జిల్లాకు వెయ్యి ఎస్‌జీటీ పోస్టులు కేటాయించాలని డిమాండ్
అనంతపురంలో ర్యాలీ, రాస్తారోకో
అనంతపురం అర్బన్: డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలంటూ అనంతపురంలో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల మంది ఎస్‌జీటీ పోస్టులకు పోటీపడుతుండగా.. అత్యల్పంగా పోస్టులు కేటాయించి అన్యాయం చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ సోమవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. రాస్తారోకో విరమించాలని కోరిన పోలీసులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు.
అధికారులే స్వయంగా వచ్చి తమ గోడు వింటేనే ఆందోళన విరమిస్తామని భీష్మించారు. పోలీసు అధికారుల అభ్యర్థన మేరకు డీఆర్‌ఓ వారి వద్దకు వచ్చారు. అభ్యర్థులు వారి సమస్యలను డీఆర్‌వోకు వివరించి, వినతిపత్రం ఇచ్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్‌కుమార్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నూరుల్లా, డీఎస్‌సీ అభ్యర్థులు ముజీబ్, రాము తదితరులు మాట్లాడారు.
అనంతపురం జిల్లాకు ఈ డీఎస్సీలో కేవలం 181 ఎస్‌జీటీ పోస్టులే కేటాయించి వేలమంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం వెయ్యి ఎస్‌జీటీ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీఓ 117ను రద్దు చేయాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ద్వితీయ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలన్నారు. జిల్లా మొత్తానికి ఒకేరకమైన పరీక్ష పత్రంతో పరీక్ష నిర్వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment