కాకినాడ.. ఆధునిక జాడ..  | Development of Kakinada in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కాకినాడ.. ఆధునిక జాడ.. 

Published Thu, Jan 18 2024 5:06 AM | Last Updated on Thu, Jan 18 2024 5:06 AM

Development of Kakinada in Andhra Pradesh - Sakshi

దేశంలోని అగ్రగణ్య నగరాల్లో కాకినాడ ఒకటి. రెండో మద్రాస్‌గా పిలుచుకునే ఈ నగరం గత పాలనలో కునారిల్లి... నేడు ప్రగతి పథంలో పయనిస్తోంది. ఊహించని అభివృద్ధి పనులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. విశాల రహదారులు... పచ్చదనం పరచుకున్న ఉద్యానవనాలు... ప్రతి రాత్రీ పట్టపగలుగా కనిపించేలా వెలుగులు విరజిమ్ముతున్న విద్యుద్దీపాలు... ఆధునికీకరించిన కూడళ్లతో సరికొత్తగా ఆవిష్కృతమవుతోంది.

పక్కా ప్రణాళికతో ఊపందుకున్న ప్రగతి పనులతో నగర రూపురేఖలనే మార్చేసింది. చిరకాలంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. నాలుగున్నరేళ్లలో సాధించిన అభివృద్ధికి గుర్తింపుగా టూటైర్‌ సిటీలలో దేశంలోనే మొదటి స్థానాన్ని... అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో దేశంలో నాలుగోస్థానాన్ని కైవశం చేసుకుంది. అధునాతనంగా రూపొందిన నగరాన్ని చూసి ఇక్కడి ప్రజలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ 
కాకినాడ నగరానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వైఎస్సార్‌సీపీ హయాంలోనే మళ్లీ దానికి సరైన ప్రాధాన్యం లభించి అభివృద్ధి పరుగులు తీసింది. ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడింది. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో పేర్రాజుపేట, సాంబమూర్తినగర్, కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో రెండింటిని ఆయన ఉండగానే పూర్తి చేశారు.  

► చంద్రబాబు హయాంలో 14 ఏళ్లుగా నత్తనడకన సాగిన కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌ను వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రూ.65 కోట్లతో పూర్తిచేసి ఇటీవలే ముఖ్యమంత్రి 
జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అంకితమిచ్చారు. 
► గత ప్రభుత్వ హయాంలో రహదారులన్నీ నిర్వహణపై నిరాసక్తత వల్ల గుంటలు, గతుకులమయమయ్యాయి. గడచిన నాలుగున్నరేళ్లలో వాటన్నింటికీ మహర్దశ పట్టింది. ఇరుకు రహదారులను విశాలంగా మార్చారు.  
► చంద్రబాబు పాలనలో అధ్వానంగా ఉన్న గొడారిగుంట, ప్రతాప్‌నగర్, రేచెర్లపేట, దుమ్ములుపేట, ఏటిమొగ, రామకృష్ణారావు
పేట, ప్రేజర్‌ పేట, జగన్నాథపురం ప్రాంతంలోని రహదారులకు ఇప్పుడు కొత్త సొగసులు అద్దారు. ప్రణాళికాబద్ధంగా విశాలమైన బీటీ, సిమెంట్‌ రోడ్లు వేయడంతో ప్రజల కష్టాలు తీరాయి. 

► స్మార్ట్‌ సిటీ స్టేటస్‌కు తగ్గట్టుగా కాకినాడ నగర స్వరూపాన్నే మార్చేశారు. ప్రణాళికాబద్ధంగా చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన అత్యుత్తమ సేవలకు అత్యంత నివాస యోగ్యమైన నగరాల్లో దేశంలోనే నాలుగో స్థానం, మెరుగైన పారిశుద్ధ్య సేవలకు ఇటీవలనే దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. 
► కార్పొరేషన్‌ కార్యాలయాన్ని రాగల 15 ఏళ్ల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని లక్షా 50వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూ.38 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల భవంతిని సకల సౌకర్యాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.  
► నాలుగేళ్లలో పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ భవనాలు నిరి్మంచారు. ఇంతవరకు నగరంలో రూ.17.75 కోట్ల వ్యయంతో 78 సామాజిక భవనాలు అందుబాటులోకి తెచ్చారు. నగరంలో రేచెర్లపేట, రెల్లిపేట, గొల్లపేట, దుమ్ములపేట, ప్రతాప్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కమ్యునిటీ హాళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతున్నాయి.  

సొంతింటి కల సాకారం 
గత ప్రభుత్వ హయాంలో కనీసం పేద వాడికి ఒక సెంటు భూమైనా ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పేదల సొంతింటి కలను సాకారం చేశారు.  

►రాష్ట్రంలో అతి పెద్ద లే అవుట్‌లలో ఒకటిగా కొమరగిరిలో 350 ఎకరాల లే అవుట్‌కు శ్రీకారం చుట్టారు.  
► మొత్తం 32,927 మందికి స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా ఇప్పుడవి వివిధ దశల్లో ఉన్నాయి.  
► రూ. 20.59కోట్లతో చేపట్టిన 2056 టిడ్కో ఇళ్లను చంద్రబాబు పాలనలో అటకెక్కించగా అందులో 904 ఇళ్లు లబి్థదారులకు అందించారు. 

స్నాతకోత్సవ భవన నిర్మాణం    రూ.19.3 కోట్లు 
రోడ్లు, డ్రైనేజీకి ఖర్చు    రూ.20 కోట్లు 
హాస్టల్‌ భవన నిర్మాణానికి వ్యయం    రూ.6 కోట్లు 
ఇతర అభివృద్ధి పనులకు వెచ్చించిన నిధులు    రూ.97 కోట్లు 
సింథటిక్‌ కోర్టు నిర్మాణానికి ఖర్చు    రూ. 9.50 కోట్లు 

కాకినాడ ముఖచిత్రం 

జీజీహెచ్‌లో కార్పొరేట్‌ వైద్యం 
► కాకినాడ జీజీహెచ్‌లో గతంలో ఎన్న­డూ జరగని రీతిలో గడచిన నాలుగున్నరేళ్లలో అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇందుకు దాతల సహ­కారం కూడా తోడయింది. 
► రూ.15కోట్లతో జీజీహెచ్‌లో క్యాథ్‌ల్యాబ్, ఐసీయూ సదుపా­యాలతో, ఎంఆర్‌ఐ యూనిట్‌ కొత్తగా ఏర్పాటు చేశారు.  
► ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మాణం జీజీహెచ్‌లో పూర్తి కావస్తోంది. మాతాశిశు వైద్య సేవలకు తల­మానికం కానున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.50 కోట్లు.  
► త్వరలో మదర్‌ అండ్‌ ఛైల్డ్‌ బ్లాక్‌ భవంతి సేవలు అందుబాటులోకి రానున్నాయి. – కోరమండల్‌ సంస్థ కేవలం ఏడాదిలోనే చిన్నపిల్లల వైద్య విభాగానికి రూ.40 లక్షల విలువైన వైద్య ఉపకరణాలను అందించింది.  
► కాకినాడ సీ పోర్టు సామాజిక బాధ్యతగా రూ.76 లక్షల విలువైన వైద్య ఉపకరణాలను జీజీహెచ్‌ మత్తు విభాగానికి అందించింది.  
► ఆపన్న మహిళలు, ఆధారం లేని యువతులు, బాలలకు 
అండగా నిలిచేలా 1600 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.­50 లక్షల వ్యయంతో దిశ వన్‌­స్టాప్‌ సెంటర్‌  సిద్దమవుతోంది. 
► జిల్లా కేంద్రంలో అప్పటికే ఉన్న 5 పీహెచ్‌సీలకు అదనంగా తొమ్మిది యుపీహెచ్‌సీల నిర్మాణాన్ని చేపట్టారు.  
► ప్రతి 25 వేల మంది జనాభాకు ఒక అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలనే సంకల్పంతో 14 డాక్టర్‌ వైఎస్సార్‌ పట్టణ ప్రాథ­మిక ఆరోగ్య కేంద్రాలు నిరి్మంచారు. సుమారు.రూ.9కోట్ల వ్యయంతో యుపీహెచ్‌సీలు నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. 


వైఎస్సార్‌ ఆరోగ్యకేంద్రాలు 
మొత్తం యూపీహెచ్‌సీలు    14 
పాత పీహెచ్‌సీలు    5 
కొత్తగా నిరి్మంచినవి    8 
సీఎస్‌ఆర్‌తో నిర్మించినవి    1 
నిర్మాణ వ్యయం   రూ.10.40 కోట్లు 

ప్రగతికి చిరునామా 
ప్రగతికి చిరునామాగా కాకినాడ నగరం నిలిచింది. నగరంలో పక్కా ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు దశలవారీగా చేపడుతుంటంతో ఇది సాధ్యమైంది. బ్రిటిష్‌ హయాం నుంచి కాకినాడ నగరానికి ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడా గుర్తింపును మరింతగా పెంచేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేస్తున్నారు. శానిటేషన్‌–సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో కాకినాడ నగరం దేశంలో రెండో స్థానం సాధించడం... దానికి సంబంధించిన అవార్డును ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి నుంచి అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది.     – డాక్టర్‌ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్, కాకినాడ 

సమష్టి కృషితోనే అభివృద్ధి  
గడచిన నాలుగున్నరేళ్లుగా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నాం. అందరి సహకారంతో అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేయగలిగాం. ప్రధానంగా ఇండియన్‌ స్మార్ట్‌ సిటీ అవార్డుల్లో దేశంలో కాకినాడకు రెండో ర్యాంక్‌ సాధించడం సమష్టి కృషికి నిదర్శనం. వచ్చే ఏడాది మొదటి స్థానం కోసం ప్రయతి్నస్తాం.     – సీహెచ్‌ నాగనరసింహారావు,    కమిషనర్, కాకినాడ నగరపాలక సంస్థ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement