CM Jagan: చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు | CM YS Jagan Release YSR Kapu Nestham Scheme Amount at Gollaprolu | Sakshi
Sakshi News home page

CM Jagan: చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు

Published Sat, Jul 30 2022 3:09 AM | Last Updated on Sat, Jul 30 2022 8:42 AM

CM YS Jagan Release YSR Kapu Nestham Scheme Amount at Gollaprolu - Sakshi

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఇవాళ సహాయ కార్యక్రమాల్లో మొత్తం అధికార యంత్రాంగాన్నంతటినీ మోహరించాం. మానవత్వంతో సహాయం చేస్తున్నాం. ఆరుగురు జిల్లా కలెక్టర్‌లు, ఆరుగురు జాయింట్‌ కలెక్టర్‌లు బాధితుల వెన్నంటి ఉన్నారు. రేషన్, రూ.2 వేల సాయం అందలేదని ఏ ఒక్కరూ అనలేదు. ఈ పెద్దమనిషి (చంద్రబాబు) మాత్రం నిన్న (గురువారం) చేతిలో కాగితాలు పట్టుకుని అబద్ధాలు చెప్పారు. ఎలాగైనాసరే ప్రజలను నమ్మించగలమని అనుకుంటున్నారు. ఎందుకంటే పత్రికలు నడిపేది వాళ్లే, టీవీలు వాళ్లవే, చర్చ నడిపించేది, చర్చించేది వాళ్లే కాబట్టి.  – సీఎం వైఎస్‌ జగన్‌  

గొల్లప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు. ఆ పెద్ద మనిషిది అదో మార్కు రాజకీయం. ఒకటే అహంకారం. ఆయనకు డబ్బా కొట్టే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఉన్నాయని, ఏ అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారనే ధీమా. వీటికి తోడుగా దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. కనీసం 10 హామీలు కూడా అమలు చేయకుండా చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి, ఇప్పుడేమో సంక్షేమ పథకాలు రద్దు చేయాలంటున్నారు.

డీబీటీ అమలుతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వెటకారం చేస్తున్నారు. చంద్రబాబుతో కూడిన ఈ దుష్టచతుష్టయం గతంలో అమలు చేసిన డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) కావాలో, మనం అమలు చేస్తోన్న డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) కావాలో ఒకసారి ఆలోచించండి’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు.

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం ఆయన కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. చంద్రబాబు గత పాలన, ప్రతిపక్ష నేతగా అతని తీరును తూర్పారపట్టారు. గడచిన మూడేళ్ల సంక్షేమ పాలనకు, గత ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  


కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన సభకు భారీగా హాజరైన మహిళలు.

దిగజారిన రాజకీయాలు
►కాపుల ఓట్లను కొంతమేర అయినా కూడగట్టి, వాటన్నింటినీ హోల్‌సేల్‌గా చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడి రాజకీయాలు ఇవాళ కనిపిస్తున్నాయి. రాజకీయాలు దిగజారిపోయాయి. గతంలో ఒక కులానికి కానీ, ఒక సామాజిక వర్గానికి కానీ.. ఆ ప్రభుత్వం ఏం మేలు చేసింది.. అని అడిగితే లెక్కలు మాత్రమే చూపించేవారు. బడ్జెట్లో వందల కోట్లు చూపించినా, అదే కులానికి చెందిన నాకు ఎందుకు మేలు జరగ లేదని, ఆ లెక్కలన్నీ మాయాజాలమే అనుకునేవారు. 


ముఖ్యమంత్రి జగన్‌కు సాదర స్వాగతం పలుకుతున్న విద్యార్థినులు 

►ఇవాళ మనం ఇంటింటికీ వెళ్లి.. మీకు ఇన్ని పథకాలు అందాయి అని చెప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. పారదర్శకంగా ఇంత మంచి చేశాం. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా ఉందా? ఆలోచించండి.
►బాబు పాలనలో అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీలు చెబితేనే కొద్ది మందికి మాత్రమే అరకొరగా మేలు జరిగేది. అదీ లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. లంచాలు, వివక్ష అనేవి ఇవాళ ఎక్కడా కనిపించవు.   ఇవాళ మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయం, వర్గం, ఇవేమీ చూడకుండా మేలు చేస్తున్నాం. మనకు ఓటు వేసినా, వేయకపోయినా ఇస్తున్నాం. 


కాపునేస్తం లబ్ధిదారులైన మహిళలతో సీఎం జగన్‌. చిత్రంలో ఎంపీ వంగా గీత 

మీరే ఆలోచించండి..
►వందకుపైగా సామాజిక వర్గాల బాగుకోరే మన పాలన కావాలా? లేక గత ప్రభుత్వం మాదిరి చంద్రబాబు, వారి దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు బాగు మాత్రమే కావాలా.. ఆలోచించండి. మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేసిన, నిజాయితీతో కూడిన రాజకీయాలు కావాలా? లేక మోసం, వెన్నుపోటు, వంచనతో కూడిన.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పచ్చి అబద్ధాల మార్కు చంద్రబాబు రాజకీయం కావాలా? ఈ విషయాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. 
►హుద్‌ హుద్‌ తుపాను వచ్చినప్పుడు ప్రతి ఇంటికీ రూ.4 వేలు ఇచ్చానని, ఇవాళ జగన్‌ రూ.2వేలు ఇచ్చారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. హుద్‌ హుద్‌ తుపాను వచ్చినప్పుడు నేను ఉత్తరాంధ్ర జిల్లాలో  తిరుగుతున్నా. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు అప్పట్లో 11 రోజులు తిరిగాను. అప్పుడు వారు ఇచ్చింది పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు, అక్కడకక్కడా 10 కేజీలు బియ్యం మాత్రమే. తిత్లీ తుపాను సమయంలోనూ అంతే.  


►గతంలో కూడా ఇదే బడ్జెట్‌. ఇప్పటి కంటే అప్పుడే అప్పులు ఎక్కువ. మరి అప్పుడు పేదలకు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవాళ మీ బిడ్డ ఇన్ని పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాడు? కేవలం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకపోవడమే తేడా. నాకు ఉన్నది మీ దీవెనలు. ఆ దేవుడి ఆశీస్సులు. 
– సీఎం వైఎస్‌ జగన్‌

గత పాలకులు బూటు కాళ్లతో తన్నించారు
గత చంద్రబాబు పాలనలో కాపులను బూటు కాళ్లతో తన్నించారు. మహిళలతో అసభ్యంగా మాట్లాడారు. ఈ ప్రభుత్వం మాత్రమే మా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతోంది. కాపు నేస్తం, ఇతర పథకాల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటున్నారు. మీ సాయంతో నేను టీ దుకాణం పెట్టుకుని, సొంత కాళ్లపై నిలబడ్డాను. 35 ఏళ్ల క్రితం నాకు పెళ్లయింది. అద్దె ఇంటిలోనే కాలం వెళ్లదీస్తున్నాం. మీరు పెద్ద కొడుకుగా మా సొంత ఇంటి కల నెరవేరుస్తున్నారు. కొమరగిరిలో స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం జరుగుతోంది. పూర్తయ్యాక మీరు (సీఎం) మా గృహ ప్రవేశానికి తప్పకుండా రావాలి.
 – బండారు సుజాత, కాకినాడ అర్బన్‌

మళ్లీ మీరే సీఎం కావాలి
గత ప్రభుత్వం కాపుల్ని అగ్రవర్ణాలుగా చూసింది తప్ప చేసిందేమీ లేదు. కాపు మహిళలు డబ్బులు లేకపోయినా ఇల్లు దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో మీరు అన్ని విధాలా ఆదుకుంటున్నారు. ఎంతో మంది మహిళలు మీ సాయం అందుకుని సొంత కాళ్లపై నిలబడ్డారు. నేను గేదెలను కొనుక్కుని పాల వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాను. కుటుంబ పోషణకు నా భర్తకు నెలకు రూ.4 వేలు ఇస్తున్నాను. నా భర్త ఆటో డ్రైవర్‌. వాహనమిత్ర ద్వారా అతనికి రూ.10 వేల సాయం అందింది. ఇటీవల ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్తకు ప్రాణ భిక్ష పెట్టారు. నా కుమారుడికి ఫీజు రీయింబర్స్‌మెంట్, మా అత్తకు పింఛన్‌ అందుతోంది. ఇంటి స్థలం ఇచ్చారు. ఇంత మేలు చేసిన మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలి. 
– చిక్కాల రాణి, కొవ్వాడ, కాకినాడ రూరల్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement