ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 634 కేసులు, మూడు మరణాలు నమోదు.. పారిశుద్ధ్యాన్ని పట్టించుకోని అధికారులు
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/గూడూరు రూరల్ (తిరుపతి జిల్లా): కలుషిత నీరు, లోపించిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో డయేరియా ముప్పు నానాటికీ అధికమవుతున్నది. జూన్ ఒకటో తేదీ నుంచి 22వ తేదీ మధ్య వివిధ జిల్లాల్లో ఏకంగా 20 డయేరియా ఘటనలు చోటు చేసుకున్నాయి. 634 కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృత్యువాత పడినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైద్య శాఖ లెక్కల ప్రకారం కాకినాడ జిల్లా ఎ.వి.నాగారం పీహెచ్‌సీ పరిధిలో 86 కేసులు నమోదవ్వగా ఒకరు మృతి చెందగా, ఇదే జిల్లాలోని వేటపాలెం పీహెచ్‌సీ పరిధిలో 32 కేసులు ఒక మరణం నమోదైంది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో 79 కేసులు, ఒక మరణం సంభవించింది. తాజాగా మంగళవారం నాటికి పట్టణంతో పాటు జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో మరో 11 మంది వాంతులు, విరేచనాలతో ప్రభుత్వాస్పత్రిలో చేరారు. జగ్గయ్యపేట పట్టణంలో డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో.. మంగళవారం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ (రాజమండ్రి) నాగ నరసింహారావు పారిశుద్ధ్య నిర్వహణపై స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలు సచివాలయాల్లో సిబ్బందికి డ్రెస్ కోడ్ లేకపోవడంతో ఒకరోజు వేతనం కట్ చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావును ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రికి డయేరియా కేసులు వస్తుండడంతో డీఎంహెచ్‌వో సుహాసిని పర్యవేక్షిస్తూ.. అవసరమైతే మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారు. అలాగే మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరులోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ధ్యాన్‌చంద్ మంగళవారం ఆకస్మికంగా పరామర్శించారు.
విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా డయేరియా బారినపడిన వ్యక్తులు, మృతుల సంఖ్య అనధికారికంగా ఇంకా అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరడంతో వివిధ శాఖల అధికారులు మంచి పోస్టింగ్‌లు తెచ్చుకోవడం, ఇప్పటికే ఉన్న పోస్టింగ్‌ల్లో కొనసాగేలా పెద్దలను ప్రసన్నం చేసుకునే పనుల్లో పడ్డారు.
దీంతో క్షేత్రస్థాయిలో పాలన గాడి తప్పింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపిస్తున్నది. తొలకరి నేపథ్యంలో నదులు, చెరువులు, బావుల్లోని నీరు కలుషితమై అతిసార వ్యాప్తి చోటు చేసుకుంటున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూర్తిస్థాయిలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళికతో అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment