సాక్షి, అమరావతి: మహిళా భద్రత కోసం నెలకొల్పిన ‘దిశ’ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మరింతగా బలోపేతం చేస్తోంది. ప్రధానంగా గస్తీ (పెట్రోలింగ్)ను పటిష్టం చేయడం ద్వారా విజబుల్ పోలీసింగ్‌ను వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ వ్యవస్థ కోసం 145 స్కార్పియో వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మహిళా భద్రత కోసం రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒకటి చొప్పున 900 స్కూటర్లను ప్రభుత్వం సమకూర్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్కార్పియో వాహనాలు కొనుగోలు చేయాలన్న నిర్ణయంతో దిశ గస్తీ మరింత పటిష్టం కానుంది.
దిశ గస్తీ పటిష్టం ఇలా...
► 145 స్కార్పియో వాహనాల కోసం రూ.16.60 కోట్లను పోలీసు శాఖ వెచ్చించనుంది.
► ఒక్కోటి దాదాపు రూ.11 లక్షల చొప్పున మొత్తం రూ.15.95 కోట్లతో 145 స్కార్పియో వాహనాలను కొనుగోలు చేస్తారు.
► వీటికి ఎల్‌ఈడీ లైట్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, జీపీఎస్ పరికరాలు, బాడీ డెకాల్, ఇతర గస్తీ పరికరాలను రూ.65 లక్షలతో ఏర్పాటు చేస్తారు.
► రాష్ట్రంలో 5 పోలీస్ కమిషనరేట్‌లకు 10 వాహనాల చొప్పున మొత్తం 50 వాహనాలను అందిస్తారు. 13 పోలీసు జిల్లాలకు 5 వాహనాల చొప్పున మొత్తం 65 వాహనాలను సమకూరుస్తారు.
► ఈ వాహనాలతో విజుబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తారు. ప్రధానంగా విద్యా సంస్థలు, మార్కెట్ ప్రదేశాలు, ఇతర జనసమ్మర్థమైన సున్నిత ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తారు.
దిశ పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు
మహిళా భద్రత కోసం ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక కొత్తగా 6 దిశ పోలీస్‌స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం ఒక్కో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.2.73 కోట్ల చొప్పున మొత్తం రూ.16.40 కోట్లను కేటాయించింది. కౌన్సెలింగ్ రూమ్, వెయిటింగ్ హాల్, క్రచ్–ఫీడింగ్ రూమ్, టాయిలెట్లు, ఇతర వసతులతో ఈ దిశ పోలీస్ స్టేషన్లు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment