పిఠాపురం మున్సిపల్ సమావేశంలో కమిషనర్–డీఈఈ బాహాబాహీ
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు విషయమై చర్చ
కౌన్సిలర్ అడిగిన ప్రశ్నలకు కమిషనర్ బదులిస్తూ డీఈఈపై ఆరోపణలు
ప్రతిగా డీఈఈ కమిషనర్‌పై ప్రత్యారోపణలు
దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం.. పరస్పర దాడి
కొంతకాలంగా కమిషనర్–డీఈఈ మధ్య కోల్డ్‌వార్
పిఠాపురం: ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఇద్దరు అధికారులు వాగ్వాదానికి దిగడంతో పాటు ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం మున్సిపల్ సమావేశం జరుగుతుండగా అందరి సమక్షంలో కమిషనర్ కనకారావు, డీఈఈ భవానీశంకర్‌లు పరస్పరం దాడికి తెగబడ్డారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఉన్న కోల్డ్‌వార్ ఒక్కసారిగా భగ్గుమనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పచి్చమళ్ల జ్యోతి అధ్యక్షతన శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
సమావేశం ప్రారంభం కాగానే అజెండాలోని పలు పనులపై చర్చించారు. ఆ పనులు ఎవరి ఆధ్యర్యంలో నిర్వహిస్తున్నారు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఎవరు చూస్తున్నారంటూ ఓ కౌన్సిలర్ కమిషనర్ కనకారావును ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ బదులిస్తూ ఇక్కడ పనిచేస్తున్న డీఈఈ ఎన్నికల ముందు చెప్పాపెట్టకుండా సెలవుపై వెళ్లిపోయారని, దాంతో ఆయన్ని సరెండర్ చేశానన్నారు. అయితే, కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుని డీఈఈ భవానీశంకర్ తిరిగి విధుల్లో చేరారన్నారు. కానీ, ఎప్పుడూ అందుబాటులో ఉండరని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పడంతో వారి ఆదేశాల మేరకు ఈఈతో సంతకాలు పెట్టించుకుని పనులు పూర్తిచేస్తున్నామని కమిషనర్ డీఈఈపై ఆరోపణలు చేశారు.
అసలాయన ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉందని చెబుతుండగా.. పక్కనే ఉన్న డీఈఈ భవానీశంకర్ ఒక్కసారిగా ఎదురుతిరిగారు. కమిషనర్ అక్రమాలకు తాను సహకరించడంలేదని, ఇలా అబద్ధాలు చెబుతున్నారంటూ డీఈఈ విరుచుకుపడ్డారు. కనకారావు వచ్చినప్పటి నుంచి పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటికి తాను సహకరించకపోవడంతోనే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రత్యారోపణ చేశారు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒక్కసారిగా కొట్లాటకు దిగారు. పరస్పరం కొట్టుకోవడంతో సమావేశంలో సభ్యులు అవాక్కయ్యారు. దీంతో కౌన్సిల్ సభ్యులు, మీడియా ప్రతినిధులు వారిని విడదీసి శాంతింపజేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
డీఈఈపై సస్పెన్షన్ వేటు..
ఇక ఈ ఘటనలో డీఈఈ భవానీశంకర్‌ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అధికారుల ఘర్షణకు సంబంధించి కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిశోర్, మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు విచారణ నిర్వహించి కమిషనర్, డీఈఈలతో పాటు కార్యాలయ సిబ్బంది నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. అనంతరం వారి నివేదిక మేరకు డీఈఈ భవానీశంకర్‌ను సస్పెండ్ చేయాలని ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు జిల్లా కలెక్టర్ సూచించడంతో శనివారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment