
చంద్రబాబు నాయుడు తప్పు చేశారని టీడీపీ నేతలతో పాటు ఆయన తరపు న్యాయవాదులు కూడా గట్టిగా నమ్ముతున్నారా? అందుకే ఆయన తప్పు చేయలేదని గట్టిగా వాదించలేకపోతున్నారా? కేవలం 17 ఏ సెక్షన్ కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారన్నది మాత్రమే బాబు తరపున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది అందుకేనా? ఈ ప్రశ్నలకు ఔననే అంటున్నారు న్యాయ రంగ నిపుణులు. అయితే చంద్రబాబు ఈ నేరం చేసే నాటికి 17 ఏ క్లాజ్ లేదు కాబట్టి అది ఆయనకు వర్తించదనేది సీఐడీ తరపు న్యాయవాదుల వాదన.
✍️371 కోట్ల రూపాయలు లూటీ అయిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చాలా లోతుగా.. చాలా ఓపిగ్గా దర్యాప్తు చేయడంతో ఆయన దోపిడీకి సంబంధించి ఆధారాలన్నీ దొరికాయని దర్యాప్తు సంస్థల అధికారులే చెబుతున్నారు. ఆ ఆధారాలతోనే చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరు పర్చారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.
✍️చంద్రబాబును జైలుకు పంపిన తర్వాత టీడీపీ నేతలు వారి అనుకూల మీడియాల కథనాలు గమనిస్తే చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని ఎవరూ వాదించడం లేదు. ఎవరో ఎందుకు చంద్రబాబే నేను తప్పు చేయలేదని గట్టిగా ఇంత వరకు చెప్పలేదు. ఎంత సేపు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు కోర్టులో హాజరు పర్చలేదని వాదిస్తూ వచ్చారు. లేదా గవర్నర్ అనుమతి తీసుకోవలసింది తీసుకోకుండా చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని దబాయిస్తున్నారు. అంటే సాంకేతిక కారణాలు చూపించి జైలు నుండి .. ఈ కేసు నుండి ఎలా బయట పడాలన్నదే చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అందుకే తనపై పెట్టిన కేసునే క్వాష్ చేయాలని ఆయన కోర్టులను ఆశ్రయించారు.
✍️ఇక టీడీపీ అనుకూల మీడియా అయితే అవినీతి జరగలేదని అనడం లేదు. చంద్రబాబు నాయుణ్ని మాత్రమే అరెస్ట్ చేయడం ఏంటి? ఆయన కింద పనిచేసిన అధికారులను కూడా లోపల వేయాలి కదా? అని టీడీపీ అనుకూల మీడియా నిలదీస్తోంది. చంద్రబాబు నాయుడికి బేషరతుగా మద్దతు ఇస్తోన్న పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అవినీతికి తెగబడలేదని అనడం లేదు. అవినీతి అన్నది మన దేశంలో అసలు ఇష్యూనే కాదన్నారు పవన్ కళ్యాణ్. అక్కడితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి అసలు అవినీతి ఏ మేరకు ఆమోద యోగ్యం? అన్న అంశంపై డిబేట్ జరగాలని దగుల్బాజీ దొంగలకు కూడా తట్టని కొత్త ఐడియా ఒకటి బయట పెట్టారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడి తరపున ఏసీబీ కోర్టులోనూ.. హైకోర్టులోనూ.. ఇపుడు సుప్రీం కోర్టులోనూ వాదిస్తోన్న న్యాయవాదులు సైతం చంద్రబాబును అరెస్ట్ చేసేముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలన్న 17-ఏను పోలీసులు పాటించలేదనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుచేత అరెస్టే అన్యాయమని వారు వాదిస్తున్నారు. అయితే దీనిపైనే సీఐడీ తరపు వాదిస్తోన్న న్యాయవాది ముకుల్ రోహత్గీ కీలకమైన అంశాలు తెరపైకి తెచ్చారు.
✍️చంద్రబాబు నాయుడి పాత్ర ఉందని అంటోన్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నేరం జరిగే నాటికి 17-ఏ చట్టం ఉనికిలో లేదన్నారు. నేరం జరిగిన రోజున ఏ చట్టాలు అమల్లో ఉన్నాయో అవి మాత్రమే చంద్రబాబుకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. 17-ఏ చంద్రబాబుకు ముమ్మాటికీ వర్తించదని సాక్ష్యాధారాలతో సహా సుప్రీం న్యాయమూర్తుల ముందు తన వాదన వినిపించారు. మొత్తానికి ఇటు చంద్రబాబు నాయుడు అటు ఆయనకు మద్దతు ఇస్తోన్న వారు.. బాబు తరపున వాదిస్తోన్న న్యాయవాదులు.. అంతా కూడా 17-ఏ బాబుకు వర్తిస్తుందన్న సింగిల్ పాయింట్‌నే పదే పదే వినిపిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు నిర్దోషి అని చెప్పలేకపోతున్నారని న్యాయ రంగ నిపుణులు అంటున్నారు.
-సీఎన్‌ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment