సాక్షి, అమరావతి: దీపావళి వెలుగులపై టపాసుల ధరలు నీళ్లు చల్లాయి. కాకరపువ్వొత్తులు కూడా కొనలేని స్థితికి తెస్తున్నాయి. వీటివల్ల ప్రజలకు పండగ ఆనందం దూరమవడమే కాదు.. వ్యాపారాలనూ దెబ్బతీస్తున్నాయి. గత ఏడాది కరోనా కారణంగా దీపావళి వెలవెలబోయింది. ఈ ఏడాదైనా వెలుగులు కురిపిస్తుందనుకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతేడాదితో పోలిస్తే అన్ని టపాసుల ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కాకరపువ్వొత్తుల పెట్టె కూడా ఈ ఏడాది రూ.50 పెట్టందే రాదని వ్యాపారులు చెబుతున్నారు.
టపాసుల్లో భారీ డిమాండ్ ఉండే 1000 వాలా సీమటపాకాయల ధర ఈ ఏడాది రూ.600 పైనే పలుకుతోందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన హోల్‌సేల్ వ్యాపారి శ్రీనివాసరావు చెప్పారు.ధరలు ఇలా ఉంటే ప్రజలు కొనడం తగ్గించేస్తారని, వ్యాపారం పడిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పండుగకు మరో అయిదు రోజులే ఉన్నప్పటికీ, రిటైలర్లు కూడా కొనుగోలుకు అంతగా ముందుకు రావడంలేదని శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఏడాది అమ్మకాలు బాగుంటాయన్న ఉద్దేశంతో భారీగా టపాసులు కొన్నామని, ధరలు పెరగడంతో రిటైల్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని విజయవాడకు చెందిన హోల్‌సేల్ వ్యాపారి ఎన్.మల్లిఖార్జునరావు పేర్కొన్నారు.
ధరల పెరుగుదలకు కారణమిదీ..
కోవిడ్‌తో పాటు బాణసంచా అత్యధికంగా తయారయ్యే తమిళనాడులోని శివకాశిలో ఈ ఏడాది వరుస అగ్నిప్రమాదాలు జరిగాయి. దీంతో ఉత్పత్తి తగ్గింది. డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలూ తడిసిమోపెడయ్యాయి. ఈ కారణాల వల్ల ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు రిటైల్ షాపుల ఏర్పాటుకు నిబంధనలు కఠినతరం చేయడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. వీటివల్ల ఈ ఏడాది అమ్మకాలు 40 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
గ్రీన్ క్రాకర్స్‌కు పెరిగిన డిమాండ్
పర్యావరణ అనుకూలమైన గ్రీన్ క్రాకర్స్‌కు డిమాండ్ పెరుగుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. తక్కువ శబ్దంతో రంగు రంగుల్లో ఉండే చిచ్చుబుడ్లు, షాట్స్ ఎక్కువగా అడుగుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన వ్యాపారి కేవీఎన్ మూర్తి చెప్పారు. టపాసులు కాల్చిన తర్వాత వచ్చే వ్యర్థాల నుంచి మొక్కలు వచ్చే టపాసులు, డ్రోన్ ఫైర్ వర్క్స్ వంటివి ఈ ఏడాది ఎక్కువగా అందుబాటులోకి వచ్చినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. వీటి ధరలు కూడా భారీగానే ఉంటున్నాయి. గ్రీన్ క్రాకర్స్ ధరలు రూ.200 నుంచి మొదలవుతున్నాయి.
ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు
ఆన్‌లైన్ ద్వారా కూడా టపాసుల అమ్మకాలు జరుగుతున్నాయి. స్టాండర్డ్ కంపెనీతో పాటు పలు సంస్థలు హైదరాబాద్ క్రాకర్స్, క్రాకర్స్‌వాలా, క్రాకర్స్‌మేళా పేరుతో ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. నచ్చిన వస్తువులను విడివిడిగా తీసుకోవడంతో పాటు పలు రకాల టపాసులను కలిపి ప్యాక్‌లుగా కూడా విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో గిఫ్ట్ బాక్స్ ధరలు రూ.1,250 నుంచి రూ.3,950 వరకు ఉన్నాయి.
పేలుతున్నాయ్.. టపాసుల ధరలు
Published Sun, Oct 31 2021 2:27 AM | Last Updated on Sun, Oct 31 2021 10:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment