సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పంటసాగు హక్కుదారుల చట్టం–2019 బాగుందని నాబార్డు ఉన్నతాధికారుల బృందం కితాబిచ్చింది. భూ యజమాని హక్కులకు ఏలాంటి నష్టం వాటిల్లకుండా, వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు ఈ చట్టం దోహదపడతోందని పేర్కొంది. భూ యజమాని అనుమతితో పంటసాగు హక్కు పత్రాలు(సీసీఆర్సీ) జారీ చేసి కౌలుదారులకు పంట రుణాలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అమలు చేస్తుండటం హర్షణీయమంది.
రాష్ట్రంలో సీసీఆర్సీ చట్టం అమలు తీరును అధ్యయనం చేసేందుకు ముంబైలోని నాబార్డు మేనేజర్లు బెంజమిన్ థామస్, అరవింద్‌కుమార్, నాబార్డు కన్సల్టెంట్ ప్రణవ్‌ఖాత్రిల సారథ్యంలోని ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో మూడురోజుల పర్యటనకు శ్రీకారం చుట్టింది. తొలిరోజు గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి భూ యజమానులు, కౌలు రైతులతో ముఖాముఖిలో పాల్గొంది. చట్టం అమలు తీరుపై అధ్యయనం చేసింది.
పకడ్బందీగా అమలు చేస్తే మరింత మేలు
సీసీఆర్సీ కార్డుల జారీ, రుణాలతో పాటు సంక్షేమ ఫలాల అమల్లో ఎదురయ్యే ఇబ్బందులను బృందం సభ్యులు తెలుసుకున్నారు. ఈ చట్టం వల్ల తమకెన్నో ప్రయోజనాలున్నాయని, అయితే అంగీకార పత్రాలపై సంతకాలు చేయడానికి భూయజమానులు వెనుకంజవేస్తున్నారని కౌలు రైతులు నాబార్డు బృందం దృష్టికి తెచ్చారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి పంట రుణాల మంజూరులో కొంత మంది బ్యాంకర్లు ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు.
మరోవైపు, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తే భవిష్యత్‌లో లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన తమకుందని భూ యజమానులు చెప్పారు. సీసీఆర్సీ చట్టం రూపకల్పన చాలా బాగుందంటూ నాబార్డు బృందం సభ్యులు ప్రశంసించారు. చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తే మెజార్టీ కౌలు రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.
చట్టంపై కౌలు రైతులతో పాటు భూ యజమానులకూ అర్థమయ్యే రీతిలో మరింత అవగాహన కచ్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే రీతిలో కౌలుదారులు ఎక్కువ సంఖ్యలో ఉండే రాష్ట్రాల్లోనూ ప్రత్యేక చట్టాలు తీసుకొస్తే మంచి ఫలితాలొస్తాయని అభిప్రాయపడ్డారు.
25.93 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు
చట్టం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో దాదాపు 25.93 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులిచ్చామని అధికారులు వివరించారు. 14.13 లక్షల మందికి బ్యాంకర్ల ద్వారా రూ.8,346 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేయించగలిగినట్టు తెలిపారు. అత్యధికంగా ఈ ఏడాది 8.31 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయగా, వీరిలో 5.48 లక్షల మందికి రూ.1908 కోట్ల రుణాలు మంజూరైనట్టు తెలిపారు.
పంట రుణాలే కాదు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా పరిహారం, పంట నష్టపరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. రుణాల మంజూరులో లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కొంతమంది బ్యాంకర్లు చూపే సాంకేతిక కారణాలతో నూరు శాతం కార్డుదారులకు రుణాలు మంజూరు చేయలేకపోతున్నామని వివరించారు. పర్యటనలో నాబార్డు ఏపీ ఏజీఎం స్మారక్ మోహంతి, డీడీఎం అనిల్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment