
సాక్షి, అమరావతి: గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, బిస్మిల్లాఖాన్, భీంసేన్ జోషి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి లాంటి గొప్ప గాయకులు, సంగీత విద్యాంసులకు భారత రత్నను ఇచ్చి సత్కరించినట్లుగానే అసాధారణ ప్రతిభాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించి గౌరవించాలని లేఖలో కోరారు.
► సంగీత సామ్రాజ్యంలో ఐదు దశాబ్దాల పాటు విశేష ప్రతిభ ప్రదర్శించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వడం అత్యున్నత స్థాయి గుర్తింపు నిచ్చినట్లు అవుతుంది. ఆయనకు అదే అత్యున్నత నివాళి.
► నెల్లూరులో ఇలాంటి మహా గాయకుడు జన్మించడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఆయన అకాల మరణం అశేష అభిమానులను విషాదంలో ముంచెత్తింది. అంతర్జాతీయంగా సంగీతాభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆయన విజయగాథ, సాధించిన ఘనత ఎల్లలు లేనివి. అసమానమైన ప్రతిభతో అసమాన స్థాయికి ఎదిగారు.
► తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎస్పీ 40 వేలకుపైగా పాటలు పాడారు. అత్యుత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ అవార్డులను గెల్చుకున్నారు.
► తెలుగు సినిమాల్లో అత్యుత్తమ గాయకుడిగా 25 రాష్ట్ర స్థాయి నంది అవార్డులను సాధించారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్ర అవార్డులను కూడా అనేకం గెల్చుకున్నారు.
► ఫిలింఫేర్ అవార్డు, ఫిలింఫేర్ దక్షిణాది ఉత్తమ గాయకుడుగా ఆరు అవార్డులు పొందారు. 2016లో భారత సినీ రంగ ప్రముఖుడుగా(ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్) ఆయనకు వెండి నెమలిని ప్రదానం చేశారు. ఎస్పీ బాలుకు కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ , 2011లో పద్మభూషణ్ అవార్డులను ఇచ్చి గౌరవించింది. (థాంక్యూ సీఎం జగన్: కమల్ హాసన్)
Comments
Please login to add a commentAdd a comment