మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review On Municipal Department | Sakshi
Sakshi News home page

మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్‌

Published Fri, Oct 7 2022 12:00 PM | Last Updated on Fri, Oct 7 2022 4:58 PM

CM YS Jagan Review On Municipal Department - Sakshi

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమీక్షలో నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్‌మెంట్‌, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సార్‌ అర్బన్ క్లినిక్స్‌, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయని, మళ్లీ పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

సీజన్‌ ప్రారంభం కాగానే మళ్లీ డ్రైవ్‌ చేపట్టాలని, మార్చి 31  నాటికి అన్నిరోడ్లనూ మళ్లీ బాగు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.గార్బేజ్‌ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదన్నారు. ఇలాంటి చోట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టి నిర్వహణలో ఎలాంటి స్వచ్ఛ ప్రమాణాలు పాటిస్తున్నామనే దానిపై అవగాహన కల్పించాలని తెలిపారు. గార్బేజ్‌ స్టేషన్ల నిర్వహణలోనూ అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.
చదవండి: ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి

మున్సిపాల్టీలో మౌలిక సదుపాయాలపై నివేదికలు
►ప్రతి మున్సిపాల్టీలో కూడా వేస్ట్‌ ప్రాసెసింగ్‌ ప్రక్రియల అమలు తీరును పరిశీలించాలి.
►ప్రతి మున్సిపాల్టీలో కూడా ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ఉందా? లేదా? అన్నదానిపై నిరంతరం పరిశీలన చేయాలి.
►మున్సిపాల్టీల వారీగా చెత్త శుద్ధిచేసే ప్రక్రియలో ఉన్న సౌకర్యాలు, వసతులు, మురుగునీటి శుద్ధి.. ఈ అంశాల్లో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై నివేదికలు తయారు చేయాలి.
►లేనివాటికి ఆ వసతులను కల్పించుకుంటూ మురుగునీటి శుద్ధి, వేస్ట్‌ మేనేజ్మెంట్‌లలో ప్రతిమున్సిపాల్టీ సంపూర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలి. 

►కృష్ణానది వరద ముంపు రాకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్‌ వాల్‌ నిర్మించింది. గోడకు ఇటువైపున మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
►అలాగే రిటైనింగ్‌ వాల్‌ బండ్‌ను చెట్లు, విద్యుత్‌ దీపాలు, ఏర్పాటుచేసి అందంగా తీర్చిదిద్దాలి.

►ప్లాస్టిక్‌ ప్లెక్సీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
►దీన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలి.
►ప్లాస్టిక్‌ నుంచి క్లాత్‌ వైపు మళ్లడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అవసరమైన విధంగా వారికి తోడుగా నిలవాలి.
►రుణాలు ఇప్పించి వారికి అండగా నిలవాలి. ఇప్పించిన రుణాలను సకాలంలో కట్టేవారికి ప్రభుత్వం నుంచే వడ్డీ రాయితీ కల్పించేలా ఆలోచనలు చేయాలి.

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు..
►జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
►కాలక్రమేణా వీటిని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాలి.
►పెద్ద కాలనీలు నిర్మాణం పూర్తయ్యే కొద్దీ.. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ముందుకు సాగాలి.
►ప్రాధాన్యతా క్రమంలో నీళ్లు, డ్రైనేజీ, కరెంటు ఏర్పాటుచేసి తర్వాత మురుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి..

►విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు వెళ్లే రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులపై అధికారులు సీఎం జగన్‌కు వివరాలు అందించారు.
►అంబేద్కర్‌ పార్కుకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ ఆదేశించారు..
►వీటి తర్వాత విశాఖపట్నంలో సుందరీకరణ పనులు చేపట్టాలని తెలిపారు. 

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌
►జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమంపై శ్రద్ధపెట్టాలి.
►ప్రతి నియోజకవర్గానికి ఒక లే అవుట్‌ను తీర్చిదిద్దాలి.
►జిల్లాల వారీగా కలెక్టర్లతో దీనిపై సమీక్ష చేసి, ప్రత్యేక దృష్టిపెట్టాలి.

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంపై సమీక్ష
►వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారుల్లో సాధికారిత కోసం కృషిచేయాలి.
►ప్రతి ఏటా 45 ఏళ్లు నిండిన మహిళల్లో అర్హత ఉన్నవారికి వైయస్సార్‌ చేయూత కింద నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమచేస్తున్నాం.
►ఈ డబ్బు ద్వారా వారు స్వయం ఉపాధి పొందేలా తగిన చర్యలు తీసుకోవాలి.
అర్హత సాధించిన తొలి ఏడాదిలోనే వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించడం ద్వారా వారిలో సంపూర్ణ సాధికారితకు కృషిచేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ లక్ష్మీషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement