
నెల్లూరు (సెంట్రల్): కుమారుడిని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న తమ హృదయాల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటలు మనోధైర్యాన్ని నింపాయని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. మృతజీవనుడంటూ గౌతమ్‌కు సంతాపం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లా, నియోజకవర్గం అభివృద్ధి కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి తపన పడిన ప్రతి అంశాన్ని పూర్తిచేస్తామని సీఎం ప్రకటించడంపై జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సంగం బ్యారేజీని వేగంగా పూర్తిచేసి దానికి గౌతమ్ పేరు పెడతానని ముఖ్యమంత్రి ప్రకటించటం సంతోషంగా ఉందన్నారు. తాను కోరిన ప్రతి విషయాన్ని నెరవేరుస్తానని ప్రకటించడం తమ కుటుంబంపై వైఎస్ జగన్‌కు ఉండే అభిమానానికి నిదర్శనమన్నారు. ఉదయగిరి ఇంజనీరింగ్ కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. జగన్‌కు వెన్నంటి ఉన్న గౌతమ్‌రెడ్డికి అసలైన నివాళి తెలిపారన్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో చేయలేకపోయిన సోమేశ్వర ఆలయం, సోమశిల ప్రాజెక్టుల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని తలుచుకుంటూ సభలో సంతాపం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.