6.8 లక్షల సాధారణ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు
1.05 లక్షల టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు
గత ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తాం
గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం రాష్ట్రంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఐదేళ్లలో 6.8 లక్షల సాధారణ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారని, 1.05 లక్షల టిడ్కో ఇళ్లను మౌలిక సదుపాయాలతో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసినట్టు వివరించారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల అంశం కోర్టులో ఉందన్నారు. వైఎస్సార్, జగనన్న కాలనీల పేరు మార్పుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తామన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలకు సేకరించిన భూములను 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించారో లేదో విచారణ జరుపుతామని, నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
లేదంటూనే.. అవునంటూ
అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూనే 11,782 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి ఒప్పుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షలకుపైగా లబ్ధిదారులకు స్థలాలను అందించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment