Sangam Dam
-
సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్‌రెడ్డి నామకరణం
సాక్షి, అమరావతి: సంగం బ్యారేజీకీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరును పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌గా నామకరణం చేశారు. గౌతమ్‌రెడ్డి అకాల మరణం అనంతరం గౌతమ్‌రెడ్డి గౌరవార్థం సంగం బ్యారేజ్‌కు ఆయన పేరును పెడతామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: Medicine-Health: విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలే లక్ష్యం: సీఎం జగన్ -
సీఎం మాటలు మనో ధైర్యాన్ని నింపాయి
నెల్లూరు (సెంట్రల్): కుమారుడిని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న తమ హృదయాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు మనోధైర్యాన్ని నింపాయని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. మృతజీవనుడంటూ గౌతమ్‌కు సంతాపం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లా, నియోజకవర్గం అభివృద్ధి కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి తపన పడిన ప్రతి అంశాన్ని పూర్తిచేస్తామని సీఎం ప్రకటించడంపై జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంగం బ్యారేజీని వేగంగా పూర్తిచేసి దానికి గౌతమ్ పేరు పెడతానని ముఖ్యమంత్రి ప్రకటించటం సంతోషంగా ఉందన్నారు. తాను కోరిన ప్రతి విషయాన్ని నెరవేరుస్తానని ప్రకటించడం తమ కుటుంబంపై వైఎస్ జగన్‌కు ఉండే అభిమానానికి నిదర్శనమన్నారు. ఉదయగిరి ఇంజనీరింగ్ కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. జగన్‌కు వెన్నంటి ఉన్న గౌతమ్‌రెడ్డికి అసలైన నివాళి తెలిపారన్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో చేయలేకపోయిన సోమేశ్వర ఆలయం, సోమశిల ప్రాజెక్టుల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని తలుచుకుంటూ సభలో సంతాపం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
గౌతమ్ సంగం బ్యారేజీ
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని చిరస్థాయిగా గుర్తుంచుకునేలా నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీకి ఆయన పేరు పెడతామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మరో ఆరు వారాల్లో సంగం బ్యారేజీ పనులు పూర్తవుతాయని, యుద్ధ ప్రాతిపదికన మంత్రి అనిల్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేసి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ అని పేరు పెట్టి ప్రారంభిస్తామన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో స్వయంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ తమ చిరకాల అనుబంధాన్ని, మంత్రివర్గ సహచరుడి మంచి పనులను గుర్తు చేసుకున్నారు. మూడు కోరికలను నెరవేరుస్తాం.. గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరిన వాటిని నెరవేరుస్తామని సీఎం జగన్ చెప్పారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మెరిట్స్) కళాశాలకు గౌతమ్ పేరు పెట్టి అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు అనువైన బోధనా కాలేజీగా ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. ఆ కాలేజీని ప్రభుత్వం తీసుకుని ఆయన ఆశించినట్లుగానే గౌతమ్ పేరుతో అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సులను ప్రవేశపెట్టి ఉత్తమ కాలేజీగా తీర్చిదిద్దుతామన్నారు. ఉదయగిరికి తొలిదశలోనే నీరు వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఉదయగిరి ప్రాంతాన్ని రెండో దశలో కాకుండా మొదటి దశలోకి తెచ్చి పనులు వేగంగా పూర్తి చేసి ఉదయగిరి ప్రాంతానికి నీళ్లివ్వాలని రాజమోహన్‌రెడ్డి చాలా భావోద్వేగంగా అడిగారని, అది కూడా కచ్చితంగా నెరవేరుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఉదయగిరి ప్రాంతాన్ని వెలిగొండ మొదటి దశలోకి తీసుకువచ్చి ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు. ఉదయగిరి డిగ్రీ కాలేజీలో వసతులు మెరుగుపరచాలని కోరారని, నాడు–నేడు రెండో దశలో ఆ కళాశాలకు మెరుగులు దిద్దుతామన్నారు. రాజమోహన్‌రెడ్డి కోరిన మూడు అంశాలను కచ్చితంగా చేస్తామని ఈ సభ ద్వారా భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. ఆ ఊహే కష్టంగా ఉంది తన సహచరుడు, చిరకాల మిత్రుడు, మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇకలేడన్న ఊహే ఎంతో కష్టంగా ఉందని, ఇది రాష్ట్రానికి కూడా తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. గౌతమ్ తనకు చిన్నతనం నుంచి స్నేహితుడని, తన కంటే వయసులో ఒక సంవత్సరం పెద్దవాడైనా తనను అన్నగా భావించేవాడని గుర్తు చేసుకున్నారు. తనను అంత విశ్వసించి, తనపై అంత నమ్మకముంచేవాడన్నారు. తనకేం కావాలి...? తనకేం నచ్చుతుందోనని తపించేవాడని చెప్పారు. అలాంటి ఒక మంచి స్నేహితుడిని, ఎమ్మెల్యేని పోగొట్టుకున్నానని, గౌతమ్ ఇక లేడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. గౌతమ్ ఉన్నత చదువులు చదివాడని, యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువులు పూర్తి చేసి ఇక్కడకి వచ్చాడని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడాక నా వెంటే నిలిచారు.. నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి తాను తొలుత బయటకు అడుగులు వేసినప్పుడు గౌతమ్ రాజకీయాల్లో లేడని, ఆయన తండ్రి రాజమోహన్‌రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారని సీఎం జగన్ చెప్పారు. తాను ఈ స్థానానికి వస్తానని ఆ రోజుల్లో బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చన్నారు. కాంగ్రెస్‌తో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకి వచ్చినప్పుడు అతి తక్కువ మంది తనతోపాటు ఉండటానికి సాహసించారని తెలిపారు. అలాంటి కొద్ది మంది వ్యక్తులలో గౌతమ్ ఒకరని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ ప్రభావం ఆయన తండ్రిపై ఉందన్నారు. రాజమోహన్‌రెడ్డి తనతో నిలబడటానికి గౌతమ్‌తో తనకున్న స్నేహం, విశ్వాసం, తాను చేయగలననే నమ్మకం ప్రధాన కారణాలన్నారు.మేకపాటి కుటుంబమంతా తన వెంట నడిచిందని, అలాంటి స్నేహితుడ్ని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. పట్టుబట్టి పెట్టుబడులు.. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్‌రెడ్డి కేబినెట్లో ఆరు శాఖలకు ప్రాతినిధ్యం వహించి సమర్థంగా పనిచేశారని సీఎం జగన్ కొనియాడారు. దుబాయ్ ఎక్స్‌పోకు వెళ్లేముందు కూడా తనను కలిశారని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలు, తాను కలుసుకున్న పారిశ్రామికవేత్తల వివరాలను తనకు తెలియచేయాలని కోరుతూ రోజూ ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరాలు పంపేవారని తెలిపారు. పరిశ్రమలపరంగా రాష్ట్రాన్ని ముందెన్నడూ లేని విధంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. గౌతమ్ కృషితో పారిశ్రామిక దిగ్గజాల రాక గతంలో ఎన్నడూ లేనివిధంగా పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించడం వెనుక మంత్రి గౌతమ్‌రెడ్డి కృషి ఎంతో ఉందని సీఎం జగన్ తెలిపారు. సెంచురీ ఫ్లైవుడ్ కడప జిల్లా బద్వేలులో రావడంతోపాటు బంగర్లు.. శ్రీ సిమెంట్స్ ఫ్యాక్టరీ పెట్టడానికి అడుగులు ముందుకు వేశారని చెప్పారు. బజాంకాలు, బంగర్లు, సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వీ, ఆదిత్య బిర్లా తమ హయాంలోనే రాష్ట్రంలో అడుగుపెడుతున్నారన్నారు. అదానీలు కూడా తమ హయాంలోనే రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. వారి పేర్లను గతంలో పత్రికల్లో చదవడమే మినహా మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాలేదన్నారు. వారందరికీ భరోసా కల్పించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో గౌతమ్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. గౌతమ్ భౌతికంగా మన మధ్య లేకున్నా తన కలలు, తన ప్రాంతానికి మంచి జరగాలన్న కోరికను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. పైలోకంలో ఉన్న గౌతమ్‌ను దేవుడు చల్లగా చూస్తాడని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. మేకపాటి కుటుంబానికి తామంతా ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
తండ్రి సంకల్పం.. తనయుడి పరిపూర్ణం
దశాబ్దానికి పైగా నత్తనడకలు నడిచిన సంగం బ్యారేజీ పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. దివంగత వైఎస్సార్ సంకల్పించిన ఆనకట్ట పనులను ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపూర్ణం చేయనున్నారు. వరుసగా మూడేళ్లుగా తరచూ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా పెన్నమ్మ పరుగులు పెడుతోంది. ఫలితంగా పనుల నిర్వహణకు కొంత ఆటంకం ఏర్పడినా.. ప్రధానమైన పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ జనవరి ఆఖరి నాటికి ప్రజలకు అంకితం కానుంది. సాక్షి, సంగం (నెల్లూరు): బ్రిటిష్ కాలంలో పెన్నానదిపై నిర్మించిన సంగం ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో అత్యాధునిక బ్యారేజీ నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఆయన హయాంలోనే ఎర్త్ వర్క్‌లు, ఇతర మేజర్ పనులు పూర్తయ్యాయి. ఆయన అకాల మరణంతో నత్తనడకన పనులు సాగాయి. బ్యారేజీ నిర్మాణంతో తమ కష్టాలు తీరుతాయని ఆశించిన రైతాంగం ఆశలు అడియాశలయ్యాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి సంకల్పించిన జలవనరుల ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా సంగం ఆనకట్ట పనులకు నిధులు కేటాయించి, పెండింగ్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. సంగం బ్యారేజ్ వద్ద కాంక్రీట్ పనులు జరుగుతున్న దృశ్యం ఆనందంలో అన్నదాతలు నూతన సంగం ఆనకట్ట నిర్మాణం కాంక్రీట్ పనులు పూర్తవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 3.85 లక్షల ఎకరాల సాగుకు స్థిరీకరణ జరుగుతుందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనకట్ట నిర్మాణం వల్ల 0.45 టీఎంసీల నీరు సంగం వద్ద నిల్వ ఉంటుందని, దీని వల్ల సంగం చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్భ జల మట్టాలు పెరిగి తాగునీరు అందుబాటులోకి వస్తుంది. రాకపోకల సమస్యలు పరిష్కారం పాత సంగం ఆనకట్ట దెబ్బతినడంతో వర్షాలు వచ్చిన ప్రతి సారి సంగం ఆనకట్టపై రాకపోకలు నిలిచిపోతున్నాయి. సంగం పెన్న అవతల ఉన్న గ్రామాల ప్రజలు అత్యవసరాలకు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. నీటి ప్రవాహంలో ఆనకట్టను దాటుతూ ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. నూతన ఆనకట్ట నిర్మాణ పనులు పూర్తవుతుండడంతో రాకపోకల సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఈ ఆనకట్ట రోడ్ లెవల్ 40.96 మీటర్లు ఉండడం వల్ల రాకపోకలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రోడ్డు ఉపయోగంలోకి వచ్చేందుకు కొంచెం మట్టి పనులు మాత్రమే పెండింగ్ ఉంది. పక్షం రోజుల్లో మట్టి పనులు పూర్తయి రోడ్డు అందుబాటులోకి వస్తుంది. పూర్తయిన కాంక్రీట్ పనులు సంగం నూతన ఆనకట్ట నిర్మాణంలో భాగంగా 1,88,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను ఇటీవలే పూర్తి చేశారు. 1,195 మీటర్ల ఆనకట్ట పొడవుతో 79 క్లిప్‌వే గేట్లు కుడి వైపు నుంచి ఎడమ వైపు మూడు స్లూయిజ్ గేట్లు నిర్మాణం పూర్తి కావడంతో వాటికి గేట్లను అమరుస్తున్నారు. దీంతో కాంక్రీట్ పనులు మొత్తం పూర్తయినట్లు నిర్మాణ ఇంజినీరింగ్ సంస్థ ప్రకటించింది. జనవరి నెలాఖరుకు పూర్తి పెన్నానదిలో నిర్మిస్తున్న బ్యారేజ్ నిర్మాణ కాంక్రీట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నవంబర్ నెలాఖరు కల్లా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు పూర్తవుతాయి. అప్రోజ్ రోడ్డు, రెగ్యులేటర్ నిర్మాణం, పైలాన్, మరో చిన్న పార్కు నిర్మాణ పనులను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరందిస్తాం. చేజర్ల, పొదలకూరు మండలాలకు సైతం రాకపోకలు పూర్తిస్థాయిలో బ్యారేజీపైనే కొనసాగుతాయి. – రమేష్‌బాబు, ఈఈ, సంగం బ్యారేజీ -
ఈ సీజన్లోనే సంగం బ్యారేజీ సిద్ధం
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెన్నా డెల్టాకు జీవనాడిగా అభివర్ణించే ఈ బ్యారేజీ పనులు 84 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసి.. ఈ సీజన్లోనే బ్యారేజీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగం వద్ద పెన్నానదిపై 1882–86 మధ్య బ్రిటిష్ సర్కార్ బ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ ద్వారా పెన్నా డెల్టాలో 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేల ఎకరాలు వెరసి 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో నీటినిల్వ సామర్థ్యం కనిష్టస్థాయికి చేరుకుంది. దీంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జలయజ్ఞంలో భాగంగా పాత బ్యారేజీకి ఎగువన.. కొత్తగా సంగం బ్యారేజీ నిర్మాణానికి వైఎస్సార్ 2005లో శ్రీకారం చుట్టారు. అటు ఆయకట్టుకు నీళ్లందించేలా, ఇటు రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేలా బ్యారేజీ కమ్ బ్రిడ్జిగా కొత్త సంగం బ్యారేజీని డిజైన్ చేశారు. వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత ఈ బ్యారేజీ పనులు పడకేశాయి. టీడీపీ సర్కార్ బ్యారేజీని పూర్తిచేయడంలో విఫలమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజీని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టి, యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను, అధికారులను ఆదేశించారు. దీంతో ఈ బ్యారేజీ పనులు పరుగులెత్తుతున్నాయి. బ్యారేజీ స్పిల్ వేను 1,195 మీటర్ల పొడవున పూర్తిచేశారు. స్పిల్ వేకు 85 గేట్లకుగాను.. 42 గేట్లను ఇప్పటికే అమర్చారు. మిగిలిన 43 గేట్ల అమరిక పనులు సాగుతున్నాయి. బ్యారేజీకి కుడి, ఎడమ వైపు మట్టికట్టలు (గైడ్ బండ్స్) పనుల్లో 9,15,330 క్యూబిక్ మీటర్ల పనులకుగాను 8,60,200 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తిచేశారు. మిగిలిన 55,130 క్యూబిక్ మీటర్ల పనులను నెలాఖరులోగా పూర్తిచేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ బ్యారేజీని పూర్తిచేసి.. ఈ సీజన్లోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
రబీకి 2 బ్యారేజీలు
సాక్షి, అమరావతి: పెన్నా నదిపై నిర్మాణంలో ఉన్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులను శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాదే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరు బ్యారేజీ కింద 99,525 ఎకరాలు, సంగం బ్యారేజీ కింద 3.85 లక్షల ఎకరాలు వెరసి 4,84,525 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్దేశించుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పనులు చేయలేనని, నెల్లూరు బ్యారేజీ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగేందుకు అనుమతించాలంటూ కాంట్రాక్టర్ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. మిగిలిన రూ.113.36 కోట్ల విలువైన పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించి అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. సంగం బ్యారేజీ పనులను సెప్టెంబరులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. ప్రాధాన్యతగా నెల్లూరు బ్యారేజీ.. ► నెల్లూరు కొత్త బ్యారేజీ పనుల్లో 8 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, 8.36 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు మిగిలాయి. ► బ్యారేజీకి 57 గేట్లను బిగించాల్సి ఉండగా తయారీ పనులు 75% పూర్తయ్యాయి. మిగిలిన రూ. 113.36 కోట్ల పనులను ప్రాధాన్యతగా పరిగణించి కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించి అక్టోబర్ నాటికి బ్యారేజీని జాతికి అంకితం చేయనున్నారు. శరవేగంగా సంగం బ్యారేజీ ► కొత్తగా నిర్మిస్తున్న సంగం బ్యారేజీలో మిగిలిపోయిన పది వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. మిగిలిన 2.16 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పురోగతిలో ఉన్నాయి. ► బ్యారేజీకి గేట్ల తయారీ పనులు కొలిక్కి వచ్చాయి. ఇందుకోసం రూ.145.51 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ► సంగం బ్యారేజీని సెప్టెంబరు నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేతులెత్తేసిన చంద్రబాబు.. ► వందేళ్ల క్రితం నిర్మించిన నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. వీటి స్థానంలో కొత్త బ్యారేజీల నిర్మాణాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2004లో చేపట్టారు. 2009 నాటికి సింహభాగం పనులు పూర్తయినా తర్వాత గ్రహణం పట్టుకుంది. ► 2018 ఖరీఫ్ నాటికి రెండు బ్యారేజీలను పూర్తి చేస్తామని నాడు అధికారంలో ఉండగా శాసనసభ సాక్షిగా పలు సందర్భాల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు చేతులెత్తేశారు. -
సంగం ఆనకట్టను పరిశీలించిన జపాన్ బృందం
నెల్లూరు జిల్లా సంగం ఆనకట్టను జపాన్‌కు చెందిన నిపుణుల కమిటి పరిశీలించింది. ఆదివారం ఆనకట్ట ప్రాంతానికి చెందిన ముగ్గురు సభ్యులు గల బృందం ఆనకట్టను పరిశీలించి వ్యవసాయానికి తోడ్పడుతున్న జలవనరులపై అధ్యాయనం చేస్తోంది. ఆధ్యాయనం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు తమ వంతు సాయం చేయడానికి బృందం ముందుకొస్తుందని సమాచారం.