రాష్ట్రంలో ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్‌ ఉండాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review On Law And Order In AP At Tadepalli | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్‌ ఉండాలి: సీఎం జగన్‌

Published Mon, Oct 4 2021 11:50 AM | Last Updated on Mon, Oct 4 2021 4:48 PM

CM YS Jagan Review On Law And Order In AP At Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం... తదితర అంశాలపై సీఎం జగన్‌ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు..

‘దిశ’ చట్టం ప్రగతిపైనా సీఎం సమీక్ష..
– రాష్ట్రంలో ‘దిశ’ అమలుపై సీఎం జగన్‌ సమీక్షించారు.
– ఇప్పటివరకూ 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్‌ చేశారని వెల్లడించిన పోలీసు అధికారులు.
– దిశ యాప్‌ ద్వారా 5,238 మందికి సహాయం.
– దిశ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసిన ఎఫ్‌ఐఆర్‌లు 2021లో 684.
– నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్‌ చేశామన్న పోలీసులు.
– వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్నదానిపై నిరంతరం మెసేజ్‌లు పంపిస్తున్నామన్న పోలీసులు.
– దిశ పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ వచ్చిందన్న పోలీసు అధికారులు.
– మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామన్న పోలీసులు.
– జీరో ఎఫ్‌ఐఆర్‌లను కూడా నమోదు చేస్తున్నామన్న పోలీసులు.
– ఫోరెన్సిక్‌ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటులో వేగం పెరిగిందన్న పోలీసులు.
– గతంలో డీఎన్‌ఏ రిపోర్టుకోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 2రోజుల్లో నివేదిక వస్తుందన్న పోలీసులు.
-  సంబంధిత కేసుల్లో 7 రోజుల్లో ఛార్జిషీటు వేయగలుగుతున్నామన్న పోలీసులు.

ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్‌
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌ ఉండాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్లో ‘దిశ’యాప్‌ డౌన్లోడ్‌ కావాలి. వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి. ‘దిశ’యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ‘దిశ’యాప్‌ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలి’’ అని సూచించారు.

‘దిశ’ బిల్లు ఆమోదం ఏ దశలో ఉందో అధికారులు సీఎం జగన్‌కి వివరాలు అందించారు. శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదని సీఎం జగన్‌ అభిపప్రాయపడ్డారు. వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సీఎం సమీక్ష సమీక్ష నిర్వహించారు. పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయని.. డిసెంబర్‌ నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. 
(చదవండి: AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’)

మహిళలపై నేరాలకు సంబంధించిన 12 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయని.. కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందని పోలీసులు తెలిపారు. ఈ కోర్టుల్లో గవర్నమెంటు ప్లీడర్లను పూర్తిస్థాయిలో ఉంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు.ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలన్న సీఎం, దీనికోసం సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం, వారి పనితీరుపైనా కూడా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. 

‘దిశ’ ఒన్‌స్టాప్‌ సెంటర్ల పనితీరుపైనా, సచివాలయాలల్లో మహిళా పోలీసుల వ్యవస్థపైనా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకూ 2,652 కేసులను దిశ ఒన్‌స్టాప్‌ సెంటర్ల ద్వారా హేండిల్‌ చేశామని అధికారులు తెలిపారు. దేవాలయాల్లో భద్రతకోసం 51,053 సీసీ కెమెరాలు పెట్టించామన్నారు అధికారులు.

బాధితులకు సత్వర న్యాయంపై దృష్టిపెట్టండి’: సీఎం జగన్‌
‘‘అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. శరవేంగా బాధితులను ఆదుకోవాలి. వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలి. ఘటన జరిగిన నెలరోజుల్లోపు బాధిత కుటుంబాలకు అందజేయాలి. ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి’’ అని సీఎం జగన్‌ సూచించారు.
(చదవండి: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్‌’ )

సైబర్‌ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు సీఎం ఆదేశం
‘‘సైబర్‌ క్రైం నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి. సమర్థత ఉన్న అధికారులను, సమర్థవంతమైన న్యాయవాదులను ఇందులో నియమించండి. ఏపీలో డ్రగ్స్‌ వ్యవహారం నిజం కాదని తెలిసికూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి’’ అన్నారు సీఎం జగన్‌. 

కేసుల సంఖ్యను పట్టించుకోవద్దు.. ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకొచ్చే పరిస్థితుల కల్పనే ముఖ్యం అన్నారు సీఎం జగన్‌. బాధితులు స్వేచ్ఛగా ముందుకురావాలి, వారు ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. బాధితుడికి భరోసాగా పరిస్థితులు ఉండడం అన్నది ముఖ్యం అన్నారు సీఎం జగన్‌.
(చదవండి: మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: అడవి శేషు)

కాలేజీలు, యూనివర్శిటీలు డ్రగ్‌ ఫ్రీగా ఉండాలి
కాలేజీలు, యూనివర్శిటీలు ‘మాదక ద్రవ్య రహితంగా తయారు కావాలి. ఇందుకుగాను తక్షణ చర్యలకు సీఎం జగన్‌ ఆదేశించారు. ‘‘రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ  ఉండాలి. మాదకద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయా.. లేవా.. సమీక్షించాలి. ఉంటే డ్రగ్స్‌ని ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండకూడదు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించండి’’ అని సూచించారు.

‘మద్యం అక్రమ తయారీ, రవాణాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌..
– రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, అక్రమ రవాణాలపై ఎస్‌ఈబీ సహా... పోలీసులు ఉక్కుపాదం మోపాలి.
– అధికారంలోకి రాగానే 43వేల బెల్టుషాపులు తీసేశాం.. మద్యం అమ్మే దుకాణాలను మూడోవంతు తగ్గించాం.
– ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి, మద్యం రేట్లు పెంచడం వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది
– మద్యం అక్రమ రవాణా, తయారీకి ఆస్కారం ఇవ్వకూడదు. 
– దీన్ని నిరోధించడానికి అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి.
– ఎస్‌ఈబీతోపాటు, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి.
– ఇసుక అక్రమ రవాణాపైన కూడా చర్యలు తీసుకోవాలి.
– గుట్కా నిరోధంపైనా కూడా దృష్టిపెట్టాలి.
– ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులను నియమించాం.
– ఈ  మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వాలి.. డిసెంబరు నాటికి పూర్తిచేయాలి.
– వచ్చే ఏడాది కనీసంగా 6 నుంచి 7వేల మంది పోలీసుల నియామకాలపై దృష్టిపెట్టాలి.
– దీనికి సంబంధించి సంబంధిత శాఖలు సిద్ధం కావాలన్న సీఎం జగన్‌ సూచించారు. 

ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి,  వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: దిశ యాప్‌ ఉంటే.. ఓ అన్న మీ వెంట ఉన్నట్టు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement