CM YS Jagan: నేనున్నానని.. మీకేం కాదని | CM YS Jagan Promises Victims Of Health Issues | Sakshi
Sakshi News home page

CM YS Jagan: నేనున్నానని.. మీకేం కాదని

Published Sat, Mar 25 2023 10:00 PM | Last Updated on Sat, Mar 25 2023 11:04 PM

CM YS Jagan Promises Victims Of Health Issues - Sakshi

సాక్షి,  ఏలూరు: వైఎస్సార్‌ ఆసరా మూడవ విడత కింద మహిళలకు ఆర్ధిక సహాయం అందించేందుకు దెందులూరు కు విచ్చేసి కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళుతున్న  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ  ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులు కలిసి తమ బాధను  వ్యక్తం చేసుకున్నారు. దెందులూరు గ్రామానికి చెందిన బర్నాన క్రాంతి ప్రసాద్ (31) బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నట్లు, ఇప్పటికే రెండుసార్లు మేజర్ ఆపరేషన్లు జరిగాయని, 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యాయని తండ్రి గణపతి ముఖ్యమంత్రి వద్ద వాపోయారు.    

ఈ మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.  తక్షణమే వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం మంజూరు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణమే లక్ష రూపాయల ఆర్ధిక సహాయం  అందిస్తున్నట్లు  కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.

పెదవేగి మండలం రాట్నాలకుంట కు చెందిన పెనుబోయిన కృపారావు (39) తనకు రెండు కిడ్నీలు పాడయ్యాయని,  వైద్యానికి 5 నుండి 6 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని, అందుకు ఆర్ధిక సాయం అందించాలని  ముఖ్యమంత్రిని కోరారని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా దెందులూరు గ్రామానికి చెందిన  వై. మోషేరాజు, ఉంగుటూరు మండలం  కైకరం గ్రామానికి చెందిన కోసన అర్జున్ కిడ్నీల వ్యాధితో బాదుతున్నామని, తమను ఆదుకోవాలని కోరారు.  దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ దాతలు  సిద్ధంగా ఉంటె, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా బాధితులకు ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేసారని, తక్షణ వైద్య సహాయం కోసం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్థానని,  హామీ ఇచ్చారని, ఆ మేరకు కృపారావు, కోసన అర్జున్, వై. మోషే రాజు  లకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కులను వెంటనే  పంపిణీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

ఉంగుటూరు మండలం గోపరాజుపాడు కు చెందిన కుప్పాల సుధారాణి తన కుమార్తె కె. దేదీప్య (5) కి  పుట్టుకతోనే లివర్  సమస్య ఉందని, ఎండోస్కోపీ  వైద్యానికి ప్రతీ నెల 30 నుండి 40 వేల  రూపాయలు ఖర్చు అవుతోందని, తమ బాధను ముఖ్యమంత్రికి తెలియజేసారని కలెక్టర్ తెలిపారు.  తన భర్త దుర్గా రావు కూలి పనికి వెళతారని, వైద్యానికి ఇప్పటివరకు  లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని  చెబుతూ,  ప్రస్తుతం  వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళుతున్నామని, తమ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని   తమకు వైద్య చికిత్సకు సహాయం చేయాలనీ ముఖ్యమంత్రిని కోరారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేదీప్య వైద్య చికిత్స నిమిత్తం వారి కుటుంబానికి  లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చెక్కును అందించినట్లు కలెక్టర్ చెప్పారు. 

ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లికి చెందిన   పి . రేవతి తమ కుమార్తె పి . వెంకట లక్ష్మి (8) శాశ్వత వినికిడి లోపం  సమస్యతో బాధపడుతున్నాదని,  ఇప్పటికే 1.50 లక్షల రూపాయలతో చికిత్స అందించామని, కాక్లియర్  ఇంప్లాంటేషన్ కు  22 లక్షలు ఖర్చు అవుతాయని ముఖ్యమంత్రికి రోగి తల్లి రేవతి తమ బాధను వ్యక్తం చేశారు. కాక్లియర్  ఇంప్లాంటేషన్ కు  అవసరమైన వైద్య సహాయం కోసం చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  తక్షణ వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చెక్కును సదరు కుటుంబానికి అందించినట్లు కలెక్టర్ తెలియజేసారు.

దెందులూరు గ్రామానికి చెందిన కొంగర ప్రిస్కిల్లా కుమార్తె కె. సెఫిల్ అనోరెక్టల్ మాల్ ఫార్మేషన్ తో  బాధపడుతున్నట్లు ఆరోగ్య  సమస్యతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలియజేసారని, దీనిపై మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిఎమ్ హెచ్ ఓ తో చర్చించి, ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.   వైద్య చికిత్స నిమిత్తం  ప్రిస్కిల్లా కుటుంబానికి తక్షణ ఆర్ధిక సహాయంగా లక్ష రూపాయలు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లక్ష రూపాయల చెక్కును అందించినట్లు కలెక్టర్ చెప్పారు. 

దెందులూరు మండలం, దెందులూరు గ్రామానికి చెందిన  ఈడుపల్లి ప్రసాద్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నానని,  మంచంపై నుండి కదలలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరారని, వారికి వైద్య చికిత్స నిమిత్తం తక్షణ వైద్య సహాయంగా లక్ష రూపాయలు చెక్కును అందించి, పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. 

దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన జుత్తిగ హేమలత తన కుమార్తె భవ్యశ్రీ మల్లిక (10 నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాదని , తిరుపతి లోని పద్మావతి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించామని, పోస్ట్ ఆపరేషన్ వైద్య చికిత్సకు మందులు అందించాలని  ముఖ్యమంత్రికి  తెలియజేసిన పిమ్మట వారి అభ్యర్థనపై స్పందించిన ముఖ్యమంత్రి వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం  అందిస్తున్నట్లుగా హామీ ఇచ్చారని , ఆ మేరకు  లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కును అందించినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేసారు.     

ఆర్ధిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు కొఠారు అబ్బాయి చౌదరి, తలారి వెంకటరావు, పుప్పాల వాసుబాబు, జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు, డ్వామా పీడీ డి. రాంబాబు , ప్రభృతులు  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement