
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల–తిరుపతిని కేంద్రంగా చేసుకుని తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సు (ఈ–బస్)లను ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. తిరుమల, తిరుపతిలలో 100 ఈ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఈవే ట్రాన్స్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేసిన ఈ–బస్‌ను ఆర్టీసీ ఇప్పటికే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. మరో 9 ఈ–బస్సులను మంగళవారం ఉదయానికి తిరుపతికి తీసుకురానుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత 10 ఈ–బస్సులను మంగళవారం సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం దశల వారీగా డిసెంబర్ నాటికి 100 ఈ–బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది.
తిరుమల ఘాట్ రోడ్డులో 50 బస్సులు..
అలిపిరి బస్ డిపో కేంద్రంగా ఆర్టీసీ వీటిని నడపనుంది. కాంట్రాక్టు దక్కించుకున్న ఈవే ట్రాన్స్ లిమిటెడ్ కంపెనీ వీటిని 12 ఏళ్ల పాటు నిర్వహించనుంది. 50 బస్సులను తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం కేటాయించారు. అలాగే, రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు 14 బస్సులు, తిరుపతి నుంచి మదనపల్లికి 12, తిరుపతి నుంచి నెల్లూరుకు, కడపకు 12 సర్వీసుల చొప్పున నిర్వహించాలని నిర్ణయించారు.
కాలుష్య నియంత్రణ
జీరో కర్బన ఉద్గారాలను వెదజల్లే వీటితో కాలుష్యాన్ని నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. 100 ఈ–బస్సులవల్ల ఏటా 5,100 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయంటున్నారు. ఏసీ ఇంద్ర బస్సుకు కిలోమీటర్‌కు రూ.28.75 ఇంధన వ్యయం అవుతుండగా.. ఎలక్ట్రికల్ బస్‌వల్ల కిలోమీటర్‌కు కేవలం రూ.7.70 ఖర్చే అవుతుంది. రానున్న రోజుల్లో ‘ఈవీ’ బ్యాటరీల ధరలు తగ్గనుండటంతో నిర్వహణ వ్యయం మరింతగా తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment