గుంటూరు ఎడ్యుకేషన్: ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉపాధ్యాయుల సంక్షేమం భేషుగ్గా ఉందని పలువురు మేధావులు, విద్యావేత్తలు వెల్లడించారు. విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి.. ప్రభుత్వ పాఠశాలలకు జీవం పోసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన–ఉపాధ్యాయుల స్పందన’పై శనివారం గుంటూరులో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతుంటే ఎల్లో మీడియా నిత్యం విష ప్రచారం సాగిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దిన జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు.
కాగా లక్ష్మీపార్వతిని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ సదస్సులో బండ్లమూడి రోజారాణి, వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి, హైకోర్టు న్యాయవాది ప్రభాకర్, ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, జ్యోతిరెడ్డి, డి.తిరుపతిరెడ్డి, సాదం సత్యనారాయణ, పలువురు విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థిపై రూ.90 వేలు ఖర్చు
జాతీయ స్థాయిలో విద్యాభివృద్ధి కోసం వివిధ రాష్ట్రాలు ఒక్కో విద్యార్థిపై సగటున రూ.50 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. అదే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.90 వేలు ఖర్చు చేస్తోంది. గతేడాది ఉపాధ్యాయులతోపాటు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా పంపిణీ చేసింది.
దేశంలోని మరే రాష్ట్రం వేల కోట్ల రూపాయల విలువైన డిజిటల్ విద్యా ఉపకరణాలను ఉచితంగా ఇవ్వడం లేదు. ఐబీ సిలబస్‌లో చదువుకోవాలంటే ఏడాదికి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లలకు దీన్ని ఉచితంగా బోధించనుంది. – వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రభుత్వ పాఠశాలలు కొత్తరూపు సంతరించుకున్నాయి..
సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక వసతులతో కొత్త రూపు సంతరించుకున్నాయి. పేద పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం చదువులను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం ఉచితంగా చెప్పిస్తోంది.
ఉపాధ్యాయులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయి. ఆరేళ్ల సరీ్వసు ఉన్న ఉపాధ్యాయులకు కేరళలో రూ.2.6 లక్షలు, కర్ణాటకలో రూ.3 లక్షలు, తమిళనాడులో రూ.4.3 లక్షలు, తెలంగాణలో రూ.5.2 లక్షల వార్షిక వేతనాలు మాత్రమే ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో రూ.5.6 లక్షలు అందుతున్నాయి. –మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బెటర్ ఏపీ కన్వినర్
ప్రభుత్వ రంగాభివృద్ధితో ఉపాధ్యాయులకే ప్రయోజనం
నా 50 ఏళ్ల విద్యారంగ అనుభవంలో ఎన్నడూ ఇంతటి అభివృద్ధిని చూడలేదు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందితే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులకే ప్రయోజనం. మరింత మంది ఉపాధ్యాయులు అవసరమవుతారు. – ప్రొఫెసర్ డీఏఆర్ సుబ్రహ్మణ్యం, డీన్, మహాత్మాగాంధీ కళాశాల, గుంటూరు
ఇంతటి అభివృద్ధి చరిత్రలో ఎప్పుడూ లేదు
గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేక ఆడపిల్లలు చదువులు మానేయాల్సిన దుస్థితిని చూశాం. వైఎస్ జగన్ వచ్చాక నాడు–నేడు ద్వారా జరిగిన అభివృద్ధి చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. – ఆలపాటి రాధామాధవ్, అధ్యాపకుడు, గుంటూరు
జగన్‌ను గెలిపించుకోకుంటే ఈ సంక్షేమం ఆగిపోతుంది..
స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే. పేదలకు అండగా నిలిచిన సీఎం జగన్‌కు ప్రజలందరూ అండగా నిలవాలి. ఆయనను గెలిపించుకోకుంటే ఈ సంక్షేమం ఆగిపోతుంది. – డాక్టర్ పి.ముత్యం, ఏసీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, గుంటూరు
విద్యా రంగంపై రూ.74 వేల కోట్ల వ్యయం
విద్యారంగంపై ప్రభుత్వం రూ.74 వేల కోట్లు ఖర్చు చేసింది. వివిధ పథకాలతో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిజిటల్ విద్య, ట్యాబ్స్, ఐఎఫ్‌పీ, స్మార్ట్‌టీవీలతో ఆధునిక చదువులను అందుబాటులోకి తెచ్చారు. జగన్ పాలనలో రాష్ట్రంలో 12 వేల పీఈటీ, భాషా పండిట్లకు పదోన్నతులు కల్పించారు. 1998, 2008, 2018 డీఎస్సీల కింద మొత్తం 13,272 పోస్టులను భర్తీ చేశారు. –టి.కల్పలతారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment