సోమవారం నెల్లూరులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేకపాటి గౌతమ్‌రెడ్డి మన మధ్య లేరని నమ్మడానికి మనసుకు ఎంతో కష్టంగా ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభకు సీఎం జగన్ హాజరై మాట్లాడారు. మేకపాటి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి గౌతమ్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుమారుడిని తలచుకుని దుఃఖసాగరంలో మునిగిపోయిన గౌతమ్‌రెడ్డి తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తిని ఓదార్చారు. గౌతమ్‌రెడ్డిని స్మరించుకుంటూ దివ్యాంగుడు ఇంతియాజ్ రూపొందించిన భగవద్గీతను సీఎం అవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..
ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు..
‘‘ఇటువంటి పరిస్థితుల మధ్య మాట్లాడాల్సి వస్తుందని ఏరోజూ కలలో కూడా ఊహించలేదు. గౌతమ్ మన మధ్య లేడని నమ్మడానికి మనసుకి కష్టంగా ఉంది. తను ఇక రాడు.. ఇక లేడనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి టైం పడుతుంది. గౌతమ్ గురించి చెప్పాలంటే.. నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. మంచి స్నేహితుడు. నాకు బాగా గుర్తుంది... రాజకీయాల్లోకి తను అప్పుడు ఇంకా అడుగుపెట్టలేదు. నేను రాకపోతే బహుశా గౌతమ్ కూడా రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో. అప్పట్లో నేను కాంగ్రెస్‌ను వీడి బయటికి అడుగులు వేసినప్పుడు 2009–10లో ఆ పార్టీతో ఒక యుద్ధం మొదలైంది.
అప్పుడు రాజమోహన్‌రెడ్డి అన్న కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. నేను 2009లో అప్పుడే ఎంపీగా ఎన్నికయ్యా. గౌతమ్‌తో నాకున్న సాన్నిహిత్యమే ఆయన తండ్రి నావైపున ఉండేటట్టుగా చేసిందని చెప్పాలి. 2009–10 నుంచి సాగిన ఆ ప్రయాణంలో ప్రతి అడుగులో గౌతమ్ నాకు తోడుగా, స్నేహితుడిగా ఉన్నాడు. నాకన్నా వయసులో గౌతమ్ ఏడాది పెద్ద అయినా ఎక్కడా కూడా తాను పెద్ద అనే భావం మనసులో ఉండేది కాదు. నన్ను ఒక సోదరుడిలా, అన్నగా భావించేవాడు. నువ్వు చేయగలుగుతావు.. మేమంతా ఉన్నామని నన్ను తట్టి ప్రోత్సహించేవాడు. అలాంటి ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకోవడం ఈ రోజుకు కూడా జీర్ణం చేసుకోలేని అంశం.
నాతోనే రాజకీయ అడుగులు
రాజకీయాల్లోకి గౌతమ్‌రెడ్డిని నేనే తీసుకొచ్చా. నేను అడుగులు వేస్తేనే తను అడుగులు వేశాడు. ఆ తర్వాత ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టి పరిశ్రమలు, ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు దాదాపు ఆరు శాఖలను సమర్థంగా నిర్వహించాడు. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని తపించాడు. అందులో భాగంగానే దుబాయ్ వెళ్లేముందు నాకు కనిపించాడు.
తిరిగి రాగానే నన్ను కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా అడిగాడు. ఆలోపే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మంచి స్నేహితుడిని, మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం కానీ.. ఆ కుటుంబానికి నేనే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తోడుగా ఉంటుంది. ఆ కుటుంబానికి దేవుడి తోడుగా ఉండాలని, అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నా.
ప్రజల మదిలో నిలిచిపోయాడు
ఎంత చెప్పినా.. ఎంత మాట్లాడినా ఆ లోటును భర్తీ చేయలేం. కానీ మనిషి వెళ్లిపోయిన తర్వాత ఎంతమంది మనసుల్లో నిలిచిపోయాడు అన్నది మాత్రం కచ్చితంగా నిలబడిపోతుంది. ఆ విషయంలో గౌతమ్ అగ్రస్థానంలో ఉంటాడు. గౌతమ్ అంత్యక్రియలకు హాజరైనప్పుడు ఆయన తండ్రి కొన్ని విషయాలు చెప్పారు. కళాశాలను ప్రభుత్వపరంగా తీసుకోవడం, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీ కింద మార్చడమే కాకుండా అవకాశం ఉంటే యూనివర్సిటీగా చేయాలని కోరారు.
వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్–2లో ఉన్న ఉదయగిరి, బద్వేలు ప్రాంతాన్ని ఫేజ్–1లోకి తెస్తే ఆత్మకూరు, ఉదయగిరి రెండు నియోజకవర్గాలకూ మంచి జరుగుతుందని.. దాన్ని వేగవంతం చేయాలని కోరారు. దానివల్ల గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఇవన్నీ కచ్చితంగా జరుగుతాయి. సంగం బ్యారేజీ పనులన్నీ మే 15 లోగా పూర్తవుతాయని మంత్రి అనిల్‌కుమార్ చెప్పారు. మంచి రోజు చూసుకుని మళ్లీ నేను ఇక్కడికి వస్తా. మేకపాటి కుటుంబ సభ్యులతో కలసి ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. గౌతమ్ జ్ఞాపకార్థం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ అని పేరు పెడతాం. తద్వారా గౌతమ్ చిరస్థాయిగా, ఎప్పుడూ మన మనసులో ఉంటారు.
సీఎం కుటుంబానికి కృతజ్ఞతలు
తమ ఇంట్లో విషాదం చోటుచేసుకున్నప్పుడు అండగా నిలిచి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబం కల్పించిన భరోసా మరువలేనిదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గౌతమ్‌రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేలా తన కోరికలకు సీఎం వెంటనే అంగీకరించారని తెలిపారు. తన కుమారుడికి మంత్రివర్గంలో స్థానం కల్పించి సమర్థత రుజువు చేసుకునే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
దశాబ్దానికి పైగా అనుబంధం
పుష్కరకాలంగా గౌతమ్‌రెడ్డి అన్నతో అనుబంధం ఉందని మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ గుర్తు చేసుకున్నారు. జిల్లా నుంచి తామిద్దరం మంత్రులుగా ఉన్నప్పటికీ తననే ముందు నడిపించేవారన్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆయన అర్థాంతరంగా నిష్క్రమిస్తారని ఊహించలేదన్నారు. గౌతమ్‌రెడ్డి జ్ఞాపకాలతో కన్నీళ్లు వస్తున్నాయని, మంచి మిత్రున్ని కోల్పోయానని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత గౌతమ్‌రెడ్డితో తన అనుబంధాన్ని కలెక్టర్ చక్రధర్‌బాబు తెలియచేశారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్‌రావు, ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, వాకాటి నారాయణరెడ్డి, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, కమ్యూనిటీ బోర్డు డెవలప్‌మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment