సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. తాజాగా పెంచిన మొత్తంతో కలిపి రూ.మూడు వేల చొప్పున ఈనెల పింఛను డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ ప్రతినెలా ఇచ్చే రూ.2,750 పెన్షన్ మొత్తాన్ని ఈ జనవరి ఒకటి నుంచి రూ.మూడు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 8వ తేదీ వరకు మండలాల వారీగా ఉత్సవాలు నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలి సిందే. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నుంచి కొత్తగా మరో 1,17,161 మందికి పింఛన్లు మంజూ రు చేసింది. మొత్తంగా ఈ నెలలో 66.34 లక్షల మందికి రూ.1,968 కోట్లను విడుదల చేసింది.
పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు..
నిజానికి.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పెన్షన్ మొత్తాన్ని ఏటేటా పెంచుకుంటూ ఈ జనవరి నుంచి రూ.మూడువేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇలా సీఎం జగన్ తానిచ్చిన మాటను అమలుచేసి చూపించడంతో సోమవారం రాష్ట్రంలో పలు మండలాలు, మున్సిపాలిటీల్లో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడ పెన్షన్ లబ్దిదారులతో మమేకమవుతూ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. వలంటీర్లు కూడా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment