పలువురు అధికారులకు కోర్టు ధిక్కారం కింద జరిమానా
శాంతిప్రభకు 6 నెలల జైలుశిక్ష.. హైకోర్టు తీర్పు
అప్పీల్‌కు వీలుగా ఆరు వారాలపాటు తీర్పు నిలుపుదల
సాక్షి, అమరావతి: కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఎలాంటి భాష్యం చెప్పకుండా వాటిని యథాతథంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ బాధ్యత ఉన్నతాధికారులదేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు అప్పటి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య విభాగం సంచాలకుడు వి.రామిరెడ్డి, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి ఎన్.శాంతిప్రభలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరంతా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని తేల్చింది.
ఈ నేపథ్యంలో కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికా శుక్లా రూ.2 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. శాంతిప్రభకు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేసింది. ఈలోపు అప్పీల్ దాఖలు చేయకుంటే నలుగురు అధికారులు ఆగస్టు 19 సాయంత్రం 5 గంటల కల్లా హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు.
గతంలో∙మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ నియామకాలకు సంబంధించి పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని 2022లో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ అభ్యర్థులు మళ్లీ హైకోర్టులో వేర్వేరుగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇందులో కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికా శుక్లా, శాంతిప్రభలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.
ఈ ధిక్కార వ్యాజ్యాలపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల విచారణ జరిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ అధికారుల తీరును తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన వారికి కాకుండా తమకు నచ్చిన వారిని మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగా నియమించారంటూ ఆక్షేపించారు. ముఖ్యంగా శాంతిప్రభ తీరును తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టు ఆదేశించిన వారిని కాకుండా తనకు నచ్చిన వారిని నియమించుకోవడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందన్నారు. మిగిలిన ముగ్గురు ఉన్నతాధికారులకు కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే వారు ఆమెపై నెట్టేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment