సాక్షి, విశాఖపట్నం: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు.
డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని విశాఖ నుంచి తరలించారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణం విడిచిన ఆయన భౌతికకాయాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీ అనాటమీ విభాగంలో ఎంబాంబ్ మెంట్ చేపట్టారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. రెండు గంటల పాటు జరిగిన ఈ ప్రక్రియ అనంతరం భౌతికకాయాన్ని విశాఖ నుంచి తిరుపతి తరలించారు. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని చూసి పలువురు చలించిపోయారు. తిరుమల వెంకన్న స్వామితో ఆయన సుదీర్ఘ అనుబంధం గుర్తు చేసుకున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి డాలర్ శేషాద్రి అకాల మరణం పై విచారణ వ్యక్తం చేశారు. రేపు(మంగళవారం) తిరుపతి గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
తిరుమలలో1944లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే పీజీ చేశారు. 1978లో టీటీడీలో చేరిన ఆయన.. 2006 జూన్ లో రిటైరయ్యారు. అప్పటి నుంచి ఓఎస్డీగా కొనసాగుతున్నారు.
డాలర్ శేషాద్రికి ఆ పేరెలా వచ్చింది?
శేషాద్రి అంటే అసలు ఎవరికీ తెలియదే. అదే డాలర్ శేషాద్రి అంటే సులువుగా గుర్తుపడతారు. ఆయనకా పేరు రావడానికి రెండు కారణాలున్నాయి. నుదుట నామాలు ధరించి మెడలో పెద్ద డాలర్‌ను ధరించడం వల్లే ఆయనకు డాలర్ అనే బిరుదు వచ్చింది. ఆత్మీయులు, సన్నిహితులు ఆయనను డాలర్ మామ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఇక శ్రీవారి ఆలయంలో స్వామి వారి ప్రతిమతో కూడిన డాలర్‌ను తయారు చేసి విక్రయించేవారు. అది కూడా డాలర్ చేతుల మీదుగానే కొనసాగేది. అప్పటి నుంచి శేషాద్రికి బదులుగా డాలర్ శేషాద్రిగానే ఆయన ప్రాచుర్యం పొందారు.
గుమాస్తా నుంచి ఓఎస్డీ స్థాయికి..
టీటీడీలో డాలర్ శేషాద్రికి ఎంతో పేరు ఉంది. సాధారణ గుమాస్తాగా చేరి దేవస్థానం ఓఎస్డీ స్థాయికి ఎదిగారు. 50 ఏళ్ల నుంచి శ్రీవారి ఆలయ సంప్రదాయాలు, ఉత్సవాలు, కైంకర్యాలు, సేవలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై శేషాద్రికి పట్టు ఉంది. అందుకే రిటైర్మెంట్ అయి పదేళ్లకు పైనే అయినప్పటికీ ఆయన సేవలను వినియోగించుకుంటున్నారు.
వీఐపీ దర్శనాలకు అన్నీ తానై..
తిరుమలకు ఎంతో మంది వీఐపీలు, వీవీఐపీలు వెంకన్నను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇలా వచ్చిన వీఐపీలు ప్రత్యేకించి డాలర్ శేషాద్రి ఆశీస్సులు పొందేందుకు ఆసక్తి చూపుతారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన ప్రముఖులకు శేషాద్రి చేతుల మీదుగానే మర్యాదలు జరుగుతుండేవి. ఆయనకు చాలా మంది ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దగ్గర నుంచి నేటి మోదీ వరకు.. అంబానీలు, అదానీలు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రపతులు ఇలా వీఐపీలు, వీవీఐపీలు ఎవరొచ్చినా డాలర్ శేషాద్రి దగ్గరుండి దర్శనాలు చేయించేవారు.
డాలర్ శేషాద్రి మరణం బాధాకరం: టీటీడీ ఛైర్మన్
డాలర్ శేషాద్రి మరణం బాధాకరమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని మాజీ సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: అమ్మో.. మళ్లీ వాన
Comments
Please login to add a commentAdd a comment