రైతుల విషయంలో రాజీ పడొద్దు: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Purchases Of Agricultural Products | Sakshi
Sakshi News home page

జనతా బజార్లలో తప్పనిసరిగా ఫ్రీజర్లు ఉండాలి

Published Wed, Sep 30 2020 8:13 PM | Last Updated on Wed, Sep 30 2020 8:21 PM

CM YS Jagan Review Meeting On Purchases Of Agricultural Products - Sakshi

సాక్షి, అమరావతి : తమ పంటలు అమ్ముకోవడంలో ప్రభుత్వం రైతులకు సహాయకారిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఖరారు చేసే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎక్కడా పంట కొనుగోలు జరగకూడదని అధికారులను ఆదేశించారు. వీలుంటే ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్దతు ధరలపై ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతులకు ఏ విధంగా కూడా నష్టం జరగకూడదని, రైతుల విషయంలో రాజీ పడొద్దని అన్నారు. రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌లో పోటీ ఏర్పడాలని తెలిపారు. తద్వారా రైతులకు మెరుగైన ధర రావాలని, ఇదీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. (ఇకపై రైతుల ఇంటికే ఎరువులు, ఎస్ఎ‌ంఎస్‌లు)

ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి, మార్కెట్‌లో పోటీ ఏర్పడేలా చేస్తుందన్నారు. గత ఏడాది రైతులకు కనీస గిట్టుబాటు ధర రావాలని దాదాపు రూ.3200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పలు పంటలు కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.11,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెప్పిన దాని కన్నా ఎక్కువ కేటాయించి పంటలు కొనుగోలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా రూ.3300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం జరిగిందని, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతులకు అస్సలు రావొద్దని అన్నారు. పంటలకు ముందుగానే ధరలు ప్రకటిస్తామని చెప్పామని, ఆ మేరకు రేపు (అక్టోబరు1) పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) ప్రకటించబోతున్నామని వెల్లడించారు. అంతే కాకుండా తప్పనిసరిగా ఆ ధరలు రైతులకు దక్కేలా చూస్తామన్నారు. కనీస ధర లేక ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. (సీఎం జగన్‌ను కలిసిన పొగాకు బోర్డు చైర్మన్‌)

జనతా బజార్లు:
రైతుల ఉత్పత్తులకు గ్రామాల్లో కూడా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడం కోసం జనతా బజార్లు ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆ బజార్లలో తప్పనిసరిగా ఫ్రీజర్లు ఉండాలని, రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్‌ జీ, హిందుస్తాన్‌ లీవర్ వంటి సంస్థలను కూడా జనతా బజార్లలోకి తీసుకురావాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా జనతా బజార్లతో పాటు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పని రైతులకు మేలు చేసే విధంగా ఉండాలన్నారు. వారు ఎక్కడా నష్టపోకుండా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కె కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. (ఇదొక అద్భుతమైన నిర్ణయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement