చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చి, మనోధైర్యాన్ని నింపారు. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కోవిడ్ బారిన పడిన రామకృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి బుధవారం చల్లా సొంతూరైన కర్నూలు జిల్లా అవుకు పట్టణానికి వచ్చారు. మధ్యాహ్నం 12.31 గంటలకు అవుకులోని ‘చల్లా భవన్’కు చేరుకున్నారు. చల్లా చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తర్వాత చల్లా సతీమణి శ్రీదేవి, కుమారుడు భగీరథరెడ్డి, సోదరులు రఘునాథరెడ్డి, రామేశ్వరరెడ్డి, ప్రభాకర్‌రెడ్డితో పాటు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని పేరుపేరునా పలుకరించారు. కోవెలకుంట్ల, బనగానపల్లె నియోజకవర్గాల అభివృద్ధికి చల్లా ఎనలేని కృషి చేశారని, ఆయన మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకూ తీరని లోటని సీఎం అన్నారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చల్లా ఎమ్మెల్యేగా ఉన్నారని, తాను సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అయ్యారని గుర్తు చేసుకున్నారు.
చల్లా లేని లోటు తీర్చలేనిది
చల్లా లేని లోటు కుటుంబానికి తీర్చలేనిదని, అయితే అన్ని విధాలుగా తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీఎం భరోసానిచ్చారు. దాదాపు 25 నిమిషాల పాటు చల్లా కుటుంబసభ్యులతో గడిపారు. ఆ తర్వాత అవుకు నుంచి నేరుగా ఓర్వకల్లు చేరుకుని..అక్కడి నుండి విజయవాడకు తిరుగుపయనమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, తదితరులు చల్లా కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యమంత్రి ఉదయం 11.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అవుకు వచ్చారు. ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment