
శ్రీకాకుళం నగరంలో వృద్ధురాలికి పింఛన్ అందిస్తున్న వార్డు వలంటీర్ తనూజ
సాక్షి, అమరావతి: జూన్ 1వ తేదీ.. మంగళవారం.. తెల్లవారకముందే లక్షల ఇళ్ల తలుపుతట్టిన వలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కరోనా భయంలోనూ అంకితభావంతో విధులు నిర్వర్తించారు. కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి కూడా ఆస్పత్రులకు వెళ్లి మరీ పింఛను డబ్బు అందజేశారు. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 56,12,751 (91.31 శాతం) మందికి పింఛన్లు అందజేశారు. రూ.1,350.76 కోట్లను పంపిణీ చేశారు. వేర్వేరు కారణాలతో మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోని వారికి బకాయిలతో కలిపి ఈ నెల డబ్బులు ఇచ్చారు. ఒకనెల బకాయితో కలిపి 2.06 లక్షల మందికి రెండు నెలల పింఛను డబ్బుల విడుదల చేయగా.. అందులో 1.41 లక్షలమందికి మంగళవారం పంపిణీ చేశారు. రెండు నెలల బకాయిలతో కలిపి 10,115 మందికి మూడు నెలల డబ్బులు అందజేశారు. మూడు నెలల బకాయిలు కలిపి ఏడుగురికి నాలుగు నెలల పింఛను పంపిణీ చేశారు. పోర్టబులిటీ విధానంలో రాష్ట్రంలో ఎక్కడైనా పింఛను తీసుకోవడానికి 7,441 మంది దరఖాస్తు చేసుకోగా, వారందరికీ వారు ఉన్నచోటే సొమ్ము అందజేశారు. ఈనెలలో 61.46 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు రూ.1,497.63 కోట్లను విడుదల చేశారు. మంగళవారం 91.31 శాతం పంపిణీ పూర్తయింది. బుధ, గురువారాల్లో కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
యాచకుడికి పింఛను
యాచన చేస్తూ జీవనం సాగించే ఆ వృద్ధుడికి రూ.2,250 పింఛను అందడంతో అతడి కళ్లల్లో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. కాకినాడ నూకాలమ్మగుడి సమీపంలో పిట్టా గోపి (76) యాచనతో జీవనం సాగిస్తున్నాడు. బస్‌షెల్టర్‌లో తలదాచుకుంటున్నాడు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవతో అతడికి రేషన్‌కార్డు, పింఛను మంజూరయ్యాయి. ఎంఎస్‌వో ఎంవీ మురళీకృష్ణ, 40వ డివిజన్ సచివాలయ అడ్మిన్ ఎన్.శ్రీలక్ష్మి, వెల్ఫేర్ సెక్రటరీ షర్మిలాలక్ష్మి మంగళవారం అతడికి వృద్ధాప్య పింఛను రూ.2,250 అందజేశారు. ఆనందంగా ఈ పింఛను అందుకున్న అతడి కళ్లల్లో బతుకు భరోసా కనిపించింది.
– కాకినాడ
కోవిడ్‌తో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని ప్రసాద్ నగరానికి చెందిన వృద్ధురాలు పి.కమలమ్మ కరోనా పాజిటివ్‌తో కొద్దిరోజులుగా చీరాల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సచివాలయం–2 వలంటీర్ సాయి ఆదివారం ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పింఛను నగదు అందజేశారు.
– వేటపాలెం
వలంటీర్ల సేవలు భేష్
చిత్తూరులో కరోనాతో చికిత్స పొందుతున్న వారికి, హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నవారికి కూడా మంగళవారం వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేశారు. ఆర్‌వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్రమణ్యానికి వలంటీర్ పి.ఎస్.నాగార్జున, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న ఆనందవేల్‌కు వలంటీర్ మోహన్‌శ్రీనివాస్ పింఛన్ల సొమ్ము అందజేశారు.
– చిత్తూరు అర్బన్
హైదరాబాద్ వెళ్లి పింఛను పంపిణీ
కరోనా లక్షణాలతో హైదరాబాద్‌లోని కుమార్తె ఇంటివద్ద చికిత్స పొందుతున్న వల్లభనేని శివపార్వతికి పాయకాపురం 262 సచివాలయం వలంటీరు నున్న అశోక్ మంగళవారం హైదరాబాద్ వెళ్లి పింఛను అందజేశారు. ఈ నెల కూడా పెన్షన్ తీసుకోకపోతే రద్దయ్య ప్రమాదం ఉన్నందున వలంటీర్ అశోక్ వెళ్లి మూడు నెలల పెన్షన్ రూ.6,750 ఆమెకు అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
– పాయకాపురం, విజయవాడ రూరల్
24 కిలోమీటర్లు వెళ్లి..
ఇతడి పేరు సుబ్బరాయుడు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని ఇప్పేరు గ్రామం. కరోనా లక్షణాలు ఉండటంతో మంగళవారం ఉదయం 24 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకునేందుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ వలంటీర్ రజని అనంతపురం చేరుకుని ఆస్పత్రి వద్దే కోవిడ్ నిబంధనల మధ్య పింఛను పంపిణీ చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
బ్లాక్‌ఫంగస్ బాధితుడికి పింఛను
బ్లాక్‌ఫంగస్ సోకి విశాఖలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి.. వలంటీర్ కరుకోల రాజేశ్వరి దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి పింఛను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం చిన్నకోడూరుకు చెందిన మెట్ట అప్పారావు బ్లాక్‌ఫంగస్ సోకి విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. చిన్నకోడూరు వలంటీరు రాజేశ్వరి స్వయంగా విశాఖలో ఆస్పత్రికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశారు. ఎంతో శ్రమపడి తనకు పింఛను ఇచ్చిన వలంటీర్‌కు వెంటిలేటర్‌పై ఉన్న అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు.
– పోలాకి
బాలింత అయినా విధి నిర్వహణలో అంకితభావం
కరోనా వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలోను విధి నిర్వహణే పరమావధిగా భావించిన వలంటీరు చింతపల్లి హేమలత.. బాలింత అయినా కూడా పింఛన్లు పంపిణీ చేశారు. ఆమె జీవీఎంసీ 30వ వార్డులోని కొత్త జాలారిపేటలో వలంటీర్‌గా పనిచేస్తున్నారు. 15 రోజుల కిందట బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. మంగళవారం యథావిధిగా పింఛన్లు పంపిణీ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. వార్డు కార్పొరేటర్ కోడూరి అప్పలరత్నం, కొత్త జాలారిపేట వెల్ఫేర్ సెక్రటరీ ఫణిరాజ్ శరకం, అడ్మిన్ సెక్రటరీ వరలక్ష్మి, పలువురు వలంటీర్లు హేమలతను అభినందించారు.
– డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ)
ఆస్పత్రికి వెళ్లి పింఛన్ పంపిణీ
పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన దాస్యం పెరుమళ్లు కరోనాతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామ వలంటీర్ గెడ్డం సురేష్ మంగళవారం రాజమండ్రి వెళ్లి పీపీఈ కిట్ ధరించి ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న పెరుమళ్లుకు వితంతు పింఛన్ అందజేశారు.
– చాగల్లు
కరోనా బాధితుడికి పింఛను
వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం తిరువెంగళాపురం పంచాయతీ పాతతిరువెంగళాపురం గ్రామ వలంటీర్ రాగే రమణయ్య కడప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్‌కు పింఛను అందజేశారు. గ్రామానికి చెందిన నారిబోయిన పుల్లయ్య కరోనాతో బాధపడుతూ కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం పుల్లయ్యకు పింఛన్ ఇచ్చేందుకు ఇంటికి వెళ్లిన వలంటీర్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో వెంటనే కడప వెళ్లి ఆస్పత్రిలో పుల్లయ్యకు పింఛన్ అందజేశారు.
– బద్వేలు అర్బన్
Comments
Please login to add a commentAdd a comment