సమీక్ష నిర్వహిస్తున్న శైలేష్‌కుమార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు పక్కా గృహాల కల్పనలో భాగంగా ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం మంచి పరిణామమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని గ్రామీణ గృహ నిర్మాణ డైరెక్టర్(రూరల్ హౌసింగ్) శైలేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు పట్ల శైలేష్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–గ్రామీణ్) పురోగతిని పరిశీలించడంలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన శైలేష్‌కుమార్ విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, సబ్సిడీపై నిర్మాణ సామగ్రి, పావలా వడ్డీకి రూ.35 వేలు సాయం వంటి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించారు.
పీఎంఏవై–గ్రామీణ్ కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పథకం అమల్లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని గృహ నిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మిషా చెప్పడంతో సచివాలయాల వ్యవస్థ గురించి శైలేష్‌కుమార్ అడిగి తెలుసుకున్నారు. జేఎండీ ఎం.శివప్రసాద్, చీఫ్ ఇంజినీర్ జీవీ ప్రసాద్, ఎస్‌ఈలు జయరామాచారి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment