సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల అభివృద్ధిని కాంక్షించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, వారికి మరింత ప్రయోజనం కలిగించే దిశగా అగ్రి ప్రాజెక్టులన్నింటినీ నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.15,743 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, వారు ఏ అవసరానికైనా ఊరు దాటి వెళ్లకుండా అన్ని వసతులు కల్పించాలన్నదే మనందరి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు.
ఈ దిశగా ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసి అండగా నిలిచామని.. ఆధునిక వ్యవసాయ పరికరాలు, యాంత్రీకరణను వారికి అందుబాటులోకి తేవడం ద్వారా మరింత చేయూత ఇచ్చే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఎక్కడికక్కడ పంటలను ప్రాసెస్ చేయడం ద్వారా రైతులకు మంచి ధర వస్తుందని, ఇందు కోసం గ్రామ స్థాయిలో విత్తన, మిల్లెట్ ప్రాసెసింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్ని విధాలా వీలైతే అన్ని విధాలా రైతులకు అండగా నిలవాలన్నదే మనందరి ప్రభుత్వ తాపత్రయమని, అందువల్ల అధికారులు వీటన్నింటిపై దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అధికారుల స్థాయిలో ప్రతి ఆదివారం సమీక్ష చేయాలని సూచించారు. ఈ సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి.
అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలతో ఎంతో మేలు
► మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలు (ఎంపీఎఫ్‌సీ) రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్దే ఏర్పాటవుతున్నాయి. ఇందులో భాగంగా డ్రై స్టోరేజీ–డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లు (పంటను ఎండబెట్టే వసతి), ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) గోదాములు, ఎస్సేయింగ్ (నాణ్యత పరీక్ష) ఎక్విప్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్‌ఫ్రా, పశు సంవర్థక మౌలిక సదుపాయాల వరకు దాదాపు 16 రకాల ప్రాజెక్టులు రైతులకు అందుబాటులోకి రానున్నాయి.
► 4,277 డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లు, పీడీఎస్ కోసం 60 గోదాములు, 1,483 సేకరణ కేంద్రాలు, కోల్డ్ రూమ్స్, టర్మరిక్ (పసుపు) బాయిలర్లు, పాలిషర్లు.. 7,950 ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్‌మెంట్, 10,678 ఎస్సేయింగ్ ఎక్విప్‌మెంట్, 10,678 సేకరణ కేంద్రాల ఎక్విప్‌మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
బీఎంసీయూల నిర్మాణం మొదలు
► రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,885.76 కోట్ల అంచనా వ్యయంతో 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), రూ.942.77 కోట్లతో 8,051 ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాల (ఏఎంసీయూ) నిర్మాణానికి అంచనాలు రూపొందించాం.
► రాష్ట్రంలో ఇప్పటికే 9,051 చోట్ల బీఎంసీయూల కోసం భూమి గుర్తించగా, 6,252 యూనిట్ల నిర్మాణం ఇప్పటికే మొదలైంది. సెప్టెంబర్ 30 నాటికి మొత్తం బీఎంసీయూల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటి వల్ల రాష్ట్రంలో పాడిపై ఆధారపడిన అక్కచెల్లెమ్మల ఆదాయం పెరుగుతుంది.
కస్టమ్ హైరింగ్ సెంటర్లు
► ఒక్కో యూనిట్ వ్యయం రూ.15 లక్షల చొప్పున ఆర్బీకేల స్థాయిలో మొత్తం 10,750 కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ– అద్దెకు వ్యవసాయ పరికరాలు) ఏర్పాటు చేస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 175 చోట్ల హైటెక్ హైవాల్యూ ఫామ్ మెకనైజేషన్ (అత్యాధునిక వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు) హబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో హబ్ వ్యయం దాదాపు రూ.1.5 కోట్లు అవుతుంది.
► ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉండే నాలుగు జిల్లాలలో ప్రత్యేక క్లస్టర్లను గుర్తిస్తున్నాం. ఆ మేరకు ఆయా జిల్లాలలో మండలానికి 5 చొప్పున క్లస్టర్ స్థాయిలో కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కోటి రూ.25 లక్షల వ్యయం అంచనాతో మొత్తం 1,035 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
వచ్చే ఏడాదికి 4 ఫిషింగ్ హార్బర్లు
► తొలి దశలో ఉప్పాడ (తూ.గో), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా), జువ్వలదిన్నె (నెల్లూరు)లో వచ్చే ఏడాది (2022) డిసెంబర్ నాటికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
► రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం.
► ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
► మత్స్యకారులు, ఆక్వా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం 10 ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రి ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు, 100 ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. 25 హబ్‌ల పనులు ఈ నెలలో మొదలు కానున్నాయి.
► రూ.646.90 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 133 ప్రాసెసింగ్, ప్రిప్రాసెసింగ్ యూనిట్లు, ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహిళా రైతులకు రూ.3.91 కోట్లు అదనంగా ఆదాయం
► గత ఏడాది నవంబర్ 20న ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో అమూల్ పాల సేకరణ మొదలు పెట్టగా, ఈ ఏడాది మార్చి 29న గుంటూరు జిల్లాలో, ఏప్రిల్ 3న చిత్తూరు జిల్లాలోనే మరి కొన్ని గ్రామాలకు పాల సేకరణ విస్తరించారు.
► ఈ నెల 4 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణ మొదలు పెడుతోంది.
► 4 జిల్లాలలో 12,342 మంది మహిళా రైతుల నుంచి 50.01 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్న అమూల్.. రూ.23.42 కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది. తద్వారా మహిళా రైతులకు రూ.3.91 కోట్ల అదనపు ఆదాయం లభించింది.
గ్రామ స్థాయిలో విత్తన, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు
► రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల స్థాయిలో 10,111 విత్తన, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం చేపడుతున్నాం. ప్రైమరీ, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం.
► పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 25 చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్‌కు అవకాశం ఉన్న పంటల గుర్తింపునకు చర్యలు తీసుకున్నాం. ఆ మేరకు యూనిట్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు కొనసాగుతోంది. వచ్చే ఏడాది జూన్ చివరికి వీటిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
Comments
Please login to add a commentAdd a comment