సాక్షి ప్రతినిధి, విజయనగరం: మధ్యవర్తిత్వంతో వివాదాల పరిష్కారానికి న్యాయవాదులు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం నరసింహ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో రూ.99.20 కోట్లతో నిర్మించనున్న జిల్లా కోర్టు భవనాల సముదాయానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.
జస్టిస్ నరసింహమాట్లాడుతూ వివాదాల పరిష్కారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన వారు ఏళ్ల తరబడి న్యాయం కోసం వేచి చూడకుండా న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతీ యువకులు జిల్లా కోర్టుల్లో తమ వృత్తిని ప్రారంభించేలా సీనియర్ న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. విజయనగరంలో నూతన కోర్టు భవనాల ద్వారా మంచి వసతులు సమకూరనున్నాయని, వీటిని వినియోగించుకుని న్యాయవాదులు సమాజానికి సేవలు అందించాలని సూచించారు.
జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా న్యాయ వ్యవస్థను నిలపాల్సి ఉందన్నారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా జడ్జి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment