ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెన్నా డెల్టాకు జీవనాడిగా అభివర్ణించే ఈ బ్యారేజీ పనులు 84 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసి.. ఈ సీజన్‌లోనే బ్యారేజీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగం వద్ద పెన్నానదిపై 1882–86 మధ్య బ్రిటిష్ సర్కార్ బ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ ద్వారా పెన్నా డెల్టాలో 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేల ఎకరాలు వెరసి 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో నీటినిల్వ సామర్థ్యం కనిష్టస్థాయికి చేరుకుంది. దీంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో జలయజ్ఞంలో భాగంగా పాత బ్యారేజీకి ఎగువన.. కొత్తగా సంగం బ్యారేజీ నిర్మాణానికి వైఎస్సార్ 2005లో శ్రీకారం చుట్టారు. అటు ఆయకట్టుకు నీళ్లందించేలా, ఇటు రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేలా బ్యారేజీ కమ్ బ్రిడ్జిగా కొత్త సంగం బ్యారేజీని డిజైన్ చేశారు. వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత ఈ బ్యారేజీ పనులు పడకేశాయి. టీడీపీ సర్కార్ బ్యారేజీని పూర్తిచేయడంలో విఫలమైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజీని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టి, యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను, అధికారులను ఆదేశించారు. దీంతో ఈ బ్యారేజీ పనులు పరుగులెత్తుతున్నాయి. బ్యారేజీ స్పిల్ వేను 1,195 మీటర్ల పొడవున పూర్తిచేశారు.
స్పిల్ వేకు 85 గేట్లకుగాను.. 42 గేట్లను ఇప్పటికే అమర్చారు. మిగిలిన 43 గేట్ల అమరిక పనులు సాగుతున్నాయి. బ్యారేజీకి కుడి, ఎడమ వైపు మట్టికట్టలు (గైడ్ బండ్స్) పనుల్లో 9,15,330 క్యూబిక్ మీటర్ల పనులకుగాను 8,60,200 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తిచేశారు. మిగిలిన 55,130 క్యూబిక్ మీటర్ల పనులను నెలాఖరులోగా పూర్తిచేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ బ్యారేజీని పూర్తిచేసి.. ఈ సీజన్‌లోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment