90,000 మందికి సేవలందించేలా ఆర్టీసీ ఉద్యోగులకు ఆస్పత్రి | Dr Ysr Area Hospital Established In Kadapa | Sakshi
Sakshi News home page

90,000 మందికి సేవలందించేలా ఆర్టీసీ ఉద్యోగులకు ఆస్పత్రి

Published Fri, May 7 2021 5:40 AM | Last Updated on Fri, May 7 2021 12:19 PM

Dr Ysr Area Hospital Established In Kadapa - Sakshi

సాక్షి, అమరావతి: ఐదు జిల్లాలకు చెందిన దాదాపు 90 వేల మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులకు సేవలందించేలా కడపలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఏరియా ఆస్పత్రిని సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. మోడల్‌ డిపోగా రూపొందించిన చిత్తూరు జిల్లా పుంగనూరు ఆర్టీసీ బస్‌ డిపో కూడా సీఎం చేతుల మీదుగా వర్చువల్‌ విధానంలో ప్రారంభమైంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం కడపలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఏరియా ఆస్పత్రిని ప్రారంభించడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ సమయంలో ఆస్పత్రి ద్వారా ఆరోగ్యశాఖ, ఆర్టీసీ సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ ఆస్పత్రి వల్ల సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, దీనిపై గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని సీఎం చెప్పారు. 
90,000 మందికి వైద్య సేవలు
కడపలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ వ్యయం రూ.3.8 కోట్లు కాగా మరో రూ.2 కోట్లతో మెడికల్‌ ఎక్విప్‌మెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. 1.6 ఎకరాల విస్తీర్ణంలో ఆస్పత్రి నిర్మాణం జరగ్గా ఏడుగురు వైద్య నిపుణులు, 25 మంది పారా మెడికల్‌ సిబ్బందితో పాటు హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఈ ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్య నిపుణులు సేవలందిస్తారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు కలిపి దాదాపు 90 వేల మందికి ఈ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందించనున్నారు. కడప బస్‌ స్టేషన్‌ను ఇకపై డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి బస్‌ స్టేషన్‌గా వ్యవహరించనున్నారు.

  •  పుంగనూరు డిపోను రూ.7.5 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 65 బస్సులతోమోడల్‌ డిపో తీర్చిదిద్ది వర్క్‌షాప్‌ నిర్మించారు.
  • డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆర్టీసీ వైస్‌ చైర్మన్, ఎండీ ఆర్పీ ఠాకూర్, ఈడీలు కృష్ణమోహన్, కోటేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుంగనూరు నుంచి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, పలువురు ఎమ్మెల్యేలు, కడప నుంచి డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్యెల్యేలు, కడప మేయర్‌ సురేష్‌బాబు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. 

సంస్థకు ప్రాణం పోశారు 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ డిపోలు మూతబడే పరిస్థితి రావడంతో ప్రైవేట్‌పరం చేసే యత్నం చేసిందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంస్థకు ప్రాణం పోసి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ఏటా దాదాపు రూ.3,600 కోట్ల భారం పడుతున్నా వెనుకంజ వేయలేదని చెప్పారు. అంత గొప్ప మనసున్న మనిషి సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రి, పుంగనూరు డిపోను ప్రారంభించామని, కార్మికుల శ్రేయస్సు కోసం ఇంతగా ఆలోచిస్తున్న సీఎం ఉండడం మన అదృష్టం అని చెప్పారు.
– పేర్ని నాని, రవాణా శాఖ మంత్రి

పుంగనూరు ప్రజలకు వరం 

పుంగనూరు డిపోను ప్రారంభించి ముఖ్యమంత్రి జగన్‌ తన పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పుంగనూరు ప్రజలకు ఇది వరం లాంటిదని, 40 ఏళ్లుగా మునిసిపాలిటీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు డిపో లేదన్నారు. దివంగత వైఎస్సార్‌ హయాంలో పనులు మొదలైనా తర్వాత ముందుకు సాగలేదని, ఇన్నాళ్లకు ఆయన తనయుడు సీఎం జగన్‌ సాకారం చేశారన్నారు.


– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement