YSR Bima: స​ర్కారే పెద్ద​ దిక్కు | CM YS Jagan Review Meeting On YSR Bheema | Sakshi
Sakshi News home page

YSR Bima: స​ర్కారే పెద్ద​ దిక్కు

Published Thu, Jun 10 2021 3:30 AM | Last Updated on Thu, Jun 10 2021 11:22 AM

CM YS Jagan Review Meeting On YSR Bheema - Sakshi

సాక్షి, అమరావతి: పేద కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు సత్వరమే ఆదుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోయినా, పేద కుటుంబాల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ.. పలు కారణాలతో ఇన్సూరెన్స్‌ కంపెనీలు కొర్రీలు వేస్తున్నాయి. ప్రీమియం చెల్లించాక, లబ్ధిదారుల పేర్లతో వ్యక్తిగత ఖాతాలు తెరవడానికి బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. బ్యాంకర్లను బతిమాలి ఒప్పించినా, ప్రక్రియ సకాలంలో పూర్తి కావడం లేదు. బ్యాంకు దశ దాటుకుని ఇన్సూరెన్స్‌ కంపెనీకి చేరుకున్న దరఖాస్తుల విషయంలోనూ కొత్త నిబంధనలు ఇబ్బంది పెడుతున్నాయి. తమకు దరఖాస్తు అందాక కనీసం 45 రోజుల తర్వాతే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందని చెబుతున్నాయి.

దురదృష్టవశాత్తు అంతలోనే ఎవరైనా మృతి చెందితే పరిహారం అందని దుస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 6,173 క్లెయిములు వస్తే, అందులో కేవలం 2,839 క్లెయిములకు సంబంధించిన డాక్యుమెంట్లను మాత్రమే అప్‌లోడ్‌ చేయడం దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందులో 152 కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర లేదు. కోవిడ్‌తో పాటు ఈ కష్టాలను కూడా ఏదో విధంగా అధిగమించి.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న పట్టుదలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొద్ది రోజులుగా ఈ వ్యవహారంపై కసరత్తు చేసింది. ఇబ్బందులకు జడిసి మిన్నకుండిపోతే పేదలకు అండగా నిలిచిన ఒక పథకం నిరర్థకం అవ్వడం ఇష్టం లేక, ధైర్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబాన్ని సత్వరం ఆదుకునేందుకు బ్యాంకులు, బీమా కంపెనీలతో సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ మేరకు వైఎస్సార్‌ బీమా పథకంపై బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో తన నిర్ణయాన్ని వెలువరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆ బాధ్యత మాదే..
బీమా కంపెనీలు, బ్యాంకుల ద్వారా ఎదురవుతున్న చిక్కుల నేపథ్యంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా వైఎస్సార్‌ బీమాలో మార్పులు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్‌ బీమా కింద రాష్ట్ర ప్రభుత్వమే సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తిది సహజ మరణమైతే.. బీమా కంపెనీలు, బ్యాంకులతో సంబంధం లేకుండానే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే ఒక లక్ష రూపాయలు సాయం అందిస్తుందని సీఎం జగన్‌ చెప్పారు. 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. జూలై 1వ తేదీ నుంచి కొత్త మార్పులతో కూడిన వైఎస్సార్‌ బీమా అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ లోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన వారి క్లెయిమ్‌లను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని, జూలై 1లోగా ఈ క్లెయిమ్‌లన్నింటినీ పరిష్కరించాలని సూచించారు. ఇవే కాకుండా రైతులు, మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణించినా, పాడిపశువులు మరణించినా.. దరఖాస్తు అందిన నెల రోజుల్లోగా పరిహారం చెల్లించాలని చెప్పారు. వీటన్నింటి కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. నెల రోజుల్లోగా క్లెయిములను పరిష్కరించి బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని, అన్ని రకాల ఇన్సూరెన్స్‌ క్లెయిములకు సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్లు కచ్చితంగా నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఎన్ని క్లెయిములు వచ్చాయి? ఎన్ని పరిష్కరించాం? ఎంత మందికి పరిహారం చెల్లించాం? అనే వాటిపై పర్యవేక్షణ చేయాలన్నారు.  

ఎక్కడా అవినీతి లేకుండా రూ.95 వేల కోట్లు బదిలీ 
కేవలం కంప్యూటర్‌లో ఒకే ఒక్క బటన్‌ నొక్కడం ద్వారా డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) రూపంలో వివిధ పథకాల లబ్ధిదారులకు రూ.95 వేల కోట్లు బదిలీ చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఇవికాక ఇళ్ల పట్టాలు, సంపూర్ణ పోషణ, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కలిపితే రూ.1.35 లక్షల కోట్లు బదిలీ చేశామన్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఈ బదిలీ జరిగిందని, ఇందుకు ఆర్థిక శాఖ అధికారులను అభినందిస్తున్నానని చెప్పారు. కోవిడ్‌ కారణంగా మనం ఆశించిన ఆదాయం రాకపోయినా ఏ కార్యక్రమం కూడా ఆగకుండా అనుకున్న సమయానికే పూర్తి చేసుకుంటూ ముందుకెళుతున్నామని పేర్కొన్నారు. ఈ సమీక్షలో  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


ఎన్నో కష్టాలు.. అందుకే కొత్త ప్రతిపాదనలు 
– గతంలో ఇది గ్రూప్‌ ఇన్సూరెన్స్‌గా ఉండేది. ప్రీమియంలో సగం కేంద్రం చెల్లించేది. అయితే ఈ స్కీం నుంచి కేంద్రం వైదొలిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని 1.41 కోట్ల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆదుకునేలా వైఎస్సార్‌ బీమాను ప్రభుత్వం తీసుకొచ్చింది. 
– అయితే బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం, బీమాకు లింకేజి చేయడం, తీరా లింకేజి చేసిన తర్వాత ఆ క్లెయిములు పరిష్కారం కాకపోవడం.. తద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
– రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రీమియం చెల్లించినా సరే ఖాతాలను తెరిచి, బీమాకు అనుసంధానం చేయడం లేదు. బీమా కింద అర్హత కోసం ఎన్‌రోల్‌ చేయించుకునేందుకు లక్షల కొద్దీ అప్లికేషన్లు ఇంకా బ్యాంకు బ్రాంచీల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
– బీమాకు లింకేజి చేసిన తర్వాత కూడా 45 రోజులు లీన్‌ పీరియడ్‌గా తీసుకుని, ఆ కాలంలో కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. ఇలా 12,039 మంది మరణిస్తే.. వారి కుటుంబాలకు పరిహారం అందలేదు.
– ఈ నేపథ్యంలో మీరు (ముఖ్యమంత్రి) ఉదారంగా ముందుకు వచ్చి ఆదేశాలు ఇచ్చారు. తద్వారా ఆయా కుటుంబాలకు బీమా పరిహారం కింద ప్రభుత్వం రూ.254.72 కోట్లు చెల్లించింది. 
– చాలా ప్రయత్నాలు చేసినా, ఇప్పటి వరకూ 60 లక్షల బ్యాంకు ఖాతాలను మాత్రమే తెరిచారు. మరో 58 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. క్లెయిముల పరిశీలన, వాటి డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయడం, సకాలంలో బీమా కంపెనీలకు వాటిని పంపడంలో బ్యాంకులు తీవ్ర జాప్యం చేస్తున్నాయి.
– ఇప్పటి వరకు 6,173 క్లెయిములు వస్తే, అందులో కేవలం 2,839 క్లెయిములకు సంబంధించిన డాక్యుమెంట్లను మాత్రమే అప్‌లోడ్‌ చేశారు. అందులో కేవలం 152 కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చారు. 
– బీమా కంపెనీలతో బ్యాంకులకు ఉన్న ఒప్పందాలను కూడా తిరిగి పునరుద్ధరించుకునే విషయంలో కొన్ని బ్యాంకులు సందిగ్ధ స్థితిలో ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 2021–22కు సంబంధించి సీజీజీబీ, ఆప్కాబ్‌ లాంటి బ్యాంకులు బీమా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోలేదు. ఈ సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రతిపాదనలు చేశాం. 

ఒక కుటుంబం సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు వారికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌ కష్టాలు, ఇతరత్రా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ విషయంలో జాప్యం పనికి రాదు. ఎవరికీ పట్టని వ్యవహారంగా ఉండకూడదు. మృతి చెందిన వారిని వలంటీర్లు గుర్తించాలి. ఇన్సూరెన్స్‌ దరఖాస్తుల స్క్రీనింగ్‌ బా«ధ్యతను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించాలి. ఆ కుటుంబానికి నిర్ణీత సమయంలోగా సాయం అందాలి. జూలై 1లోగా నిర్ణీత సమయంతో కూడిన ఎస్‌ఎల్‌ఏ (సర్వీస్‌ లెవెల్‌ అగ్రిమెంట్‌)ను ఖరారు చేయాలి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement