తిరిగి విధుల్లోకి తీసుకున్న సిబ్బందికి పత్రాలు అందిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, ఈవో భ్రమరాంబ
సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నన్నట్టు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా ఇటీవల దేవస్థానం ఆదాయం ఘననీయంగా పడిపోయిందన్నారు. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. దానికారణంగా కొందరు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. దీంతో వారు పడిన ఇబ్బందులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన మానవతా దృక్పథంతో స్పందించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రిని ఆదేశించారన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవస్థానం చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు, దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తిరిగి విధుల్లో చేరిన సిబ్బంది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ, ట్రస్ట్‌బోర్డు మెంబర్లు వారణాసి దినేష్‌రాజ్, సూరిశెట్టి సూరిబాబు, కోరాడ లక్ష్మణ్‌కుమార్, దాడి దేవి, సిరిపురపు ఆషాకుమారి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
రాజకీయాలొద్దు
దేవస్థానం విషయంలో రాజకీయాలొద్దని అన్ని రాజకీయపార్టీలకు మంత్రి అవంతి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దేవస్థానం భూములను లీజులకిచ్చే నిర్ణయం కొత్తగా మేమేదో తీసుకున్నట్టు ప్రచారం చేయడం తగదన్నారు. అసలు గతంలో దేవస్థానం భూములను లీజులకిచ్చిందెవరని ప్రశ్నించారు. దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచగ్రామాల భూసమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. ముత్తంశెట్టి తొలుత ఆలయ బేడాప్రదక్షిణ చేసి స్వామికి పూజలు నిర్వహించారు. కప్పస్తంభానికి మొక్కుకున్నారు.
పరిపాలన రాజధానిగా విశాఖను ఎవరు ఆపలేరు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : విశాఖలో పరిపాలన రాజధానిని ఎవరూ ఆపలేరని మంత్రి ముత్తంశెట్టి స్పష్టం చేశారు. తాత్కాలికంగా అడ్డంకులు సృష్టించినా అంతిమ విజయం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా ఆపలేరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment