తూ.గో. జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి హైస్కూల్‌లో ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: అవసరం మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కరోనా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా సోకి.. ఇంటిలో ఉండి చికిత్స పొందడానికి తగిన వసతి లేనివారి కోసం ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించారు. ప్రతి చోటా పురుషులకు, మహిళలకు వేర్వేరు గదులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో సాధారణ లక్షణాలు ఉన్నవాళ్లు ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే.. ఎక్కువ శాతం మందికి ఒకే పడక గది, ఒకే టాయిలెట్ ఉన్నాయి. దీంతో ఆ ఇంటిలో ఎవరైనా కరోనా బారినపడితే.. మిగిలిన కుటుంబ సభ్యులు దూరంగా ఉండటానికి అవకాశం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేదా ఇతర ప్రభుత్వ భవనాల్లో అవసరం మేరకు వెంటనే ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
గ్రామ సర్పంచ్‌ల పర్యవేక్షణలో..
– కరోనా ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, వాటిలో మౌలిక వసతుల ఏర్పాటు బాధ్యతలను ఆయా గ్రామాల సర్పంచ్‌లకు అప్పగించారు.
– కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే నిర్ధారణ పరీక్ష కోసం వేచి చూడకుండా వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తారు. రోగులు తమ ఇంటిలోనే వేరుగా ఒక గదిలో ఉండడానికి ఇష్టపడితే అందుకు ప్రాధాన్యత ఇస్తారు.
– ఐసొలేషన్ సెంటర్‌లో చేరేవారు ఆహారం, దుప్పట్లు, సబ్బు, బ్రష్, మందులు వంటివాటిని వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది.
– దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చే చోట రోగులకు పౌష్టికాహారం అందజేస్తారు.
– రోగుల ఆరోగ్య పరిస్థితిని ఏఎన్‌ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒక రిజిస్టర్‌లో నమోదు చేసుకొని.. స్థానిక పీహెచ్‌సీ వైద్యుడికి సమాచారం అందిస్తారు.
– పీహెచ్‌సీ వైద్యుడు వారంలో రెండు రోజులు ఐసొలేషన్ కేంద్రాన్ని సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు.
– ఎవరికైనా అత్యవసర చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పటికప్పుడు అంబులెన్స్ ద్వారా వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చుతారు.
– కాగా.. ఇంటిలోనే ఉంటూ చికిత్స పొందుతున్న వారి ఇళ్లకు హోం ఐసోలేషన్ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తారు.
– ఐసొలేషన్ కేంద్రాల్లో రోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు.
– గ్రామంలో కరోనా కేసుల సంఖ్య జీరోకు చేరే వరకు ఐసోలేషన్ కేంద్రాలను కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
– ఐసోలేషన్ కేంద్రాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా, మండలాల వారీగా ఎన్ని గ్రామాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. వాటిలో ఎంత మంది చేరారు వంటి వివరాలను వారానికి రెండుసార్లు కమిషనర్ కార్యాలయానికి పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment