దుర్గమ్మ సేవలో ఏపీ సీఎం | CM YS Jaganmohan Reddy presented silk saree to Vijayawada Durgamma | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో ఏపీ సీఎం

Published Wed, Oct 13 2021 1:42 AM | Last Updated on Wed, Oct 13 2021 7:09 AM

CM YS Jaganmohan Reddy presented silk saree to Vijayawada Durgamma - Sakshi

విజయవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, తిరుపతి, తిరుమల/అమరావతి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. అంతకు ముందు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటలకు ఆహ్లాదకర వాతావరణం మధ్య తన క్యాంప్‌ కార్యాలయం నుంచి బయలుదేరి ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఆలయం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పరివేష్టితం ధారణతో అమ్మవారికి సమర్పించే పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను తలపై పెట్టుకుని ఆలయంలోకి అడుగుపెట్టారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రాలతో అంతరాలయంలోకి ప్రవేశించి.. శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మ వారికి వాటిని సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. 

78 కిలోల బియ్యంతో శ్రీవారికి తులాభారం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తిరుమల పర్యటనలో భాగంగా మంగళవారం కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం సంప్రదాయ బద్ధంగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం వకుళామాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన శ్రీవారికి తులాభారం సమర్పించారు. పలువురు భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లం లేదా బియ్యం లేదా ఇతర ధాన్యాలతో తూకం వేసి స్వామి వారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయం ప్రకారం సీఎం వైఎస్‌ జగన్‌ తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం తులాభారంలో సమర్పించారు.

ఇక కన్నడ, హిందీలోనూ ఎస్వీబీసీ చానళ్లు 
దేశ విదేశాల్లో ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను శ్రీవారి ఆలయం వెలుపల గొల్ల మండపం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే తెలుగు, తమిళంలో ఉన్న చానళ్ల ద్వారా టీటీడీ శ్రీ వేంకటేశ్వర వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతోంది. అనంతరం రోజుకు 6 లక్షల లడ్డూల తయారీ సామర్థ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నూతన బూందీ పోటును సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. దీని నిర్మాణానికి ఇండియా సిమెంట్స్‌ అధినేత, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీనివాసన్‌ రూ.12 కోట్లు విరాళం అందించారు. ఇదివరకటి పోటుకు కూడా అప్పట్లో ఈయన ఇంతే మొత్తం విరాళంగా ఇచ్చారు. 8,541 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆధునిక బూందీ పోటులో 40 థర్మిక్‌ ఫ్లూయిడ్‌ స్టౌలు.. గాలి, వెలుతురు బాగా వచ్చే సదుపాయం కల్పించారు.  
ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తున్న సీఎం జగన్‌ 

సహజ వ్యవసాయ పద్ధతులకు పెద్దపీట
సహజ వ్యవసాయ పద్ధతులపై ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్, టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. అంతకు ముందు టీటీడీ ఈవో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. అనంతరం అన్నమయ్య భవనం అవరణంలో నిత్య పుష్ప కైంకర్య సేవలో తరించిన పుష్పాలతో తయారు చేసిన దేవతా కళా కృతులను ముఖ్యమంత్రి పరిశీలించి, వాటిని తయారు చేసిన మహిళలను అభినందించారు. తిరుమల, ఇంద్రకీలాద్రి కార్యక్రమాల్లో మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య, ఎంపీలు మిథున్‌ రెడ్డి, గురుమూర్తి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్, ప్రభుత్వ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్లు, పలువురు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 

సీఎం సంప్రదాయాలు పాటించే వ్యక్తి  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా సాధారణంగా ఉంటూ సంప్రదాయాలకు విలువ ఇచ్చే వ్యక్తి అని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తాను తిరుమలకు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. శ్రీవేంకటేశ్వర కన్నడ భక్తి చానల్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం స్వామి వారి దయతోనే జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని సంప్రదాయ బద్ధంగా, చాలా బాగా నిర్వహించారని టీటీడీని అభినందించారు.  
సహజ వ్యవసాయ పద్ధతులపై ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకుంటున్న దృశ్యం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement