సి.బండపల్లి వద్ద రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి, అమరావతి/శాంతిపురం: అక్రమ మైనింగ్‌కు బాధ్యులైన వారిని వదిలిపెట్టేదిలేదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. పర్యావరణానికి, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమార్కులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్న పలు అక్రమ క్వారీలను మూసివేశామని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ముద్దనపల్లి రెవెన్యూ పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్న ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రకాష్, ఏడీ పీ వేణుగోపాల్‌తో కలిసి గురువారం శాంతిపురం, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ క్వారీయింగ్ ప్రాంతాన్ని వారు తనిఖీ చేశారు.
అటవీశాఖ ఆధీనంలోని ఈ భూముల్లో అక్రమంగా కొందరు వ్యక్తులు మైనింగ్ చేస్తున్నారని, సమాచారం అందిన ప్రతీసారి దాడులు నిర్వహించి, వాహనాలు, యంత్రాలు, గ్రానైట్ సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు వెంకట్‌రెడ్డికి వివరించారు. శాంతిపురం, ముద్దనపల్లె ప్రాంతంలో గత అక్టోబర్ 25, 28, డిసెంబర్ 23న ఇదే ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సర్వే నంబరు 104, 213 పరిధిలోని అటవీ భూముల్లో భారీగా గ్రానైట్ బ్లాకులను సీజ్ చేశామన్నారు. మహాచెక్‌లో భాగంగా ఇటీవల ఇదే ప్రాంతంలో 4 బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో 40 గ్రానైట్ దిమ్మెలు, 6 కంప్రెసర్లను, 2 హిటాచీ యంత్రాలను సీజ్ చేసినట్లు వారు చెప్పారు. ఈ ప్రాంతాలను పరిశీలించి వీజీ వెంకటరెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. అవి..
► అటవీశాఖ పరిధిలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌పై ఆ శాఖ ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. అటవీ శాఖ డీఎఫ్‌ఓకు లేఖ రాయడంతో పాటు ఇక్కడి పరిస్థితిని వివరించి అటవీ అధికారుల నిఘాను పెంచేలా చూడాలి.
► ఫారెస్టు యాక్ట్–1980 ప్రకారం.. అక్రమార్కులపై కేసులు నమోదయ్యేలా చూడాలి.
ఆ భూముల్లోకి ఎవరూ వెళ్లకూడదు
ద్రవిడ వర్సిటీ పరిధిలోని భూముల్లో అక్రమ మైనింగ్‌పై గతంలో దాడులు చేసి 131 గ్రానైట్ బ్లాకులను సీజ్ చేసినట్లు అధికారులు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ..వర్సిటీలోని హరప్పా భవనం సమీపంలో ఉన్న భూముల్లోకి ఎవరూ వెళ్లకుండా గాడి కొట్టించి, భద్రతా సిబ్బందిని నియమించాలని.. అనుమతిలేకుండా ఎవరినీ ఈ ప్రాంత పరిధిలోకి రాకుండా చూడమని వర్సిటీ అధికారులను కోరాలని ఆదేశించారు.
చెక్ పోస్టుల్లో ప్రత్యేక నిఘా
వెంకటరెడ్డి మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్ ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, గనుల శాఖ అధికారుల బృందాలతో మొబైల్ తనిఖీలు కూడా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ ఇతర రాష్ట్రాలకు ఖనిజాలను తరలించకుండా చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేశామన్నారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా గనుల శాఖ ఈ మధ్యకాలంలో రూ.5 కోట్ల విలువైన 555 గ్రానైట్ బ్లాక్‌లను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. వీటిని వేలం ద్వారా విక్రయిస్తామన్నారు. ప్రభుత్వ అనుమతితో దీనిపై ఓ యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment