
సాక్షి, అమరావతి: ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.1,048.94 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు 2020-2021 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి తొలి విడత నగదు జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని, విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
తల్లులే నేరుగా ఫీజులు కట్టడం వల్ల జవాబుదారీతనం
ప్రతి విద్యార్ధి ప్రపంచంతో పోటీ పడాలని, చదువుకు పేదరికం అడ్డు కాకూడదని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో 'జగనన్న వసతి దీవెన' నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్ధులకు సాయం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నామని, తల్లులే నేరుగా ఫీజులు కట్టడం వల్ల జవాబుదారీతనం వస్తుందని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. 10.89లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048.94 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు.
అమ్మఒడి పథకం కింద డబ్బు లేదా ల్యాప్‌టాప్
'జగనన్న వసతి దీవెన' ద్వారా 2,270 కోట్లు సాయం చేశామని, 'జగనన్న వసతి దీవెన' ద్వారా విద్యారంగంలో డ్రాప్ అవుట్‌లు తగ్గాయని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను తీసుకొస్తామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 'అమ్మఒడి' పథకానికి ఆప్షన్లు ఇచ్చామని, అమ్మఒడి పథకం కింద డబ్బు లేదా ల్యాప్‌టాప్ ఇస్తామని తెలిపారు. అంగన్‌వాడీలను వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నామని వివరించారు. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం’ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా కాలేజీలో సీటు
టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్ కోసం తాను ఆలోచిస్తాని సీఎం జగన్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదన్నారు. పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా కాలేజీలో సీటు వస్తుందని గుర్తుచేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. కోవిడ్‌పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి కోవిడ్ కల్లోలంలోనూ దాన్ని తూచా తప్పకుండా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థుల బంగారు భవితే లక్ష్యంగా గత వారం ‘జగనన్న విద్యా దీవెన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మొదటి త్రైమాసికం కింద రూ.671.45 కోట్లు వారి తల్లుల ఖాతాలకు సీఎం జమ చేసిన విషయం తలిసిందే. ఇప్పుడు వసతి, భోజన ఖర్చులకు రూ.1,048.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేల చొప్పున, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను చెల్లించేందుకు ‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారు. ‘జగనన్న వసతి దీవెన’ పథకం ద్వారా ఇప్పటికే రూ.1,220.99 కోట్లను చెల్లించారు. మొదటి విడతగా రూ.1,048.94 కోట్లను చెల్లించారు. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన కింద రూ.2,269.93 కోట్లు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment