విజయనగరం అర్బన్: స్టైఫెండ్ ఇస్తూ ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించే మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనివల్ల 40 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం(జీవీ) యూనివర్సిటీలోని వివిధ అభివృద్ధి పనులను మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్న్‌షిప్ కోసం ఇంజినీరింగ్ విద్యార్థుల(4వ సంవత్సరం) నమోదు ప్రక్రియ ప్రారంభించామని.. 12 వేల మంది విద్యార్థులు ఇప్పటికే వివరాలు నమోదు చేసుకున్నారని చెప్పారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రఖ్యాతి గాంచిన ఎడెక్స్ సంస్థ ద్వారా సుమారు 2 వేల ఆన్‌లైన్ కోర్సులను రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కోర్సులకు ఫీజులను సైతం ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. విద్యా సంస్థల్లో పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైనంత మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులను కూడా నియమిస్తున్నామని చెప్పారు.
ఇందులో భాగంగా సుమారు 2,200 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అధ్యాపకుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నామని వివరించారు. విజయనగరంలోని జేఎన్‌టీయూ వర్సిటీని అత్యున్నత వర్సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వసతులను కలి్పస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.నాగలక్ష్మి, జేఎన్‌టీయూ(జీవీ) వీసీ కె.వెంకటసుబ్బయ్య, రిజిస్ట్రార్ జి.జయ సుమ,
ప్రిన్సిపాల్ కె.శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment