చదువులకు ‘బలం’ | CM YS Jagan On Ragi Java To Students With Jagananna Gorumudda | Sakshi
Sakshi News home page

చదువులకు ‘బలం’

Published Wed, Mar 22 2023 3:41 AM | Last Updated on Wed, Mar 22 2023 3:41 AM

CM YS Jagan On Ragi Java To Students With Jagananna Gorumudda - Sakshi

మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి? ఒక్కసారి తేడాను గమనించండి. మధ్యాహ్న భోజనానికి గతంలో ఏటా రూ.450 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి. ఇప్పుడు గోరుముద్దకు ఏడాదికి రూ.1,824 కోట్లు.. రాగి జావకు అదనంగా మరో రూ.86 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలు ఏం తింటున్నారని ఓ ముఖ్యమంత్రి ఆలోచించిన పరిస్థితి గతంలో లేదు. కానీ ఇప్పుడు మంచి మేనమామలా 15 రకాల పదార్థాలతో పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం.  
– సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: మన విద్యార్థులంతా భావి ప్రపం­చంతో పోటీపడి రాణించేలా ప్రతి అడుగులోనూ వారికి అండదండలు అందిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పిల్లలకు మంచి మేనమామలా వారికి అందించే ఆహారం నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగాల దాకా అన్ని విషయాల్లోనూ వారి బాగోగులే లక్ష్యంగా నడుస్తున్నామన్నారు.

గతంలో ఏ ముఖ్యమంత్రీ కూడా పిల్లల బాగు కోసం ఇంత తపన పడలేదన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ‘మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి..? ఒక సారి తేడాను గమనించండి. పిల్లలు ఏం తింటున్నారు? అని ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు.

మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న మంచి ఆలోచనతో గోరుముద్దను చేపట్టాం. పిల్లలకు మంచి మేనమామలా 15 రకాల ఆహార పదార్థాలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం. మధ్యాహ్న భోజనానికి గతంలో ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయని దుస్థితి. ఇప్పుడు గోరుముద్ద కోసం ఏడాదికి రూ.1,824 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని తెలిపారు.

ఇప్పుడు దీనికి అదనంగా రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో ఉదయం పూట రాగిజావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.

ఏప్రిల్‌లో పదో తరగతితో పాటు మిగిలిన పిల్లలకు పరీక్షలు జరగనున్న నేపధ్యంలో వారందరికీ ఓ మేనమామగా ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెబుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే... 
 
మొదటి రోజు నుంచే.. 
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క పాప, బాబు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి, గోరుముద్దలో భాగంగా పరిశుభ్రంగా, రుచికరంగా వండి పెడుతున్న అమ్మలకు.. ప్రతి ఒక్కరికీ నా అభినందనలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా.

అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి చదువులను సంస్కరించడంపై దృష్టి పెట్టాం. బడి మానేసే పిల్లల సంఖ్యను ఎలా తగ్గించాలి? స్కూళ్లలో సదుపాయాలు మెరుగుపర్చడం ఎలా? పిల్లల మేథో వికాసానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించడం ఎలా? పెద్ద చదువులు చదివేలా ప్రోత్సహించడమెలా? అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి అడుగులోనూ మార్పులు తీసుకొచ్చాం. అందులో భాగంగానే గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు చిన్నారులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. 
 
అడుగడుగునా ప్రోత్సాహం.. 
చదువుకునే విద్యార్థులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, విద్యాకానుక, నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. 8వ తరగతిలోకి వచ్చిన వెంటనే పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం.

ఇక 6వ తరగతి నుంచి ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌) ద్వారా డిజిటల్‌ బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు నాడు – నేడు పూర్తైన స్కూళ్లలో జూన్‌ నుంచి అమలులోకి తీసుకొస్తాం.  ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నాం. 
 
సమున్నత మార్పులు.. 
ఉన్నత విద్యలో సమూల మార్పులు చేపట్టి జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌ తీసుకొచ్చాం. ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరిచేస్తూ ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ని కరిక్యులమ్‌కు అనుసంధానం చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మన పిల్లలంతా భావి ప్రపంచంతో పోటీ పడి నెగ్గుకొచ్చేలా ప్రతి అడుగు వేస్తున్నాం. అందులో భాగంగానే విద్యాకానుక అమలు చేస్తున్నాం. 
 
మరింత బలవర్ధకంగా గోరుముద్ద 
గోరుముద్దను ఇప్పటికే రోజుకొక మెనూతో రుచికరంగా అమలు చేస్తున్నాం. ఇప్పుడు మరింత బలవర్ధకంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాం. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి పిల్లలకు రాగిజావ కూడా అందిస్తూ గోరుముద్దను మరింత పుష్టికరంగా తీర్చిదిద్దుతున్నాం. రాగి జావ పిల్లల్లో సమృద్ధిగా ఐరన్, కాల్షియం కంటెంట్‌ పెరిగేలా దోహదపడుతుంది. 
 
నాడు అద్వాన్నం... నేడు నోరూరేలా
మిడ్‌ డే మీల్స్‌ అంటూ గత ప్రభుత్వ హయాంలో మొత్తం సంవత్సరం అంతా కలిపినా కూడా ఏడాదికి రూ.450 కోట్లు కూడా మధ్యాహ్న భోజనానికి ఖర్చు చేయని దుస్థితి. వండి పెట్టే ఆయాలకు రూ.1,000 ఇస్తూ అది కూడా  8–10 నెలలు బకాయిలు పెట్టిన  పరిస్థితి ఉంది. చివరకు సరుకులు కూడా 6–8 నెలలుగా బకాయిలు పెట్టే పరిస్థితి.  ఇలా బకాయిలు పెడితే క్వాలిటీ అనేది ఉండదు.

అలాంటి అధ్వాన్నమైన పరిస్థితుల నుంచి గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా రోజుకొక మెనూతో పూర్తిగా మార్చి  ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో రూ.450 కోట్లు మాత్రమే ఉన్న బడ్జెట్‌ను ఇప్పుడు ఏడాదికి రూ.1,824 కోట్లకు పెంచి గోరుముద్ద కోసం ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు రాగి జావ కోసం అదనంగా మరో రూ.86 కోట్లు ఇస్తున్నాం. రోజుకో మెనూతో పిల్లలకు రుచికరమైన భోజనం అందిస్తున్నాం. 
 
వారానికి 15 రకాలతో మెనూ... 
గోరుముద్ద మెనూలో ప్రతి సోమవారం వేడిగా పొంగళి, ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి కూరగాయల పలావ్, గుడ్డు కూర, వేరుశెనగ చిక్కీ అందిస్తున్నాం. మంగళవారం రోజు పులిహోర, టమోట పచ్చడి, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు ఇస్తుండగా బుధవారం నాడు కూరగాయలు అన్నం, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశెనగ చిక్కీ ఇస్తున్నారు.

గురువారం మెనూలో సాంబార్‌ బాత్‌ లేదా లెమన్‌రైస్‌ విత్‌ టమోట పచ్చడి, ఉడికించిన గుడ్డు ఉంటాయి. శుక్రవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశెనగ చిక్కీ అందిస్తున్నారు. శనివారం నాడు పప్పు, ఆకుకూర అన్నం, తీపి పొంగల్‌ ఇస్తున్నాం. ఇలా వారంలో మొత్తం 15 రకాల ఆహార పదార్థాలను గోరుముద్దలో భాగంగా పిల్లలకు అందిస్తున్నాం.

వారంలో ఐదు రోజులపాటు ఉడికించిన గుడ్లు, మూడు రోజులు చిక్కీ ఇస్తున్నాం. చిక్కీ ఇచ్చే మూడు రోజులు కాకుండా మిగిలిన మూడు రోజుల పాటు మంగళ, గురువారం, శనివారాల్లో ఇప్పుడు రాగి జావ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 
 
సత్యసాయి ట్రస్టు సహకారంతో..
పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు భాగస్వామి కావడం నిజంగా మంచి పరిణామం. ఈ కార్యక్రమానికి శ్రీసత్యసాయి స్వామి వారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఏటా దాదాపు రూ.86 కోట్లు ఖర్చయ్యే రాగి జావ కోసం సత్యసాయి ట్రస్టు రూ.42 కోట్లు అందిస్తుండగా మిగిలిన రూ.44 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమకూరుస్తూ మంచి కార్యక్రమానికి ముందడుగు వేస్తున్నాం.

ఇందుకు సత్యసాయి ట్రస్టుకు ప్రత్యేకంగా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలకు మంచి జరగాలని తపన పడుతున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దయ, తల్లిదండ్రుల దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ రాగిజావ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement