సాక్షి, అమరావతి: వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయం(శుక్రవారం) నుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి నెల పింఛన్‌ను మార్చి ఒకటో తేదీన నేరుగా లబ్ధిదారుల చేతికి వారి ఇంటి వద్దే అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.
కాగా, శుక్రవారం తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వలంటీర్లు ప్రారంభించారు ఈ మేరకు పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.1,958.52 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. లబ్ధిదారులకు పింఛను అందజేసే సమయంలో గుర్తింపు కోసం ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్, ఐరిస్, ముఖ ప్రమాణీకరణ విధానాలను అమలు చేస్తున్నారు.
అలాగే ఆర్‌బీఐఎస్ విధానం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛను అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ఐదు రోజుల్లో పింఛన్లను నూరు శాతం పంపిణీ చేయాలని వలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది..
Comments
Please login to add a commentAdd a comment