65 రేకుల ఇళ్లు నిర్దయగా నేలమట్టం
రేణిగుంటలో అధికారుల దుశ్చర్య
ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఈ దుర్మార్గం
రేణిగుంట (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంటలో దళిత వర్గానికి చెందిన సుమారు 65 రేకుల ఇళ్లను అక్రమ నిర్మాణాల సాకుతో గురువారం అధికారులు నేలమట్టం చేశారు. పేదలకు తీరని నష్టాన్ని కలిగించారు. దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్ చేసి ఈ దౌర్జన్య కాండను నిర్దయగా కొనసాగించారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరింపజేసి, బాధితులెవరూ రాకుండా అడ్డుకున్నారు. తొలుత రేణిగుంట సీబీఐడీ కాలనీ సమీపంలో 25 రేకుల ఇళ్లను, ఆ తర్వాత వివేకానంద కాలనీ సమీపంలో 40 ఇళ్లను కూల్చి వేశారు.
బాధితులు లబోదిబోమంటూ ఆర్తనాదాలు చేసినా అధికారులు పెడచెవిన పెట్టి ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇళ్లు లేని నిరుపేదలు ఏడాది కిందట రేణిగుంటలో రెవెన్యూ అధికారుల అనుమతులతో రేకుల ఇళ్లను నిర్మించుకుని విద్యుత్ కనెక్షన్ తీసుకుని నివాసం ఉంటున్నారు. బుధవారం రేణిగుంట సీబీఐడీ కాలనీలోని కొన్ని ఇళ్లను ఎంపీడీవో విష్ణుచిరంజీవి వెళ్లి జేసీబీ సాయంతో తొలగించారు.
స్థానికులు అడ్డు చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. అయితే గురువారం ఉదయం భారీగా పోలీసు బలగాలతో రేణిగుంట తహసీల్దార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూల్చివేత సాగింది. కళ్లెదుటే ఇల్లు కూల్చి వేయడంతో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దళితులంటే అంత చులకనా? అని బాధిత మహిళలు తహసీల్దార్ నాగేశ్వరరావును నిలదీశారు.
ఈ ఇళ్లు అక్రమ నిర్మాణాలైతే అనుభవ ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌వోసీ, ఇంటి పన్నులను రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఖర్చు చేశామని కన్నీటిపర్యంతమయ్యారు. ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడని అధికారులు.. ప్రభుత్వం మారగానే, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఆదేశాలతో దళితుల ఇళ్లను ఇలా కూల్చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.
పేద దళితులపై ఎందుకింత పగ?
ఇళ్లులేని పేద దళితులు కట్టుకున్న చిన్నపాటి రేకుల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేయడం బాధాకరం. నేను అడ్డుకుంటానని భావించి మా ఇంటి వద్దకు పోలీసులను పంపి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మీకిది తగునా? పెత్తందార్ల ఇళ్ల జోలికి వెళ్లగలరా? ఇలాంటి ఆకృత్యాలు చేసేందుకా ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది? దళితులపై మీకు ఎందుకింత పగ? – ఆనందరావు, ఎంపీటీసీ సభ్యుడు, తూకివాకం, రేణిగుంట మండలం
ఇళ్ల కూల్చివేత దుర్మార్గం
రేణిగుంట వివేకానంద కాలనీలో పేదలు, దళితులు నిర్మించుకున్న ఇళ్లను టీడీపీ నాయకుల ఆదేశాలతో అధికారులు కూల్చి వేయడం దుర్మార్గం. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించి ఉంటే ఆ ఇళ్లకు అనుభవ ధ్రువీకరణ పత్రం, విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? ఇంటి పన్నులు ఎలా వసూలు చేశారు? స్థలాలకు సంబంధించి సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపైనా విచారించి చర్యలు తీసుకోవాలి. కరకంబాడి ఎర్రగుట్ట వివాదాస్పద భూమిని సిద్ధల రవి అనే వ్యక్తి ఆక్రమించుకుని పెద్ద ఎత్తున గ్రావెల్ తోలుకుంటుండటం మీకు కనిపించలేదా?– హరినాథ్, సీపీఎం మండల కార్యదర్శి, రేణిగుంట
Comments
Please login to add a commentAdd a comment