపిస్తున్నాం. నేతన్న నేస్తం లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా జరిగింది.
 
మేలు చేసే ప్రభుత్వమిది..
ఇంత పారదర్శకంగా చేసినప్పటికీ కూడా పొరపాటున ఇంకా ఎవరైనా ఒకరో ఇద్దరో అర్హులు మిగిలిపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సొంత మగ్గం ఉన్నవారు, దానిమీదే బతుకున్నవాళుŠల్‌ వలంటీర్లు ద్వారా కానీ, గ్రామ సచివాలయానికి నేరుగా వెళ్లి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. నెలరోజుల పాటు గడువు ఇస్తాం. పరిశీలన చేసి అర్హత ఉంటే వారికి కూడా వచ్చేటట్లుగా చేస్తాం. మీ బిడ్డ ప్రభుత్వం ఇది.. ఎవరికైనా సరే ఎలా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది. అనర్హులకు రాకూడదు, అర్హత ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ కాకూడదు అని ఆరాటపడే ప్రభుత్వం ఇది. నిర్దిష్ట గడువులోగా తనిఖీలు పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ కోసం సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. 

గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం..
ఈ సందర్భంగా మరో రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా ఇవాళ్టితో కలిపి దాదాపుగా రూ.600 కోట్లను నేతన్నలకు నేరుగా సహాయం అందించాం. అంతేకాకుండా చేనేత సహకార సంఘాలు, ఆప్కోకు గత సర్కారు బకాయిపడ్డ రూ.103 కోట్లను కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదిలోనే చెల్లించాం.

నాడు ఐదేళ్లలో కేవలం రూ.259 కోట్లే
గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేనేత రంగం మీద, నేతన్నల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.259 కోట్లు మాత్రమే. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తోందంటే.. ఇది మీ బిడ్డ ప్రభుత్వం, మీ బాగోగుల కోసం ఆలోచించే ప్రభుత్వం ఇది అని చెప్పడానికి దీన్ని గుర్తు చేస్తున్నా.

ఆప్కో ఇ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌
చేనేత రంగంలో నేతన్నల ఇబ్బందులను దూరం చేసేందుకు ఆప్కో ద్వారా ఇ– మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చాం. దీని ద్వారా ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కల్పించాం. ప్లిఫ్‌కార్ట్, అమెజాన్‌లో ఆప్కో ఉత్పత్తులు కనిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలా ప్రతి అడుగులోనూ మంచి చేయడానికి ఆరాటపడుతున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా మంచిచేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నా.

–ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య, చేనేత శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, పరిశ్రమలు, వాణిజ్య (హేండ్‌లూమ్, టెక్స్‌టైల్స్‌) శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, హేండ్‌లూమ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ పి.అర్జునరావు, ఆప్కో ఛైర్మన్‌ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, దేవాంగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బీరక సురేంద్ర, పద్మశాలి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జే.విజయలక్ష్మి, తోగాటివీర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గెడ్డం సునీత, కుర్నిశాలి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బుట్టా శారదమ్మ, లేపాక్షి ఛైర్మన్‌ బి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

తోబుట్టువులా తోడున్నారు.. 
పాదయాత్రలో మా కష్టాలను చూసి నేతన్న నేస్తం పథకంతో ఆదుకున్నారు. కరోనా కష్టకాలంలో కూడా సాయం చేసి మా జీవితాలను నిలబెట్టారు. మేం నేసిన చీరలు అమ్ముకోవడానికి దుకాణాలు కూడా లేని సమయంలో ఈ సాయం మాకు ఎంతో ఆసరాగా నిలిచింది. ప్రతి ఏడాది మీ తోబుట్టువులకు డబ్బులు జమ చేస్తున్నారు. సొంత అన్నదమ్ములు కూడా ఇంతలా ఆదరించరు. విద్యా దీవెనతో మా పిల్లలు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. చేయూత పథకం ద్వారా వస్తున్న మొత్తాలతో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి మహిళా నెలకు ఎంతో కొంత సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోందంటే మీ చలవేనన్నా.      
    – జి.జానకి, మంగళగిరి, గుంటూరు జిల్లా   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement