![Commencement of Mumbai Vijayawada flight service](/styles/webp/s3/article_images/2024/06/16/flight.jpg.webp?itok=7Xm9682Z)
విమానాశ్రయం(గన్నవరం): దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)కు ఎయిరిండియా విమాన సర్వీస్ శనివారం ప్రారంభమైంది. ముంబై నుంచి 148 మంది ప్రయాణికులతో ఎయిర్‌బస్ ఎ320 విమానం సాయంత్రం 5.45 గంటలకు విజయవాడ చేరుకుంది. ఈ విమానానికి ఎయిర్‌పోర్ట్ అగ్నిమాపక దళం వాటర్ కానన్‌తో ఘన స్వాగతం పలికింది.
తొలుత విజయవాడ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లో ఎయిరిండియా సంస్థ ముంబై విమాన సర్విస్ ప్రారం¿ోత్సవ వేడుక నిర్వహించగా.. ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. ముంబై–విజయవాడ మధ్య విమాన సర్విస్‌లు నడిపేందుకు ఎయిరిండియా ముందుకురావడం అభినందనీయమన్నారు.
భవిష్యత్‌లో కోల్‌కతా, వారణాసి, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంకకు విమాన సర్విస్‌లు నడపాలని కేంద్రాన్ని కోరతామన్నారు. ఢిల్లీకి మరో రెండు సర్వీస్‌లు నడపాలని ఇండిగో, విస్తారా సంస్థలను కోరినట్లు తెలిపారు. అనంతరం విజయవాడ నుంచి విమానం 131 మంది ప్రయాణికులతో రాత్రి 7.10 గంటలకు ముంబైకి బయలుదేరివెళ్లింది.
సీఐఎస్‌ఎఫ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రత బాధ్యత
జూలై 2వ తేదీ నుంచి అమలు
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) కట్టుదిట్టమైన కేంద్ర బలగాల భద్రత వలయంలోకి వెళ్లనుంది. ఇప్పటివరకు రాష్ట్ర పోలీస్ శాఖలోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఈ ఎయిర్‌పోర్టు భద్రత బాధ్యతను చూస్తోంది. జూలై రెండో తేదీ నుంచి ఎయిర్‌పోర్టు భద్రత బాధ్యతను సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)కు అప్పగించనున్నారు. ఈ మేరకు విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఎయిర్‌పోర్టుకు 2017, మే మూడో తేదీన అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు లభించింది. అప్పట్లోనే ఎయిర్‌పోర్టు భద్రత బాధ్యతను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించేందుకు ప్రయత్నించారు. సరైన వసతి సదుపాయాలు లేవనే కారణంతో సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఇక్కడికి వచ్చేందుకు నిరాకరించారు. అయితే, ఎయిర్‌పోర్టులో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, భద్రత ప్రమాణాల దృష్ట్యా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సీఐఎస్‌ఎఫ్‌తో జరిపిన సంప్రదింపులు సఫలీకృతమయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతను జూలై రెండో తేదీ నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగిస్తూ విమానాశ్రయం డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
సీఐఎస్‌ఎఫ్ దళానికి వసతి కోసం ప్రస్తుతం ఉన్న బ్యారక్‌లను, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పాత క్వార్టర్స్‌ను కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై ఎయిర్‌పోర్టు భద్రత పూర్తిగా సీఐఎస్‌ఎఫ్ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment