సంగం బ్యారేజీలో చివరి దశకు చేరిన కాంక్రీట్ పనులు
దశాబ్దానికి పైగా నత్తనడకలు నడిచిన సంగం బ్యారేజీ పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. దివంగత వైఎస్సార్ సంకల్పించిన ఆనకట్ట పనులను ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపూర్ణం చేయనున్నారు. వరుసగా మూడేళ్లుగా తరచూ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా పెన్నమ్మ పరుగులు పెడుతోంది. ఫలితంగా పనుల నిర్వహణకు కొంత ఆటంకం ఏర్పడినా.. ప్రధానమైన పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ జనవరి ఆఖరి నాటికి ప్రజలకు అంకితం కానుంది.
సాక్షి, సంగం (నెల్లూరు): బ్రిటిష్ కాలంలో పెన్నానదిపై నిర్మించిన సంగం ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో అత్యాధునిక బ్యారేజీ నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఆయన హయాంలోనే ఎర్త్ వర్క్‌లు, ఇతర మేజర్ పనులు పూర్తయ్యాయి. ఆయన అకాల మరణంతో నత్తనడకన పనులు సాగాయి. బ్యారేజీ నిర్మాణంతో తమ కష్టాలు తీరుతాయని ఆశించిన రైతాంగం ఆశలు అడియాశలయ్యాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి సంకల్పించిన జలవనరుల ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా సంగం ఆనకట్ట పనులకు నిధులు కేటాయించి, పెండింగ్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు.
సంగం బ్యారేజ్ వద్ద కాంక్రీట్ పనులు జరుగుతున్న దృశ్యం
ఆనందంలో అన్నదాతలు
నూతన సంగం ఆనకట్ట నిర్మాణం కాంక్రీట్ పనులు పూర్తవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 3.85 లక్షల ఎకరాల సాగుకు స్థిరీకరణ జరుగుతుందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనకట్ట నిర్మాణం వల్ల 0.45 టీఎంసీల నీరు సంగం వద్ద నిల్వ ఉంటుందని, దీని వల్ల సంగం చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్భ జల మట్టాలు పెరిగి తాగునీరు అందుబాటులోకి వస్తుంది.
రాకపోకల సమస్యలు పరిష్కారం
పాత సంగం ఆనకట్ట దెబ్బతినడంతో వర్షాలు వచ్చిన ప్రతి సారి సంగం ఆనకట్టపై రాకపోకలు నిలిచిపోతున్నాయి. సంగం పెన్న అవతల ఉన్న గ్రామాల ప్రజలు అత్యవసరాలకు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. నీటి ప్రవాహంలో ఆనకట్టను దాటుతూ ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. నూతన ఆనకట్ట నిర్మాణ పనులు పూర్తవుతుండడంతో రాకపోకల సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఈ ఆనకట్ట రోడ్ లెవల్ 40.96 మీటర్లు ఉండడం వల్ల రాకపోకలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రోడ్డు ఉపయోగంలోకి వచ్చేందుకు కొంచెం మట్టి పనులు మాత్రమే పెండింగ్ ఉంది. పక్షం రోజుల్లో మట్టి పనులు పూర్తయి రోడ్డు అందుబాటులోకి వస్తుంది.
పూర్తయిన కాంక్రీట్ పనులు
సంగం నూతన ఆనకట్ట నిర్మాణంలో భాగంగా 1,88,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను ఇటీవలే పూర్తి చేశారు. 1,195 మీటర్ల ఆనకట్ట పొడవుతో 79 క్లిప్‌వే గేట్లు కుడి వైపు నుంచి ఎడమ వైపు మూడు స్లూయిజ్ గేట్లు నిర్మాణం పూర్తి కావడంతో వాటికి గేట్లను అమరుస్తున్నారు. దీంతో కాంక్రీట్ పనులు మొత్తం పూర్తయినట్లు నిర్మాణ ఇంజినీరింగ్ సంస్థ ప్రకటించింది.
జనవరి నెలాఖరుకు పూర్తి
పెన్నానదిలో నిర్మిస్తున్న బ్యారేజ్ నిర్మాణ కాంక్రీట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నవంబర్ నెలాఖరు కల్లా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు పూర్తవుతాయి. అప్రోజ్ రోడ్డు, రెగ్యులేటర్ నిర్మాణం, పైలాన్, మరో చిన్న పార్కు నిర్మాణ పనులను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరందిస్తాం. చేజర్ల, పొదలకూరు మండలాలకు సైతం రాకపోకలు పూర్తిస్థాయిలో బ్యారేజీపైనే కొనసాగుతాయి.
– రమేష్‌బాబు, ఈఈ, సంగం బ్యారేజీ
Comments
Please login to add a commentAdd a comment