మహిళలు.. ఆకాశంలో సగం: సీఎం జగన్‌ | CM YS Jagan Participating In Womens Day Celebrations | Sakshi
Sakshi News home page

మహిళలు.. ఆకాశంలో సగం: సీఎం జగన్‌

Published Mon, Mar 8 2021 11:54 AM | Last Updated on Mon, Mar 8 2021 9:10 PM

CM YS Jagan Participating In Womens Day Celebrations - Sakshi

సాక్షి, తాడేపల్లి: మహిళ అంటే ఆకాశంలో సగభాగమని.. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబానికి చుక్కానిలా ఉండి అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవన్నారు.

మహిళా మంత్రులతో స్వయంగా సీఎం వైఎస్‌ జగన్‌ కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తెచ్చాం ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో 60 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. ఇప్పటికీ 40 శాతం మంది మహిళలకు చదువు అందడం లేదు. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చాం.

రెండేళ్లలో రూ.13,220 కోట్లు అమ్మఒడి పథకం కింద ఇచ్చాం. ఐదేళ్లలో రూ.32,500 కోట్లను అమ్మఒడి కింద ఇస్తాం. వైఎస్సార్‌ చేయూత కింద రూ.4,604 కోట్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాల ద్వారా మహిళలకు రూ.27వేల కోట్లు ఇచ్చాం. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్‌ చేయూత ద్వారానే 21 నెలల్లో రూ.80వేల కోట్లు అందించాం. మహిళా ఉద్యోగుల క్యాజువల్ లీవ్స్‌ 20 రోజులకు పెంచాం. 13 జిల్లాల్లో దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశాం. మహిళలపై నేరాలకు సత్వర విచారణ చేస్తున్నామని’’ సీఎం జగన్‌ అన్నారు. గతంలో మహిళలను ఉద్దేశించి చంద్రబాబు దారుణంగా మాట్లాడారని.. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని హేళన చేశారన్నారు. మన తల్లులు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు కాబట్టే.. ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నామని సీఎం పేర్కొన్నారు.

ఈ ఏడాది మహిళలకు ప్రత్యేక బడ్జెట్‌
దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్‌ను  ప్రవేశపెడుతున్నామని సీఎం తెలిపారు. మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని, 10 మందికి మించి మహిళలు ఉన్న కార్యాలయాల్లో కమిటీలు నియమిస్తామని పేర్కొన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌
900 దిశ పెట్రోల్‌ వెహికల్స్‌, 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జీపీఎస్‌, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సైబర్ కియోస్క్‌లను సీఎం ఆవిష్కరించారు. బాలికలకు ఉచిత నాప్‌కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

సీఎం చేతుల మీదుగా 'దేశానికి దిశ' పుస్తకం ఆవిష్కరణ
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ రూపొందించిన 'దేశానికి దిశ' పుస్తకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురిని ముఖ్యమంత్రి సత్కరించారు. ఏఎన్‌ఎం శాంతి, స్వీపర్ మబున్నీసా, మహిళా కానిస్టేబుల్‌ సరస్వతి, వాలంటీర్‌ కల్యాణీని సీఎం సత్కరించారు. 

మీరు మా కుటుంబసభ్యులై ప్రతీ విషయంలో తోడుగా..
మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా ఒంగోలు ఒన్‌టౌన్‌  పోలీసు స్టేషన్‌ నుంచి విమెన్‌ హెల్ప్‌ డెస్క్‌లోని మహిళా కానిస్టేబుల్‌ అలేఖ్య సీఎం వైఎస్‌ జగన్‌తో మాట్లాడుతూ.. బాధిత మహిళ తన సమస్యను చెప్పగానే మేం ఒక మహిళగా తన బాధను అర్ధం చేసుకుని సత్వర న్యాయం చేయగలుగుతామని తెలిపారు. అలాగే ఒక నిరక్షరాస్యురాలైన మహిళ స్టేషన్‌కు వస్తే ఆమెకు  రాయడం రాదు కావున వారు చెప్పిన ప్రతీ మాటను రికార్డ్‌ చేసి వారికి చదివి వినిపించి న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే మానసిక సమస్యలతో బాధపడే వారు వచ్చినప్పుడు వారికి కౌన్సిలింగ్‌ చేయడంతో పాటు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.

హెల్ప్‌డెస్క్‌లో మహిళలు ఉండడం వల్ల మేం పూర్తిగా వారి బాధలు అర్ధం చేసుకుని సత్వర న్యాయం చేయగలుగుతామన్నారు. మహిళల కోసం మీరు చాలా చేస్తున్నారు సార్, మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి వృద్దాప్యం వరకూ మీరు ప్రతీ విషయంలో మాకు తోడుగా ఉంటున్నారని తెలిపారు. బిడ్డలకు మేనమామగా, చదువుల విషయంలో అన్నలాగా, చేయూతనిస్తూ పెద్దన్నలా తోడుగా, వృద్దాప్యంలో కొడుకుగా ఉంటున్నారని తెలిపారు. మీరు మా కుటుంబసభ్యులై ప్రతీ విషయంలో తోడుగా ఉంటున్నారు. ధన్యవాదాలు సర్.

దిశ పోలీస్‌ స్టేషన్‌ మహిళలకు వరం
కర్నూల్‌ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌లో మహిళా కానిస్టేబుల్‌ దుర్గ సీఎం జగన్‌తో మాట్లాడుతూ.. మీరు ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌ స్టేషన్‌ మహిళలకు ఒక వరం అని తెలిపారు. స్టేషన్‌కు వచ్చే మహిళలకు, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో ఇబ్బందులు పడుతున్న వారికి మేమున్నామనే భరోసా ఇచ్చే అవకాశం దిశ పోలీస్‌ స్టేషన్‌ ద్వారా కలుగుతుందని చెప్పారు. దిశా యాక్ట్‌, మహిళా మిత్ర ద్వారా మహిళలకు భరోసా కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి:
మహిళలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు
టీడీపీ నేత అయ్యన్న తనయుడి రచ్చ రచ్చ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement