శ్రీవారి క్షేత్రంలో భక్తుల ఇక్కట్లు
కనీసం నేలపై కూర్చునే అవకాశం లేకుండా బాత్రూమ్ నీళ్లు వదలడంపై ఆగ్రహం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: శ్రీవారి భక్తులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. క్యూలైన్లలో అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం కూర్చునేందుకు అవకాశం లేక.. ఆహారం మాట దేవుడెరుగు మంచినీళ్లు అందించే దిక్కులేక అలమటిస్తున్నారు. ఆదివారం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూ.300 టికెట్ తీసుకున్న భక్తులు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటలు దాటినా క్యూలైన్‌లోనే నిలబడాల్సి వచ్చింది. అంత సమయం వేచిఉన్నా మంచినీరు, అన్న ప్రసాదం, చిన్న పిల్లలకు పాలు కూడా సరఫరా చేయలేదు. తమకు ఎదురైన ఇబ్బందులతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూర్చునేందుకూ గతి లేదు
ప్రత్యేక దర్శనాలకు వచ్చిన భక్తులను కంపార్ట్‌మెంట్‌లో ఉంచాల్సింది పోయి గంటల తరబడి క్యూలైన్‌లో నిలబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిలబడిన ప్రాంతంలో బాత్‌రూమ్ నీళ్లు విడిచిపెట్టడంతో కూర్చోవటానికి వీలులేకుండా పోయిందని మండిపడ్డారు. తిరుమలలో పరిస్థితిపై ఓ భక్తుడు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేశారు. ‘రూ.300 తీసుకుని గంటలు గంటలు లైన్‌లో నిలబెట్టడం ఏమిటి. కూర్చుందామనుకుంటే బాత్ రూమ్ నీరు విడిచిపెట్టారు. తాగటానికి మంచినీరు లేదు. అన్న ప్రసాదం లేదు. చిన్న పిల్లలకు పాలు లేక ఏడుస్తున్నారు. వినిపిస్తోందా’ అని ప్రశ్నించారు. ‘తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా. ఇప్పటికంటే గత ప్రభుత్వ పాలనలోనే పరిస్థితి బాగుంది’ అని పలువురు భక్తులు వాపోయారు.
టీటీడీ పరిపాలన భవనంలో సోదాలు
తిరుపతి (అలిపిరి): గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆదివారం విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం స్థానిక టీటీడీ భవనంలో సోదాలు చేపట్టింది. పరిపాలన భవనంలోని పలు విభాగాల్లో ముఖ్యమైన ఫైళ్లను అధికారులు స్వా«దీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment